పవర్ స్టార్ సారు గారికి హఠాత్తుగా తన పార్టీ తెలంగాణలో కూడా పోటీచేస్తోందనీ, 8 స్థానాల్లో అభ్యర్థులున్నారనీ గుర్తొచ్చినట్టుంది… షూటింగు నడుమ గ్యాప్ కూడా చూసుకుని, తాపీగా తెలంగాణ ప్రచారబరిలోకి దూకాడు… ఫాఫం, బీజేపీ… తెలంగాణలో పార్టీ వేస్తున్న అయోమయపు అడుగుల్లో పవన్ కల్యాణ్‌తో పొత్తు కూడా ఒకటి…
తెలంగాణ ప్రజలు చైతన్యశీలురు, పోరాటవీరులు ఇంకా ఏవేవో అంటుంటారు కానీ… అమాయకులు… ఆంధ్రా లీడర్ల దృష్టిలో గొర్రెలు, ఏది చెప్పినా నమ్మేస్తారు… పవన్ కల్యాణ్ అభిప్రాయం కూడా అదే కదా… ఒక్కసారి హన్మకొండలో నిర్వహించిన విజయసంకల్ప సభలో తనేం మాట్లాడాడో ఓ వాట్సప్ వార్త చదువుదాం…
- నాకు ఆంధ్రా జన్మనిస్తే.. తెలంగాణ పునర్జన్మ ఇచ్చింది!
- నాకు తెలంగాణ ఎంతో బలాన్ని ఇచ్చింది, ఆ స్పూర్తితోనే ఏపీలో రౌడీలతో పోరాడుతున్నాను
- నా పోరాటానికి తెలంగాణ యువత అండగా ఉంటోంది. ఆంధ్రాలో ఎలా తిరుగుతున్నానో తెలంగాణలో కూడా అలాగే తిరుగుతా.
- ఏ మార్పు కోసం తెలంగాణ బిడ్డలు చనిపోయారో అది సాధిస్తా.
- తెలంగాణ ఇచ్చిన స్ఫూర్తితోనే పదేళ్లుగా పార్టీ నడుపుతున్నా.
- బలిదానాలపై ఏర్పడిన రాష్ట్రం అవినీతిమయం కావడం బాధ కలిగించింది.
- తెలంగాణలో దళిత ముఖ్యమంత్రిని చూడలేకపోయాం. బీసీ ముఖ్యమంత్రినైనా చూడాలని భాజపాతో కలిశాను.
- నాకు ఆంధ్రా జన్మనిస్తే.. తెలంగాణ పునర్జన్మ ఇచ్చింది.
- నాడు తెలంగాణకు మద్దతు ఇచ్చిన వారిలో నేనూ ఒకడిని.
- వచ్చే ఏడాది నుంచి తెలంగాణలోనూ పర్యటిస్తా.
ఇవీ సదరు నాయకుడి మాటలు… అసలు తను మొదట్లో బీజేపీతో పొత్తుదారే… తరువాత ఎటెటో తిరిగి మళ్లీ బీజేపీ శిబిరానికే వచ్చాడు… సరే, సారు గారి మాటలు పరిశీలిద్దాం… (తెలంగాణ ఏర్పడ్డప్పుడు 11 రోజులు నిద్రాహారాలు మాని బాధపడ్డానని తనే గతంలో స్వయంగా చెప్పాడు, గుర్తుంచుకొండి…)
Ads
ఆంధ్రా జన్మనిస్తే తెలంగాణ పునర్జన్మ ఇచ్చిందట… ఎలా..? అప్పుడెప్పుడో కొండగట్టుకు వెళ్లొస్తుంటే కరెంటు తీగలు తగిలి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడని అంటారు, అదేనా..?
తన పార్టీని తెలంగాణ గడ్డ మీదే ప్రారంభించాననీ అంటున్నాడు… అయ్యా, బాబూ… తమరు పార్టీ ప్రారంభించినప్పుడు, ప్రజారాజ్యంలో రాజకీయాల్లో ఓనమాలు దిద్దినప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కాదు స్వామీ… హైదరాబాద్‌లో పార్టీ పెడితే తెలంగాణలో తెలంగాణ కోసమే పెట్టినట్టు ఈ బిల్డప్ ఏమిటి..? ఎన్నికల అవసరానికి ఏది తోస్తే అది మాట్లాడటమేనా..?
తెలంగాణ బలాన్ని ఇస్తే ఏపీలో రౌడీలతో పోరాడుతున్నాడట… ఓహో, ఏపీ రౌడీలతో పోరాటం సరే, తెలంగాణ ఏం బలాన్ని ఇచ్చింది..? హైదరాబాద్‌లో ఉండనివ్వడమేనా..? అసలు తమరు తెలంగాణ సమస్యల మీద ఏ ఒక్క రోజైనా ఒక్క మాటయినా మాట్లాడారా సార్…
తమరి యుద్ధక్షేత్రం ఏపీయే కదా… మధ్యలో తెలంగాణను లాగడం దేనికి..? నాలుగు వోట్ల కోసమేనా..? తెలంగాణలో కొట్లాటకు బోలెడు పార్టీలున్నయ్… నడుమ మళ్లీ మీరెందుకు..? టీడీపీ, వైసీపీ, వైఎస్ఆర్‌టీపీ ఎట్సెట్రా ఆంధ్రా దుకాణాలన్నీ బంద్ అయిపోయాయి… తమ పార్టీ ఒకటి బీజేపీ పుణ్యమాని ఏదో ఉద్దరిస్తానంటోంది తెలంగాణను…
ఆంధ్రాలో ఎలా తిరిగాడో తెలంగాణలో కూడా అలాగే తిరుగుతాడట… ఎక్కడ..? హైదరాబాద్ రోడ్ల మీదా..? షూటింగు స్పాట్లకు వెళ్లడం కోసమా..? ఏ మార్పు కోసం తెలంగాణ బలిదానాలు జరిగాయో అది సాధిస్తాడట… గతంలో ఒక్క రోజయినా ఈ మాటలు మాట్లాడారా సారూ..? పోనీ, కాస్త వివరంగా చెప్పు సార్, బలిదానాలు దేనికోసం జరిగాయి..?
బలిదానాల రాష్ట్రం అవినీతిమయం కావడం బాధాకరమట… హఠాత్తుగా ఇప్పుడు కేసీయార్ అవినీతి కనిపిస్తోందా..? ఇన్నాళ్లూ ఎక్కడికి వెళ్లారు సార్…? సరే, కేసీయార్ కూడా అన్నీ రికార్డ్ చేసుకుంటున్నాడు సైలెంటుగా…
దళిత ముఖ్యమంత్రిని చూడలేకపోయాడు గానీ బీసీ సీఎం చూడటం కోసం బీజేపీతో కలిశాడట… అయ్యా, సారూ… బీజేపీ ఎత్తుకున్న బీసీ సీఎం నినాదం తాజాది… తమరు బీజేపీతో పొత్తు పెట్టుకుని చాన్నాళ్లయింది…
నాడు తెలంగాణకు మద్దతిచ్చాడట… హవ్వ, నవ్విపోదురుగాక… ఒక్క మాటైనా తెలంగాణ కోసం ఎప్పుడైనా మాట్లాడినవా..? ఒక్క రికార్డు, ఒక్క ఆధారం, ఒక్క పేపర్ క్లిప్పింగ్, ఒక్క వీడియో ఫీడ్ చూపించు… మద్దతిచ్చినవాడివి 11 రోజులు ఎందుకు బాధపడ్డవ్ మరి..?
వచ్చే ఏడాది నుంచి తెలంగాణలో పర్యటిస్తాడట… దా దా… తెలంగాణ ప్రజలు దారిపొడవునా పారిజాత పూలు పరిచి ఆహ్వానిస్తారు..! తెలంగాణ ప్రజల మనోభావాలకు విరుద్ధంగా నిన్ను మోస్తున్న బీజేపీ వాళ్లకు చెప్పొచ్చు కదా సార్… వాళ్ల చెవుల్లోనే కమలపూలు ఉన్నయ్…
చివరగా…. బీసీ సీఎంను చూడాలని బీజేపీకి మద్దతుగా నిలిచానంటున్నవ్ కదా… తెలంగాణలో నువ్వెలాగూ చెల్లని నాణెం కదా… ఏపీలో బీసీ సీఎం కోసం పోరాడు…. ఇదీ వైసీపీ కౌంటర్…
Share this Article