అడిగిన వారందరికీ వోట్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం కల్పించామని రాష్ట్ర ఎన్నికల అధికారులు గొప్పగా చెప్పారు… ఉత్తదే… చాలామంది దరఖాస్తు చేసుకున్నా రాలేదంటున్నారు ఫీల్డులో…! సరే, ఈసారే కొత్తగా ఈ సౌకర్యాన్ని తీసుకొచ్చారు కాబట్టి కొన్ని పొరపాట్లు, తడబాట్లు ఉండి ఉండవచ్చు… అర్థం చేసుకోవచ్చు…
కానీ పోస్టల్ బ్యాలెట్లయితే ఎప్పటి నుంచో ఉన్నదే కదా… అదీ ఒడిదొడుకులకు గురైందని చెబుతున్నారు… సరే, దాన్నీ పక్కన పెడితే గతంలో పోలింగ్ స్లిప్స్‌ను ఆయా ప్రధాన పార్టీల అభ్యర్థుల కార్యకర్తలు ఇంటింటికీ పంచిపెట్టేవారు… పనిలోపనిగా తమ అభ్యర్థిని వోటేయాలని అభ్యర్థించేవారు… ఇంటింటికీ ప్రచారాన్ని మించిన ఎఫర్ట్ ఉండదు… ఐతే ఈసారి పార్టీల తరఫున పోలింగ్ స్లిప్స్ పంచినవారే కనిపించలేదు…
అందరికీ మేమే పంచామని ఎన్నికల అధికారులు చెబుతున్నారు… హంబగ్… అబద్ధం… కాలనీలకు కాలనీలే ఎగ్గొట్టారు… పూర్తిగా పంచామనేది పూర్తి అబద్ధం, పైగా ఒకవైపు పూర్తిగా పంచామని చెబుతూనే, మా వెబ్‌సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకొండని ఓ సలహా పారేస్తున్నారు… మీడియా కళ్లకద్దుకుని వాటిని ప్రచురిస్తోంది తప్ప ఫీల్డ్ రియాలిటీ మీడియాకు పట్టడం లేదు…
Ads
పోల్ స్లిప్స్ డౌన్ లోడ్ చేసుకోవాలంటే, సదరు వోటరు మొబైల్ నంబర్ రిజిష్టర్ అయి ఉండాలి… లక్షల మందికి అలా ఫోన్ నంబర్లు అటాచ్ చేసిలేవు… ఓటీపీ వస్తుంది కదానుకుంటే లక్షల మంది ఫోన్ నంబర్లు కూడా మారిపోయాయి… మరి పోల్ స్లిప్స్ ఎలా..? అంతెందుకు..? ఫోన్ నంబర్లతో ఫారమ్-8 సబ్మిట్ చేస్తే నెలలుగా నంబర్లు రిజిష్టర్ కావడం లేదు… సేమ్, అడ్రెసులు మారినవాళ్లు ఇదే ఫారమ్‌లో సబ్మిట్ చేస్తే కొత్త అడ్రెసులు మారుతున్నయ్ గానీ ఫోన్ నంబర్లు రిజిష్టర్ కావడం లేదు… అదేమిటో…
ఫోన్ నంబర్లు లేకుండా ఎన్నికల కార్డు కూడా డౌన్ లోడ్ చేసుకోలేం… కొంతలోకొంత నయం ఏమిటంటే..? వెబ్‌సైట్‌లో మన కార్డు నెంబర్ ఆధారంగా వివరాలు చూసుకుని, ఆ ప్రింటవుట్ తీసుకుని, అందులో పేర్కొన్న బూత్‌కు గను చేరుకుంటే, అక్కడ ఒకరిద్దరు అభ్యర్థుల కార్యకర్తలు అక్కడికక్కడ పోల్ స్లిప్స్ రాసిస్తారు… ఏదేని ప్రభుత్వ గుర్తింపు కార్డు చూపించి వోటేయవచ్చు…
చాలాచోట్ల భర్తలకు ఓ పోలింగ్ కేంద్రం, భార్యలకు మరో పోలింగ్ కేంద్రం, పిల్లలకు ఇంకో పోలింగ్ కేంద్రం, కొత్త వోటర్లకు మరొక పోలింగ్ కేంద్రం… ఫోన్లు తీసుకుపోనివ్వరు, పోలింగ్ కేంద్రాలు దూరంగా ఉన్నవాళ్లకు అదొక అసౌకర్యం… ఎంతసేపూ ఇంత నగదు పట్టుకున్నాం, ఇంత బంగారం స్వాధీనం చేసుకున్నాం అనే గొప్పల ప్రకటనలు తప్ప… అందులో అధికశాతం ఎన్నికలకు సంబంధం లేని నగదే తప్ప… నిజంగా పోలింగ్ దిశలో ఎన్నికల అధికారులు ఫ్లాపే అని చెప్పుకోవచ్చు…
ఈసారి ఇంట్రస్టింగు వార్త ఏమిటంటే…? ర్యాపిడో బైక్ ట్యాక్సీ సంస్థ హైదరాబాద్‌లోని 2600 పోలింగ్ కేంద్రాలకు ఉచితంగా వోటర్లను రవాణా చేస్తుందట… బాగుంది… మెచ్చుకోవచ్చ సంస్థను… ఐతే పురుష వోటర్లకు మాత్రమే ప్రయోజనకరం… ఆడలేడీస్ నడిపే బైక్స్ చాలా చాలా తక్కువ కదా… (అసలు ఉన్నాయా..?) ఫోన్లు లేకుండా ర్యాపిడో సర్వీస్ వాడుకోలేం… వెళ్లాక ఫోన్లు ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు… స్విచాఫ్ చేశాక ఫోన్లను అనుమతిస్తే తప్పేమీ లేదేమో… అబ్బే, ఈ ఎన్నికల అధికారులు సరైన దిశలో నిర్ణయాలు తీసుకుంటారని నమ్మడం వేస్ట్…!! బోగస్ వోట్ల ఏరివేత గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత బెటర్..!!
Share this Article