వీళ్లు ఢిల్లీ నుంచి ఎందుకొస్తారో తెలియదు… స్టార్ క్యాంపెయినర్లు అట… నిజానికి ‘పెయినర్లు’ వీళ్లు… జేపీ నడ్డా, అమిత్ షా మాట్లాడే మాటల్లో పంచ్ ఉండదు… ఏం చెబుతున్నారో ఎవరికీ అర్థం కాదు… బీజేపీ వాళ్లను ఎందుకు తీసుకొచ్చుకుంటున్నదో వాళ్లకే ఎరుక… రాష్ట్రంలో ఎన్నో ఇష్యూస్ ఉంటే, బీజేపీ గెలిస్తే అయోధ్య, కాశి ఉచిత దర్శనాలు అని హామీ ఇచ్చాడు అమిత్ షా… ఈయన స్టార్ క్యాంపెయినర్…
ఒకసారి కాంగ్రెస్ విషయానికి వెళ్దాం… చిదంబరం అంటే మామూలుగానే తెలంగాణలో కోపం… మొదట తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ఆరంభిస్తున్నట్టు ప్రకటించి, తరువాత వెనక్కి వెళ్లి ఫుల్లు బదనాం అయిపోయిన కేరక్టర్… ఇప్పుడు తాపీగా సారీ చెబుతున్నాడు… ఎవడు అడిగాడు తనను సారీ చెప్పాలని… సారీ చెబితే వేల ప్రాణాలు వెనక్కి వస్తాయా..? ఇప్పుడు ఎన్నికల అవసరం కాబట్టి సారీ చెబుతున్నాడు తప్ప అందులో నిజాయితీ, పశ్చాత్తాపం ఏమున్నాయి..?
అసలు పాయింట్ ఏమీ లేకుండానే టన్నుల కొద్దీ బురద కురిపించగల బీఆర్ఎస్ పార్టీ ఊరుకుంటుందా…? చిదంబరాన్ని దులిపి పారేసింది తన ప్రసంగాల్లో…! స్టార్ క్యాంపెయినర్లు ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో ఎవరు చెప్పాలి..? ఏది తోస్తే అది మాట్లాడటమేనా..? ఈ కోణంలో నిర్మలా సీతారామన్ కూడా ముఖ్యమే…
Ads
మామూలు పరిస్థితుల్లోనే ఆమె ఏం మాట్లాడుతుందో ఆమెకే అర్థం కాదు… పెద్ద హోప్ లెస్ ఆర్థికమంత్రి… ఆమెను తీసుకొచ్చారు, సరే, బాగానే ఉంది… కానీ పంపుసెట్లకు కేసీయార్ మీటర్లు పెట్టలేదు, అందుకే డబ్బు ఆపేశాం అనే అర్థంలో ఏదేదో కూసింది… కేసీయార్ ఎప్పట్నుంచో చెబుతున్నాడు… బీజేపీ తన మీద ఒత్తిడి తీసుకొచ్చినా సరే, నేను మీటర్లు పెట్టడం లేదు అని… మీటర్లు పెడితే ఇక ఉచిత కరెంటు ఉండదు అనే విపరీతార్థం, తప్పుడు బాష్యాన్ని కూడా ప్రజల మీద రుద్దుతున్నాడు…
మరోవైపు రేవంత్ ‘మూడు గంటల కరెంటు చాలు’ అనే వ్యాఖ్యల మీద బీఆర్ఎస్ దుమ్మూదుమారం రేపుతోంది… కాంగ్రెస్ వస్తే ఇక ఉచిత కరెంటు ఉండదు, కర్నాటకలో చూస్తున్నాం కదా, కరెంటు కోతలు… అనే ప్రచారంతో కర్నాటక నుంచి ఎవరెవరినో పట్టుకొచ్చి పెయిడ్ ధర్నాలు కూడా చేయిస్తోందట… అంతేకాదు, 10 హెచ్‌పీ మోటార్లు ఉంటే 3 గంటలు చాలు అనే కాంగ్రెసోళ్ల మాటల్ని మళ్లీ ‘ఈకలు పీకుతూ’… రైతులపై వేల కోట్ల భారం, అందరి మోటార్లను 10 హెచ్‌పీకి మార్చుకోవాలట అంటూ ప్రచారం స్టార్ట్ చేసింది బీఆర్ఎస్… తన మౌత్ పీస్ నమస్తేలో ఓ ఫుల్ పేజీ వ్యాసాలు…
రేవంత్ వ్యాఖ్యల మీదే గాయిగత్తర నడుస్తుంటే… నడుమ నిర్మలమ్మ వచ్చేసి, కేసీయార్ మీటర్లు పెట్టలేదు, అందుకే అదనపు నిధులు ఇవ్వలేదు అని మాట్లాడటం పొలిటికల్‌గా మూర్ఖత్వం… దాన్నీ పట్టేసుకున్నాడు కేసీయార్… చూశారా, ఆర్థికమంత్రే చెబుతోంది… మీటర్లకు నేనే అడ్డం పడ్డాను… రైతులకు వ్యతిరేకంగా వెళ్తానా అని తన ఫాయిదా కోసం వాడేసుకుంటున్నాడు… (నిజానికి మోటార్లకు మీటర్లు అనేది విద్యుత్ సంస్కరణల్లో భాగమే… అది వ్యవసాయ వాడకం సరైన లెక్కల కోసం… అంతేతప్ప మీటర్లు పెట్టగానే ఉచిత కరెంటుకు మంగళం పాడటం కాదు… ఈ సంస్కరణలన్నీ అమలు చేస్తేనే ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులకు మించి అప్పులకు అనుమతిస్తాం అనేది ఉద్దేశం… లక్షల కోట్ల అప్పులు, అన్నారం, మేడిగడ్డల తిప్పలు కదా కేసీయార్ పాలసీ… అందుకే తన బాధ… అంతేతప్ప రైతుల మీద ప్రేమేమీ కాదు)
ఊరందరిదీ ఓ దారి… అన్న రీతిలో అసలే బండి సంజయ్ మాటలు సగం అర్థం కావు… (తనకూ అర్థమవుతాయని అనుకోలేం)… మరీ అప్పుడప్పుడూ బండ్ల (గణేష్) సంజయ్ అనే తరహాలో ఏవో మాట్లాడతాడు… బీజేపీ వార్నింగ్ ఇవ్వకపోతే కేసీయార్ ఇప్పటికే మీటర్లు పెట్టేవాడు, తను మళ్లీ గెలిస్తే మీటర్లు తప్పవు అని ఎక్కడో మాట్లాడాడు… జరిగేది వేరు, రచ్చ వేరు, తను మాట్లాడేది వేరు, పూర్తి రివర్స్… స్టార్ క్యాంపెయినర్లతో ఒక తంటా… ఇదుగో ఈ బండ్ల బాపతు క్యాంపెయినర్లతో మరో తంటా… (కొంపదీసి ఈ నష్ట వ్యాఖ్యల అసలు ఉద్దేశం కేసీయార్‌కు ఫాయిదా కోసం కాదు కదా… ఎందుకంటే? ఈమధ్య బీజేపీ అడుగులన్నీ కేసీయార్ కోసమే కదా… కావాలనే నిర్మలక్క ఈ ఇష్యూను గెలికిందా..?)
Share this Article