Bharadwaja Rangavajhala…… రొమాన్సింగ్ విత్ బైసికిల్… రీసెంట్ టైమ్స్ లో పొద్దున్న వ్యాయామంగా మాత్రమే వాడుతున్న వాహనం సైకిల్.
స్కూళ్లకి పోయే పిల్లలు తప్ప ఎవరూ సైకిల్ వాడడం లేదు. ఒకప్పుడు సినిమా హాల్స్ పార్కింగ్ ప్లేస్ లో మొత్తం సైకిళ్లే కనిపించేవి… ఇప్పుడు ఆ ప్లేస్ ను మోటారు సైకిళ్లు ఆక్రమించాయి. చాలా చోట్ల కార్లు కూడా భారీ ప్లేసును ఆక్రమించుకుంటున్నాయి.
సైకిలింగ్ ఆరోగ్య కరమే… కాదు, ఆహ్లాదకరం కూడా. ప్రేయసిని ఫ్రంట్ సైడ్ కూర్చోబెట్టుకుని సైకిల్ తొక్కుతూ ఊసులాడుకుంటుంటే … పాట పాడుతూ ఉంటే … తీసేవాళ్లకీ చూసే వాళ్లకీ గొప్ప రొమాంటిక్ ఫీల్ కదూ… సరిగ్గా ఈ పాయింటు దగ్గరే మన దర్శకులు అప్పట్లో సైకిలు డ్యూయట్లు కనిపెట్టారు.
Ads
ఈ మద్య హీరోలు పెద్దగా సైకిల్ జోలికిపోవడం లేదుగానీ … ఒకప్పుడు హీరోలందరూ సైకిళ్లు తొక్కినవారే. చెట్ల మధ్య నుంచి అలా హీరోయిన్ తో కల్సి సైకిల్ మీద వస్తూ హీరో పాట పాడడం అనేది గొప్ప రొమాంటిగ్గా ఉంటుంది కదూ. పైగా రొమాంటిక్ హీరో అక్కినేని గ్లామర్ క్వీన్ బి.సరోజాదేవితో కల్సి సైకిల్ మీద డ్యూయట్ పాడడం.. పెళ్లికానుక తీసిన శ్రీధర్ మూడు భాషల్లోనూ ముగ్గురు హీరోలతోనూ సైకిలు తొక్కించేశారు. అంటే తెలుగులో అక్కినేని, తమిళ్ లో జెమినీ గణేశన్, హిందీలో రాజ్ కపూర్ తొక్కారు.
తెలుగు తమిళ భాషల్లో బి.సరోజాదేవి హీరోతో సమంగా సైకిల్ నడిపిస్తే … హిందీలో మాత్రం వైజయంతిమాల రాజ్ కపూర్ తో జోడీ కట్టడం జరిగింది.
ఎందుకనో… దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు సైకిల్ అంటే చాలా చాలా ఇష్టం. ఆయన కెరీర్ ప్రారంభ దినాల్లో తీసిన సినిమాల్లో సాధ్యమైనంత వరకు హీరో హీరోయిన్స్ ను సైకిల్ ఎక్కించకుండా వదిలేవారు కాదు.
ప్రేమలో ఉన్న జంట అన్యోన్యతను చెప్పడానికి సైకిల్ కన్నా గొప్ప సాధనం లేదనేది ఆయన అభిప్రాయం కావచ్చు. మోసగాడులో సైకిల్ మీద శ్రీదేవి, శోభన్ లకు ఓ డ్యూయట్ పెట్టారు. వేటూరి ఏ వసంతమిది ఎవరి సొంతమిది అంటూ రాసిన పాట చక్రవర్తి చేసిన మెలోడీల్లో ఒకటి. సైకిల్ గుర్తు మీద పోటీ చేసి తొలి ఎన్నికలోనే అద్భుత విజయం సాధించిన చరిత్ర పురుషుడు నందమూరి తారక రాముడు కూడా చాలా సినిమాల్లో సైకిల్ తొక్కారు.
ఒకే కుటుంబం లాంటి చిత్రాల్లో సోలోగా సైకిల్ తొక్కిన అన్నగారు…సైకిల్ మీద పాడిన డ్యూయట్లు మాత్రం లేవనే చెప్పాలి. అయితే రాఘవేంద్రరావే తీసిన సత్యం శివం చిత్రంలో ఓ డ్యూయట్ లీడ్ సీన్స్ లో ఎన్టీఆర్ సైకిల్ తొక్కుతూ దర్శనమిస్తారు. రాఘవేంద్రరావే డైరక్ట్ చేసిన ఎన్టీఆర్ డ్రైవర్ రాముడులోనూ ఓ జంటను సైకిల్ ఎక్కిస్తారు. అయితే సైకిల్ ఎక్కే జంట ఎన్టీఆర్ జయసుధ కాదు. శ్రీధర్, రోజారమణి.
రాఘవేంద్రరావు పద్దతి ఏమిటంటే .. .హీరో హీరోయిన్స్ సైకిలెక్కి ఓ అందమైన పార్క్ లో పూలమొక్కల మధ్య నుంచి వెళ్లిపోతూంటారు. పైగా డ్రైవర్ రాముడులో బెలూన్లు పట్టుకుని పోతారు. సన్నివేశాన్ని రంగుల మయం చేయడంలో రాఘవేంద్రరావు దిట్ట కదా. బాపు గారి బుద్దిమంతుడులోనూ హీరో సైకిలే తొక్కుతాడు. మరి ఓ గుడి పూజారి తమ్ముడికి అంతకన్నా తాహతు ఉంటుందా అనుకోవచ్చు. నిజానికి ఆ రోజుల్లో అసిస్టెంట్ ఇంజనీర్ క్యాడర్ వాళ్లు కూడా సైకిళ్ల మీదే తిరిగేవాళ్లు. ఇప్పుడు ఆఫీస్ బాయ్ లు సైతం మోటారు సైకిల్ మీద మాత్రమే ఆఫీసుకు వస్తున్నారు.
బుద్దిమంతుడు సినిమాలో గుట్టమీద గువ్వ కూసింది పాటలో నాగేశ్వర్రావుగారు విజయనిర్మలను తోడ్కొని పొలం గట్లపైన చక్కగా కెమేరాకనువుగా సైకిలు తొక్కేస్తారు. రాఘవేంద్రరావు సైకిల్ తొక్కించిన హీరోల జాబితాలో చిరంజీవి కూడా ఉండడం విశేషం. ఘరానామొగుడు లో ఆపీసుకు వెళ్లేందుకు బస్ ఫెసిలిటీ లేదని సైకిల్ కొనుక్కుంటాడు హీరో చిరంజీవి. సినిమాలో ఒక హీరోయిన్ వాణీ విశ్వనాథ్ ఆ సైకిల్ ఎక్కుతుంది. అంతే డ్రీమ్ సాంగ్ షురూ… ఆ పాటలో సైకిల్ జోరుకు తోడు వర్షాన్ని కూడా ఏర్పాటు చేశారు దర్శకేంద్రుడు. ఇది కాస్త మొరటు పద్దతుల్లో నడుస్తుందనేది నా అభిప్రాయం.
నిజానికి హీరోయిన్ ను తీసుకుని సైకిల్ తొక్కుతూ పాటలు పాడడం చిరంజీవికి కొత్తేం కాదు. అభిలాషలో హీరోయిన్ రాధిక సహితంగా చిరు సైకిల్ మీద రెచ్చిపోయే సాంగ్ ఉంది. చిరంజీవిలోని ఎనర్జీ లెవెల్స్ చూసి తెలుగు ప్రేక్షకులు అవాక్కయ్యారు. అంతటి పవర్ ఫుల్ సాంగ్ అది. యురేకా … అనగానే… తెలుగు ప్రేక్షకుల నరాల్లో కరెంట్ పాస్ అవుతుంది. ఆ పాటలో ఒక్క సైకిలేమిటి? అప్పటికి మార్కెట్ లో అందుబాటులో ఉన్న ప్రతి టూవీలర్ నూ వాడేసుకున్నారు.
రాఘవేంద్రరావు తొలి చిత్రం బాబు కమర్షియల్ గా పెద్దగా సక్సస్ కాలేదు. ఆ వెంటనే చేసిన చిన్న సినిమా జ్యోతి పెద్ద విజయం సాధించడమే కాదు…. రాఘవేంద్రరావుకు మంచి పేరునూ తెచ్చిపెట్టింది. ఆ సినిమాలో కూడా రాఘవేంద్రరావు తనకిష్టమైన సైకిల్ గీతాన్ని పెట్టారు. సిరిమల్లె పూవల్లె నవ్వు… చిన్నారి పాపల్లే నవ్వు అంటూ సాగే ఆ గీతంలో జయసుధను కూర్చోపెట్టుకుని హుషారుగా సైకిల్ తొక్కేస్తారు మురళీమోహన్.
అసలు సైకిల్ పాటల్లో ఉన్న బ్యూటీని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత మాత్రం ఖచ్చితంగా కొంగర జగ్గయ్యకే దక్కుతుంది. 1958లో వచ్చిన ముందడుగు చిత్రం కోసం ఓ ఆహ్లదకరమైన జంటను తీసుకున్నారు దర్శకులు కృష్ణారావు. ముందడుగు చిత్రంలో జగ్గయ్య, షావుకారు జానకిల మీద చిత్రీకరించిన కోడెకారు చిన్న వాడా పాట వింటే ఎవరైనా మహదేవన్ తెలుగువాడు కాదని అనుకోగలరా? ఈ పాటలో ఆత్రేయ తను మాత్రమే మెరిపించగల చమక్కులు చూపిస్తారు. ఆడదాని మాట వింటే తేలిపోడం తేలికంటే … తేల్చి తేల్చి ముంచుతారంట … మునుగుతుంటే నవ్వుతారంట అని రాస్తారాయన.
బాలచందర్ కూడా తొలికోడి కూసిందిలో శరత్ బాబు సీమల జంటను సైకిలెక్కిస్తారు. బాలీవుడ్ లో దేవానంద్ ముంతాజ్ లు సైకిలు మీద పోతూ పాడుకునే పాటొకటి ఉంటుంది. హే మైనే కసమ్ లీ అంటూ సాగుతుంది పాట. ఈ సినిమా కథనే మధురస్వప్నం పేరుతో యద్దనపూడి సులోచనారాణి ఆంధ్రజ్యోతి వీక్లీలో సీరియల్ గా రాస్తే దాన్ని గోపీకృష్ణ మూవీస్ వారు తెరకెక్కించారు పాపం. రాఘవేంద్రరావు డైరక్ట్ చేసిన ఆ సినిమా లోనూ ఆటోమేటిక్ గా సైకిలు డ్యూయట్టు ఉంది. సంగీత దర్శకుడు సత్యం ఇంటలిజెంట్ గా హిందీ పాటలను అనుకరిస్తారు కదా… అలా ఇందాక మనం చెప్పుకున్న హే మైనే కసమ్ లీ పాట ట్యూనునే తీసుకుని చరణాల దగ్గర కాస్త మార్చినట్టు నటించి బాలు సుశీలలతో గువ్వల జంటను చూడూ అంటూ పాడించేశారు….
Share this Article