భారతదేశంలో చాలా చౌక విమానయాన సంస్థ అని పిలవబడే ఇండిగో ఎయిర్‌లైన్స్ సీఈవో… ముంబైలోని ఒక హోటల్‌కు చేరుకున్నాడు… తర్వాత, బార్‌కి వెళ్లి ఓ పెగ్ అడిగాడు… బార్‌మాన్ తల వూపి “అది ₹50 అవుతుంది మిస్టర్ భాటియా” అన్నాడు… కాస్త అవాక్కయిన సీఈఓ (రాహుల్ భాటియా) “ఓహ్, ఇది చాలా చౌక” అని బదులిచ్చి, తన డబ్బు ఇస్తాడు…
“సర్, మేం ఎప్పుడూ పోటీలో ముందంజలో ఉండటానికి ప్రయత్నిస్తాం, అందుకే ఈ ధర” అన్నాడు ఆ బార్‌మన్. “అంతేకాదు సర్, మేం ప్రతి బుధవారం సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఉచితంగా పెగ్గులను అందజేస్తున్నాము… ముంబై మొత్తమ్మీద అతి తక్కువ ధర బీర్ కూడా సప్లయ్ చేస్తాం…”
‘‘వావ్, ఎక్సలెంట్..’’ అన్నాడు రాహుల్… ‘‘మీ దగ్గర గ్లాస్ లేనట్టుంది కదా… తప్పకుండా మీకు ఓ గ్లాస్ కావాలి… కానీ దానికి ₹150 అవుతుంది…” అన్నాడు బార్‌మన్… రాహుల్ అవాక్కయ్యాడు, కానీ తప్పదు కదా, చెల్లించాడు… డ్రింక్ తీసుకుని ఓ సీటు వైపు నడిచాడు… “సర్.., మీరు కూర్చోవాలా?..” అన్నాడు బార్‌మన్… “సీటు కావాలంటే దానికి అదనంగా ₹150 అవుతుంది. మీరు సీటును ముందే బుక్ చేసి ఉండాల్సింది… అలా చేసి ఉంటే మీకు కేవలం ₹100 మాత్రమే ఖర్చయ్యేది…”
Ads
“మీకు ఈ సీట్ సరిపోదు, మీ బాడీ కాస్త పెద్దగా కనిపిస్తోంది… ప్లీజ్, ఈ సోఫాలో కూర్చొండి, సరిపోతుంది…’’ అన్నాడు బార్‌మన్… రాహుల్ కూర్చోవడానికి ప్రయత్నించాడు.., కానీ ఆ సింగిల్ సోఫా కూడా చాలా చిన్నది, అదీ తనకు సరిపోవడం లేదు… ‘ఎహె, ఈ సోఫా ఎవరికీ కంఫర్ట్ కాదు, సరిపోదు..’ అన్నాడు భాటియా కోపంగా…
‘‘సర్, ఇది సరిపోకపోతే అక్కడ పెద్ద సోఫా ఉంది… కానీ అదనంగా ₹250 సర్‌చార్జి చెల్లించాల్సి ఉంటుంది…” రాహుల్ తనను తాను తిట్టుకున్నాడు… ‘‘సర్, మీరు మీతో ల్యాప్‌టాప్ తెచ్చుకున్నారని కనిపిస్తూనే ఉంది… అది వాడుకోవాలంటే ముందుగా బుక్ చేసుకుని ఉండాలి, అందుకని అదనంగా మరో ₹300 అవుతుంది…”
దీంతో మండిపడ్డ రాహుల్ బార్ కౌంటర్ వద్దకు తిరిగి వెళ్లి, డ్రింక్‌ను విసురుగా కౌంటర్ మీద కొడుతూ… ‘‘ఏమిటీ నాన్సెన్స్… నేను మేనేజర్‌తో మాట్లాడాలనుకుంటున్నాను!” అన్నాడు గట్టిగా… ‘‘మీరు ఈ కౌంటర్‌ను ఉపయోగించుకోవాలని భావిస్తున్నారా..? దానికి ₹200 అవుతుంది…” అన్నాడు కూల్‌గా ఆ బార్‌మన్…
రాహుల్ ముఖం ఆవేశంతో ఎర్రబడింది…
“నేనెవరో మీకు తెలుసా?” అనడిగాడు…
‘‘తెలుసు మిస్టర్ భాటియా…’’
‘‘తెలిసీ ఇలా వ్యవహరిస్తున్నావా..? ఇదేం హోటలయ్యా..? నేనేదో ఒక డ్రింక్ కోసం వస్తే ఏమిటిదంతా..? అందుకే నేను మీ మేనేజర్‌తో మాట్లాడాలి, అంతే…’’
“సర్, ఇదుగో… మేనేజర్ ఇ-మెయిల్ చిరునామా.., మీరు కోరుకుంటే, మీరు అతన్ని ప్రతిరోజూ ఉదయం 9.00 నుండి 9.01 గంటల మధ్య, సోమవారం నుండి మంగళవారం వరకు ఈ టోల్ ఫ్రీ ఫోన్ నంబర్‌లో కూడా సంప్రదించవచ్చు. కాల్స్ ఉచితం, కనెక్టయ్యేంత వరకు మాత్రమే, కాకపోతే కాల్ కనెక్టయ్యాక ఆయనతో మాట్లాడే సమయానికి ఛార్జీ సెకనుకు ₹10 లేదా దానిలో కొంత తక్కువ ఉంటుంది…”
“ఛ, ఛ… నేను ఈ బార్‌కు ఇంకెప్పుడూ రాను… ఇంత దారుణమా..!” అన్నాడు మిస్టర్ భాటియా… “సరే సర్.., అయితే గుర్తుంచుకోండి.., ముంబైలో రూ.50కి ఒక పెగ్ అమ్మే స్టార్ హోటల్ మాది మాత్రమే…” భాటియా విసురుగా బయటకి నడిచాడు… అవునూ, తనకు అర్థమైందా..? తను సీఈవోగా ఉన్న ఇండిగో ఎయిర్‌లైన్స్ కూడా సేమ్ సేమ్ అని…!! (ఇంగ్లిష్‌లో కనిపించిన ఓ వ్యంగ్య పోస్టుకు నా స్వేచ్చానువాదం ఇది… నేనూ ఒకటిరెండుసార్లు ఇండిగో మోసానికి బలయిన బాధితుడిని కాబట్టి…)
Share this Article