లెఫ్ట్ అంటే… విడిచిపెట్టబడిన, విడిచిపెట్టదగిన… లేదా ఎడమ వాటం… అనగా రైట్‌కు పూర్తిగా విరుద్ధం… అంటే అపసవ్యం… ఇవన్నీ ఎందుకు అనుకోవాలీ అంటే… ఈ దేశంలో లెఫ్ట్ పార్టీల ధోరణి గురించి..! ప్రపంచంలో కమ్యూనిజం సిద్ధాంతాలకు కాలం చెల్లింది… మన లెఫ్ట పార్టీలకు మన దేశానికి పనికొచ్చే సిద్ధాంతాలు అక్కర్లేదు… రష్యాలో ఏం జరిగిందో చూశాం… కమ్యూనిజం ఫెయిలైంది.,.
సీపీఎం ఓ స్వర్గంగా చూసే చైనా… దైవస్వరంగా భావించే అక్కడి కమ్యూనిజం కూడా సగం పెట్టుబడిదారీ విధానాలతో కల్తీ… దేశంలో ఆ పార్టీ కొడిగట్టిపోతున్నా సరే, అది మారదు… మారడానికి ఇష్టపడదు… ఏదో ప్రధాన పార్టీకి తోకగా బతకడానికే ప్రాధాన్యం… తాజాగా పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బేబి, కార్యదర్శి బీవీ రాఘవులు గురువారం ఉదయం విజయవాడ బాలోత్సవ భవన్లో జరిగిన విలేకరుల సమావేశం వివరాలు చదువుతుంటే ఆశ్చర్యం, జాలి కూడా కలిగాయి…
పాలస్తీనా ప్రజలది దేశం కోసం జరిగే స్వతంత్ర పోరాటమట… ఉగ్రవాదం కాదట… ఇజ్రాయిల్ ఏకపక్ష దాడులట… హమాస్ వేరు, పాలస్తీనా ఆర్మీ వేరు… హమాస్ వేల రాకెట్లు ప్రయోగించి, పారాచూట్ల ద్వారా దిగి, వీథుల్లో యథేచ్ఛగా కాల్పులు జరిపి వందల మందిని హతమార్చడం ఉగ్రవాదం కాదా కామ్రేడ్స్… వారిలో పిల్లలు లేరా..? కిడ్నాప్ చేసి, బందీలుగా పెట్టుకుని, యుద్ధబేరాలు ఆడటం స్వతంత్ర పోరాటమా..? దానికి లెఫ్ట్ సమర్థనా..?
Ads
ఎస్, అంగీకరిద్దాం, ఇజ్రాయిల్ తమ దేశాన్ని విస్తరించడానికి నానా కుట్రలూ చేస్తోంది… కానీ అది చేసేది తప్పు అయినప్పుడు హమాస్, హిజ్‌బుల్ స్వతంత్ర పోరాట సంస్థలుగా ఎలా చిత్రీకరిస్తారు..? మోడీ సేమ్ ఇజ్రాయిల్ వంటి ఫాసిస్టు శక్తే కాబట్టి గట్టిగా మాట్లాడటం లేదట, పాలస్తీనాను విముక్తి చేయించేలా ప్రయత్నించాలట… అదేదో చైనా చేయవచ్చుకదా… అదెందుకు డిమాండ్ చేయరు..? చేయరు, ఎందుకంటే, చైనా పార్టీకి కోపమొస్తే ఇక్కడ పార్టీ ఉండదు కాబట్టి…
ఉత్తరాఖండ్ సొరంగం ఘటనలో కేంద్రం ఎందుకు వేగంగా స్పందించడం లేదో అర్థం కావడం లేదట… ఏదో ఒకటి తిట్టాలి కాబట్టి నిందించడం తప్ప లెఫ్ట్ పార్టీలకు ఓ సరైన పంథాయే లేకుండా పోయింది… ఆ ప్రమాద సంఘటన నుంచి కూలీలను కాపాడటానికి ఎన్డీఆర్ఎఫ్ ప్రశంసనీయమైన రీతిలో ప్రయత్నిస్తోంది… కనీసం ఆ సిబ్బందినైనా అభినందించాలనే సోయి లేకుండా పోయింది సీపీఎం పార్టీకి..!
‘ఇండియా’ (విపక్ష కూటమి) వల్ల బీజేపీ వ్యతిరేక పోరాటాలకు బలం చేకూరిందట… అవునా..? మరి అదే కూటమిలోని కాంగ్రెస్‌కు సపోర్ట్ చేయకుండా, పరోక్షంగా బీఆర్ఎస్‌కు సహకరించే విధానానికి దిగడం దేనికి..? మరో తోటి లెఫ్ట్ పార్టీయే ఈ ఆరోపణ చేస్తోంది కదా… మరి ప్రజలకు ఏం సంకేతాలు ఇస్తున్నట్టు..? ఇక ఇండియా కూటమి కలిసికట్టుగా ఉన్నదెక్కడ..? తోటి లెఫ్ట్ పార్టీ కాబట్టి సీపీఐకి మద్దతు ఇస్తుందట, సీపీఐ మద్దతునిచ్చే కాంగ్రెస్‌కు మాత్రం ఇవ్వదట,.. పైగా ఇండియా కూటమి అని అదే చిత్రమైన పాట… హేమిటో… ఇందుకేనేమో కొత్త తరం అస్సలు ఎర్ర జెండా వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు..!!
Share this Article