తీర్చగలిగే వరకు అవి అప్పులు…
అప్పులు కట్టలేక చేతులెత్తేస్తే అవి నష్టాలు…
తొమ్మిదేళ్లలో తెలంగాణ కూరుకున్నది అప్పుల కుప్పల్లోనే కాదు …నష్టాల ఊబుల్లో కూడా…
Ads
*************
ఇటీవల ఒక ఏకనామిక్స్ ప్రొఫెసర్ మన యువరాజును ఇంటర్వ్యూ చేశారు…అందులో కొంత…
ప్రొఫెసర్: మన విద్యుత్ సంస్థలు 50 వేల కోట్లకు పైగా అప్పుల్లో కూరుకు పోయాయట? డిస్కమ్ ల ర్యాంకింగు అధోగతికి పడిపోయిందట…భారీగా ఛార్జీలు పెంచకుండా అప్పులు తీర్చడం సాధ్యం కాదని మీమీద ఆరోపణ…
యువరాజు: చూడండి…అప్పులు చేయకుండా అభివృద్ది ఎలా సాధ్యం…కరెంటు కొరత లేకుండా చేయడానికి అప్పులు తెచ్చామ్…ఇందులో దాచేదెముంది…?
ప్రొఫెసర్: అవును… దీనిని డెఫిసిట్ ఫైనాన్సింగ్ (Deficit Financing) అంటారు. ఇది డెవెలప్మెంటల్ ఏకనామిక్స్ లో భాగం… ఇల్లుకొంటే అప్పులు ఉంటాయి…మనం ఇల్లు కట్టుకోవాలన్నా అప్పు చేయకుండా కడతామా…? అమెరికా లాంటి దేశాలకు కూడా బిలియన్ల డాలర్ల అప్పులు ఉన్నాయి…
యువరాజు: కరెక్టుగా చెప్పారు… అప్పులు తెచ్చి పెట్టుబడి పెడితే దానిపై రాబడి వచ్చి అప్పులు తీర్చగలిగితే ఆ అప్పులు సమర్దనీయం… మేము చేసింది అదే…
*****************
చూసే జనాలు ఏమీ తెలియని చాలా అమాయకులన్నట్టుగా సాగింది ఈ ఇంటర్వ్యూ…
****************
జనాలను కన్ఫ్యూస్ చేసే ప్రయత్నం ఇది…
మొదటగా తెలంగాణ విద్యుత్ సంస్థలకు 50 వేల కోట్ల రూపాయలకు పైగా ఉన్నది అప్పులు కాదు…నష్టాలు… ప్రొఫెసర్ గారికి సమాచారం లేదను కుంటా…
ఇక్కడ అప్పులకు, నష్టాలకు తేడా తెలుసుకోవాలి…
****************
మీరు బిజినెస్ కోసం ఓ 50 లక్షల రూపాయలు బ్యాంకు దగ్గర అప్పుచేయాలనుకున్నారు. మొదటగా బ్యాంకు వాళ్ళు అడిగే ప్రశ్న “అప్పు తిరిగి ఎలా చెల్లిస్తారు?” అని. బిజినెస్ ద్వారా వచ్చే ఆదాయంతో అసలు, వడ్డీ చెల్లిస్తామని మీరు చెబుతారు. “ఒకవేళ మీ బిజినెస్ సరిగ్గా నడవకుంటే?” అని బ్యాంకు వారి ప్రశ్న. దానికోసం బ్యాంకు దగ్గర మీరు ఇంటినో, ఇతర ఆస్తులనో స్యూరిటీ పెడతారు.
ఒకవేళ బిజినెస్ అస్సలు నడవక, ఆదాయం ద్వారా అప్పు చెల్లించే పరిస్తితి లేకుంటే, అప్పు నష్టంగా మారినట్టు లెక్క… మీ ఆస్తులను బ్యాంకు వారు వేలం వేసి అప్పు కింద రాబట్టుకుంటారు.
********************
ఇక విద్యుత్ సంస్థల దగ్గరకొద్దామ్… విద్యుత్ సంస్థలు అప్పులకోసం లక్ష కోట్లకు పైగా అప్పులు చేశారు.
ఈ అప్పులలో సగం కొత్తగా కట్టే పవర్ ప్రాజెక్టులపైన పోశారు. ఇందులో కట్టిన 1080మెగావాట్ల భద్రాద్రి ప్రాజెక్టు ఉత్పత్తి పరంగా దేశంలోనే అత్యధిక ఖరీదైన ప్రాజెక్టులలో ఒకటి. గోదావరి నది ఒడ్డున కట్టడంతో సాధారణ వరదలకే ప్లాంటులోకి నీళ్ళు రావడం పరిపాటిగా మారింది. పోలవరం నిర్మాణం పూర్తయితే చిన్న వరదకే పూర్తిగా మునగడం ఖాయం. 16 నెలల్లో కడతామన్నది 6 ఏళ్ళు పట్టింది. ఇంకోటి 4000 వేల మెగావాట్ల యాదాద్రి ప్రాజెక్టు. నాలుగేళ్లలో కడతామన్నది 7 ఏళ్లయినా ఇంకా పూర్తి కాలేదు… సుమారు 50 వేలకోట్లు ఈ రెండింటికే అయింది.
బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకే విద్యుత్తు దొరుకుతుంటే, మనమేమో తెల్ల ఏనుగుల్లాంటి ఖరీదైన ప్రాజెక్టులపై వేల కోట్లు తగలేశామ్…!
*****************
ఇక ఉచిత విద్యుత్తు… మన విద్యుత్తు ఏ మాత్రం సరిపోక బహిరంగ మార్కెట్లో భారీ ఎత్తున కోనాల్సిన పరిస్తితి. విద్యుత్ సంస్థలు అప్పులు చేసి కిందా, మీదా పడి రైతులకు కరెంటు సరఫరా చేస్తే, ఆ ఖర్చులు ప్రభుత్వం సబ్సిడీ కింద భరించదు. ఇప్పటికీ 25 వేలకోట్ల వ్యవసాయ సబ్సిడీలు ప్రభుత్వం ఎగ్గొట్టింది…
మరోవైపు మన ఎత్తిపోతల పధకాలకు సరఫరా చేసిన విద్యుత్తు బకాయిలు 12 వేల కోట్ల రూపాయలు దాటాయి. మొత్తం ప్రభుత్వ శాఖలు చెల్లించాల్సిన బకాయిలు 20 వేల కోట్ల రూపాయిల పైనే..
ప్రభుత్వం నుండి సబ్సిడీలు, ప్రభుత్వ శాఖలనుండి బకాయిలు వసూలయ్యే పరిస్తితి లేదని విద్యుత్ సంస్థలు చేతులెత్తేసాయి. కొత్తగా అప్పు చేద్దామంటే తాకట్టు పెట్టడానికి గజం భూమి కూడా మిగలలేదు. అప్పులన్నీ నష్టాలుగా మారాయి.
*******************
కరెంటు సరఫరా అద్భుతంగా ఉందని క్రెడిట్ తీసుకోవడానికే ప్రభుత్వం పాత్ర పరిమితమైంది. దాని వెనుక విద్యుత్ సంస్థల ఆర్ధిక పరిస్తితి దయనీయంగా మారింది. దేశంలో మొత్తం 51 డిస్కమ్ లు ఉంటే, మన డిస్కమ్ల 43, 47 ర్యాంకింగులతో అట్టడుగున ఉన్నాయి. మన డిస్కమ్ ల క్రెడిట్ రేటింగు సి- (C-) కు పడిపోయింది. అంటే ఇక బ్యాంకుల నుండి అప్పుకూడా ముట్టదు. ఎప్పుడైనా బద్దలయ్యే అగ్నిపర్వతంలా ఉంది విద్యుత్ సంస్థల ఆర్ధిక స్థితి.
*********************
విద్యుత్ సంస్థల నష్టాలు 52 వేల కోట్ల రూపాయలు దాటాయి. అంటే విద్యుత్ అమ్మకాల ద్వారా ఈ నష్టాలను పూడ్చుకోవడం అసాధ్యం. ఛార్జీలు పెంచుదామంటే 2022 లో పెంచిన 5600 కోట్ల రూపాయల చార్జీలకే జనాలు అల్లాడుతున్నారు. దేశంలో ఇంత పెద్ద ఎత్తున ఛార్జీలు పెంచడం ఏ రాష్ట్రంలో జరగలేదు. 5600 కోట్ల రూపాయలకే పరిస్తితి ఇట్లా ఉంటే, 52 వేల కోట్ల రూపాయల చార్జీల పెంపు అంటే…? పరిస్థితి ఊహకందదు. అది అసాధ్యం…
*****************
ఇంకా మనోళ్ళు ఇంటర్యూలలో నష్టాలను అప్పులుగా చూపిస్తూ… అప్పులు లేకుండా అభివృద్ది ఎట్లా అని… డెఫిసిట్ ఫైనాన్స్ అని… డెవెలప్మెంట్ ఏకనామిక్స్ అని…గందరగోళం చేసి… అంతా బాగుంది అని నర్మగర్భంగా చెప్పే ప్రయత్నం…!
తొమ్మిదేళ్లలో విద్యుత్ వ్యవస్థలను ఆర్ధికంగా నిండా ముంచారు…కాన్సర్ నాలుగో దశలో ఉంది… అగ్ని పర్వతం ఏ రోజైనా బద్దలు కావచ్చు… రాష్ట్ర ప్రజలపై పర్యవసానాలు మాత్రం భయంకరంగా ఉండడం ఖాయం…!!!……. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టిజేఏసి)
Share this Article