ఒక్క క్రికెట్ మ్యాచ్… అదే అనుకుంటున్నాం కదా మనం… జస్ట్, ఒక ఆట… కానీ కాదు… జస్ట్ ఆట కాదు… అంతకుమించి… వాడెవడో మార్ష్ అనేవాడు తాము గెలిచిన ప్రపంచ కప్పును కాళ్ల కింద పెట్టుకుని, బీర్ తాగుతూ ఫోటోలు దిగాడట… ఆ బలుపు ఆస్ట్రేలియాది… (Times Of India వార్త… ఫేకో నిజమో జానేదేవ్)… కానీ మనకు అది ఓ ఉద్వేగం… సచిన్ దాన్ని అపురూపంగా ఓ విగ్రహాన్ని పట్టుకొచ్చినట్టుగా పట్టుకొచ్చాడు… గెలిచిన కప్పును ప్రేమగా ముద్దాడతాడు ఇండియన్ ప్లేయర్… క్రికెట్ ఫైనల్ అనగానే దేశం యావత్తూ, భారత జాతి యావత్తూ ఉత్తేజంతో ఊగిపోతుంది…
ఓడితే కన్నీళ్లు పెట్టుకుంటుంది… ఒకసారి ఆ ఫీలింగ్స్ దాటి ఆలోచిద్దాం… ఈ ఒక్క క్రికెట్ టోర్నీ ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు 22 వేల కోట్ల వరకూ జమయినట్టు ఒక అంచనా… ఎహె, అంత సీన్ ఉందా అని తీసిపారేయకండి… బీఓబీ ఎకనమిక్స్ అనే సంస్థ వేసిన అంచనా ఇది… అసలు టీవీ, ఓటీటీ ప్రసార హక్కుల ద్వారానే 10,500 నుంచి 12 వేల కోట్ల మేరకు ఆదాయం అట…
టికెట్లు, వస్తు విక్రయాలపై వేసే పన్నులు… హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ డెలివరీ ఏజెన్సీలపై వేసే పన్నులు, సర్వీస్ ఛార్జీలు కూడా… వన్స్ ఇన్ ఏ లైఫ్ అన్నట్టుగా… లక్షాముప్ఫయ్ వేల మంది ఆ స్టేడియానికి వెళ్లారు… కేవలం స్టేడియానికి వెళ్లిన వారి ఖర్చే దాదాపు 150 కోట్ల మేరకు ఉంటుందని అక్కడికి వెళ్లిన ఓ మార్కెటింగ్ నిపుణుడి అంచనా…
Ads
మ్యాచ్ కోసం హైదరాబాద్ నుంచి అహ్మదాబాద్ వెళ్లే విమానాలు 50 వేల నుంచి 70 వేలు వసూలు చేశాయి ఓ దశలో… చివరకు స్టేడియం దగ్గరకు ఉదయం 9, 10 గంటలకే చేరుకుంటే… స్టేడియంలో కొనుగోలు చేసిన పానీయాలు, ఫుడ్, స్నాక్స్ ఖర్చే దాదాపు 20 కోట్లు అని అంచనా… పావు లీటర్ సాఫ్ట్ డ్రింక్ ధర 100 రూపాయలట… జస్ట్, ఓ ఉదాహరణ… ఆదివారం టికెట్లు బ్లాకులో లక్ష రూపాయలు దాటి అమ్ముడయ్యాయట…
మరి ప్రభుత్వ ఖర్చు..? అది అదనం… వీవీఐపీల రాకతో ఆ ఖర్చు తడిసిమోపెడు… స్టేడియంలో బాణాసంచా, లేజర్ షో, లైట్ షో, ఎయిర్ ఫోర్స్ విమానాల విన్యాసాలు, మ్యూజిక్ కాన్సర్ట్‌లు… పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ నిర్వహణ… ఇంత పెద్ద ఈవెంట్ సమీప గతంలో ఏమీ లేదు… సమీప భవిష్యత్తులో కూడా ఉండదు… ‘ఖర్చయితే అయ్యింది… ఓడిపోతే పోయాం… కానీ ఒక మెమరీ సార్… మళ్లీ ఆ జోష్ చూడలేం, అనుభవించలేం…’ అన్నాడు ఓ మార్కెటింగ్ మిత్రుడు…
లక్షాముప్పయ్ వేల మంది కలిసి జాతీయ గీతం పాడుతుంటే… అదొక ఎమోషన్… అక్కడ ఉండి గొంతు కలిపేవాడికే తెలుస్తుంది ఆ థ్రిల్… హోరు… నీలి సముద్రపు అలలు తరలివచ్చి కుర్చీల్లో కూర్చున్నట్టు… ఒక వికెట్ పడ్డప్పుడు అక్కడ రికార్డయిన ధ్వని 127 డెసిబుల్స్… దేశవ్యాప్తంగా బిగ్ స్క్రీన్స్, గెట్ టు గెదర్స్, మద్యం, ఫుడ్ ఖర్చులన్నీ లెక్కేస్తే అది ఓ అంచనాకు అందదు… సో, వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్ అంటే మనకు ఓ సామూహిక ఉత్సవం… ఓ ఉద్వేగం… సరే, సరే… ఓ ఉన్మాదం… ఓ పిచ్చి… అంతకుమించి ఓ ఆర్థిక కెరటం కూడా…! చివరగా… మనం ఒలింపిక్స్ కూడా ఘనంగా నిర్వహించగలం… అవకాశం దక్కితే బాగుండు…! మనం ఎవరికీ తక్కువ కాదు..!!
Share this Article