కార్తీక పౌర్ణమి… ఏవైనా నదీప్రవాహాలు దగ్గరలో ఉన్నవాళ్లు పొద్దున్నే స్నానాలు చేస్తారు… కార్తీకదీపాలు ప్రవాహంలోకి వదులుతారు దొప్పల్లో… ఇళ్లల్లోనయితే వొత్తులు ముట్టిస్తారు, వీటికీ లెక్క ఉంటుంది, ముట్టించే పద్ధతీ ఉంటుంది… (కాల్చడం అనవద్దట… కాల్చడం అంటే కాలబెట్టడం, తగలేయడం వంటి నెగెటివ్ వర్డ్ అట…)
ఇళ్లల్లోనైతే ఓ కంచుడు (మట్టి మూత లేదా పెద్ద సైజు ప్రమిద చుట్టూ మూతులు కోసిన ఉసిరికాయలు పెట్టి, దీపాలు వెలిగించి, కంచుడులో వొత్తులు ముట్టిస్తారు… ఇంటి దేవుడో, పండుగ దేవుడో మొక్కుకుంటారు… కొబ్బరికాయ కొడతారు… శాస్త్రానికి ఓ టపాకాయ కాలుస్తారు… కాసింత పేనీల పాయసమో, శేవెల పాయసమో, సగ్గుబియ్యం పాయసమో ఉంటుంది…
కానీ ఈమధ్య ఓ ట్రెండ్ బాగా ప్రబలింది… గతంలో ఏవైనా రుతుకారణాలతో గృహిణి పూజ చేసే స్థితిలో లేకపోతే ఇంటి మిగతా సభ్యులు దగ్గరలోని గుడికి వెళ్లి, వొత్తులు ముట్టించి, ఓ దండం పెట్టుకుని, వీలైతే ఓ కొబ్బరికాయ కొట్టి వచ్చేసేవాళ్లు… కానీ ఇప్పుడు… గుడికి వెళ్లేవారి సంఖ్య విపరీతంగా పెరిగింది… ఏ కీసర గుడిలోనే ఆల్‌రెడీ వెలుగుతున్న (మండుతున్న అనకూడదట మళ్లీ…) పెద్ద దీపం పక్కనే మన వొత్తులూ పెట్టేసి, ముట్టిస్తే సరిపోయేది…
Ads
శివుడి గుడి అయితే అభిషేకం, కొబ్బరికాయ… ఇప్పుడు చాలామంది గుళ్లకు వస్తున్నారు… చిన్న చిన్న ఆవరణలున్న గుళ్లల్లోనూ కిక్కిరిసి కనిపిస్తున్నారు… ఒక మహిళను గమనిస్తున్నాను… ఓ విస్తరాకులో పసుపు, కుంకుమ, ఉసిరికాయలు, వొత్తులు, రాగి చెంబు, అగరుబత్తీలు, పూలు, చిన్న కంచుడు, కొబ్బరికాయ, అరటిపళ్లు, నూనె సీసా గట్రా తెచ్చింది… చంకలో చిన్న ప్లాస్టిక్ చాప, చేయిపట్టుకుని చిన్న పాప… ఇంటి వద్దే పూదించుకుని వచ్చినట్టుంది… (అంటే ముందస్తు పూజ, ఏర్పాట్లు, తయారీ)…
గుళ్లో రద్దీ కారణంగా చిత్తడిచిత్తడిగా ఉంది… పూజా అవశేషాలతో యుద్ధరంగంలా కనిపిస్తోంది… సమ్మక్క జాతరలో ఎక్కడ జాగా దొరికితే అక్కడ టెంట్ వేసినట్టు… కాస్త జాగా చూసుకుంది… చాప వేసి కూర్చుంది… ఎవరి పూజా అవశేషాలో అంటే పక్కకు తోసేసింది… ముందుగా పసుపుతో అలికింది… దానిపై ముగ్గు… దానిపై కంచుడు పెట్టింది… ఈలోపు సేమ్ ఈమెలాగే మరొకామె… వెనుక, ముందు, పక్కలకు… వస్తూనే ఉన్నారు… ఎవరి పూజ వాళ్లది… కంచుడుకు చుట్టూ కుంకుమతో బొట్లు పెట్టింది… ఉసిరి కాయలపై జాగ్రత్తగా వొత్తులు పెట్టి, కాస్త నూనెతో తడిపి వెలిగించింది…
అటూ ఇటూ అగరుబత్తీలు కూడా వెలిగించి, అరటిపళ్లు అటొకటి, ఇటొకటి పెట్టింది… ఆ ముగ్గు మీదే రెండేసి తమలపాకుల్ని అయిదు చోట్ల పెట్టి, వాటిపై మట్టి ప్రమిదలు పెట్టి, వాటిల్లోనూ దీపాలు పెట్టింది… కంచుడులో వొత్తులు పెట్టి, పైన నూనె పోసి, అగ్గిపుల్లతో ముట్టించింది… కొబ్బరికాయ కొట్టింది… వందల కొబ్బరికాయలు కదా, ఆ నీళ్లు అలా అటూఇటూ పారి, అందుకే చిత్తడిచిత్తడి అయిపోయింది… కొందరు పిండితో చేసిన (ఉసిరికాయలు గాకుండా…) దీపాలపై వొత్తులు పెట్టుకుని వెలగించారు… ఒకామె రాగి చెంబులో నీళ్లు పట్టుకొచ్చి, అందులో చిన్న దొప్ప (రావి ఆకును అలా కుట్టినట్టుంది…) పెట్టి, అందులో దీపం పెట్టింది… నదీప్రవాహంలో దీపం వదిలినట్టు లెక్క…
అంతే ఇక… అక్కడున్న ఏ దేవుళ్లనూ ఆమె పట్టించుకోలేదు… అరటిపళ్లు, కొబ్బరి ముక్కల్ని కూడా అలాగే వదిలేసి వెనుదిరిగింది… కార్తీకపూజ సమర్పయామి… ఇంటి నుంచి ఇవన్నీ తెచ్చుకోలేని వారికోసం గుడి బయట రెండుమూడు షాపులు… అక్కడ ప్యాకేజీవారీగా అన్నీ సమకూరుస్తారు… మామూలు రోజుల్లో భక్తగణం పెద్దగా కనిపించని గుళ్లు కూడా కార్తీక పౌర్ణమి వచ్చిందంటే మబ్బుల (తెల్లవారుజామున) 4 గంటల నుంచీ భక్తి చీరెలతో కిటకిటలాడిపోవడమే…!!
Share this Article