Priyadarshini Krishna….. మనం ‘హెల్తీ ఈటింగ్’ అనగానే రైస్, షుగర్, పళ్ళు, మాంసం పైన దృష్టి పెడతాం. స్వీట్లు మానెయ్యాలి, ఉప్పు తగ్గించాలి, నూనె తగ్గించాలి అని ప్రణాళికలు వేస్తాం. అర్జంటుగా అన్నం మానేసి రొట్టెలే తిందాం అని తీర్మానించుకుంటాం….
కానీ అన్నిటికంటే ముఖ్యమైనది – మన భోజనంలో బియ్యం తర్వాత ప్రధానమైన నూనెల నాణ్యతపై మాత్రం ఏమాత్రం దృష్టిపెట్టం. మనం తినే వాటిలో రిఫైన్డ్ ఫుడ్స్ వుండకపోవడం ఎంత మంచిదో రిఫైన్డ్ నూనెలు కూడా ఉండకపోవడం అంతకంటే మంచిది. జీవనశైలి రిఫైన్డ్ గా వుండాలి గానీ తినే పధార్థాలు కాదు…
కొద్దిగా సైన్స్ మాట్లాడు కుందాం- ఈ నూనెల్లో సాచురేటెడ్, మోనో అన్‌సాచురేటెడ్, పాలీఅన్‌సాచురేటెడ్ అని మూడు ప్రధాన రకాల ఫాట్స్ పదార్థాలున్నాయి. సాచురేటెడ్ అంటే సాధారణ ఉష్ణోగ్రతలో కూడా గడ్డకట్టి వుండేవి- వెన్న నెయ్యి, కొబ్బరినూనె వగైరా+ అధిక ఉష్ణోగ్రత దగ్గర కూడా వాటి రసాయనికత (సాధారణ భాషలో పొగగా) మారకుండా ఉండటం.
Ads
మోనో – అన్ సాచురేటెడ్ అనగా పచ్చి నూనెను కూడా మనం తినగలిగేలా వుండేవి- ఆలివ్స్, నువ్వులనూనె లాంటివి. ఇక పాలీ- అన్ సాచురేటెడ్ అనగా గది ఉష్ణోగ్రతనో ద్రవంగా వుండి చల్లబరిచినప్పుడు గడ్డకట్టేవి- పల్లీ నూనె, సన్‌ఫ్లవర్ నూనె, సోయానూనె లాంటివి.
వీటిలో ఏది మంచిది అని అడిగితే ఏదీ మంచిది కాదు. మితంగా తీసుకుంటే అన్నీ మంచివే. ఒక్కో పధార్థాన్ని వండేప్పుడు ఒక్కో రకం నూనెని వాడుకోవడం శ్రేయస్కరం. చిరుతిళ్ళు తినాలి అనుకునేప్పుడు పిండి వంటలకోసం డీప్‌ఫ్రై చేయడానికి నువ్వు లనూనె లేదా పల్లీ నూనె వాడుకోవాలి. రోజువారీ కూరలు చేసుకునేప్పుడు సన్‌ఫ్లవర్, రైస్‌బ్రాన్, కొబ్బరినూనె, ఆవనూనే లాంటివి వాడుకోవాలి.
అసలు మన శరీర నిర్మాణంలోని కణంలోనే fat ముఖ్యపాత్రగా వున్నప్పుడు మనం ఫాట్ పూర్తిగా మానేయడం అసలు కరెక్ట్ కాదు… అలాగని ఓవర్‌గా తినకూడదు. సాచురేటెడ్ నూనెలు రోజువారీ వంటలో వాడుకోవడం మంచిది. రోజువారీ భోజనంలో రెండు మూడు చెంచాల పచ్చి ఆవు నెయ్యి, గానుగ పచ్చి నువ్వుల నూనే మొదటి రెండు ముద్దల్లో వేసుకుని తినడం చాలా మంచిది. ఈ ముద్దల్లో అవిస పొడి, ఉసిరి పొడి, శొంఠి పొడి, మునగ పొడి, కర్వేపాకు పొడి వుండటం చాలా చాలా మంచిది. ఎదిగే పిల్లలకు ఇలాంటి మీల్ ప్లాన్ చెయ్యండి.
ఈ పొడులు ఇవన్నీ ఎందుకు… పని దండగ అనుకోకండి. మనకి కావలసిన మైక్రో న్యూట్రియంట్స్ ( సూక్ష్మ పోషకాలైన మినరల్స్ వగైరా) దీని వల్ల అందే అవకాశం ఖచ్చితంగా వుంది. అంతేకాకుండా కొన్ని కొన్ని న్యూట్రీన్స్ ఫాట్‌సాల్యుబుల్- కొవ్వు ద్వారా కరిగి వంటబట్టి వుంటాయి, కాబట్టి నెయ్యి వంటివి తప్పనిసరి.
సో, మన వంటింటిలో రకరకాల నూనెలు వుండటం చాలా మంచిది. ప్రతి వంటకంలో ఆయా నూనెలు వాడటం వీలు కాదు అనుకున్నప్పుడు మనమే ఒక ఫార్మ్యూలా తయారు చేసుకోడం కూడా మంచిది. ఉదాహరణకు పొద్దుతిరుగుడు నూనె (సన్ ఫ్లవర్), కుసుమ నూనె (సా ఫ్లవర్ నూనె), బియ్యపు ఊక నూనె (రైస్ బ్రాన్ నూనె), పల్లీ నూనె ఇలా రెండు గానీ మూడు గానీ 1:1:1 శాతంలో కలుపుకుని వంటల కోసం వాడుకోవటం చాలా మంచిది. నువ్వుల నూనె, ఆవు నెయ్యి పచ్చివే అన్నంలో కలుపుకోడానికి అరకిలో చొప్పున ఇంట్లో వుంచుకో డం ఉత్తమం.
పిండి వంటలు, చిరు తిళ్ళు, డీప్ ఫ్రై తిళ్ళ కోసం పూర్తి పల్లీ నూనె, సన్‌ఫ్లవర్‌నూనె, రైస్ బ్రాన్ నూనే వాడుకోడం చాలా మంచిది. వారంలో ఒకసారి మాత్రమే డీప్ ఫ్రైడ్ తిళ్ళను ఆబగా కాకుండా మితమైన పోర్షన్ లో తినడం చాలా చాలా మంచిది. ఇలా రాసుకుంటూ పోతే చాంతాడంత అవుతుంది….
Share this Article