పైసలిస్తే మీడియా ఏదైనా చేస్తుందా..? అవును, ఏదైనా చేస్తుంది… యాజమాన్య లాభాలే అంతిమం… నిష్పక్షపాతం, నిజాయితీ, నిబ్బరం వంటి మాటలు ఊకదంపుడు బాపతు… అవి అక్షరాల్లో రాసుకుని పాఠకుల కళ్లకు గంతలు కట్టడానికి మాత్రమే… ఎప్పుడైతే పార్టీల వారీగా కరపత్రాలు వచ్చేశాయో ఈ పరిస్థితి ఇంకా దిగజారింది… ప్రతి పేపర్, ప్రతి టీవీ ఆయా పార్టీల ఓన్ మౌత్ పీస్ మాత్రమే… పర్‌ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ కావాలా..? ఎక్కడి దాకో ఎందుకు..?
నమస్తే తెలంగాణ, టీన్యూస్, వెలుగు, వీ6, సాక్షి, సాక్షి టీవీ ఎట్సెట్రా… ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి వంటివి కాటాలు… అనగా జోకుడు పనిముట్లు… మళ్లీ ఇదంతా పునఃశ్చరణ ఎందుకంటారా..? ఈరోజు దాదాపు ప్రతి మెయిన్ స్ట్రీమ్ పేపర్‌లో వచ్చిన ఫుల్ పేజీ యాడ్స్… అవి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అడ్వర్టయిజ్‌మెంట్స్… భలే తెలివిగా రూపకల్పన చేసిన ఎన్నికల ప్రకటనలు అవి…
ఉదాహరణకు… ఈనాడు తీసుకుందాం… పైన ఈనాడు అని మాస్ట్ హెడ్ ఉంటుంది… దిగువన 20, 30 వార్తల హెడ్డింగులు, వార్తలతో ఇండికేటర్స్ ఉంటాయి… (డేట్ లైన్స్ ఉండవు, సంతోషం)… అవన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పబ్లిషైన వార్తలు అన్నట్టుగా పేజీ కనిపిస్తుంది… సగటు పాఠకుడు ఏమనుకుంటాడు..? అవన్నీ ఈరోజు ఈనాడే పబ్లిష్ చేసింది అనుకుంటాడు… ఏమిటిలా, ఈనాడు ఎన్నడూ లేనిది కాంగ్రెస్‌ను జోకుతోంది అనుకుంటాడు… దాని నెత్తుటి నిండా కాంగ్రెస్ వ్యతిరేకతే కదా… పైగా ఇప్పుడు కేసీయార్ భజన పత్రికగా మారిపోయింది, హఠాత్తుగా ఈరోజు కేసీయార్‌కు వ్యతిరేకంగా మారిందా..? అని ఆశ్చర్యపోతాడు…
Ads
అది అల్టిమేట్‌గా ‘ఈనాడు క్రెడిబులిటీ’ని దెబ్బతీస్తుంది… (అఫ్‌కోర్స్, పత్రికలు క్రెడిబులిటీ అనే పదాలు ఈరోజుల్లో హాస్యాస్పదం అయ్యాయి, అది వేరే చర్చ) ఉండి ఉంటే దెబ్బతింటుంది అని అర్థం… అంటే డబ్బు కోసం ఒక పార్టీ ఏది యాడ్ ఇస్తే అది అచ్చేయడమేనా..? కనీసం దాని లాభనష్టాలు చూసుకునే పని లేదా..? సాక్షి కూడా నిజానికి ప్రొ- బీఆర్ఎస్ కదా… కొన్నిసార్లు నమస్తే పత్రికను మించిన భజన, దాసోహం కదా, డబ్బుకు కొదవ లేదు కదా… మరెందుకు ఈ యాడ్స్..?
అసలే ఫేక్ సోషల్ మీడియా పోస్టులు, లెటర్స్, ప్రకటనలతో ఈ ఎన్నికల వాతావరణం కల్తీ కంపుతో వెగటు కలిగిస్తోంది… ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో ఎవడికీ అర్థం కాని దురవస్థ… అవి రాస్తూ పోతే ఒడవదు, తెగదు… ఇలాంటి మిస్‌లీడింగ్ యాడ్స్, పెయిడ్ న్యూస్, పెయిడ్ పొలిటికల్ లైన్, పెయిడ్ సర్వేలు ఫేక్ పోస్టులతో పోటీ పడుతున్నయ్… లోపల పేజీల్లో మళ్లీ వేరే ఫస్ట్ పేజీలు ఉంటయ్… కానీ జాకెట్ యాడ్స్ ప్రభావం బాగా ఉంటుంది పాఠకుడిపై… లోపల పేజీలో నువ్వు ఏం రాసుకున్నావనేది పెద్దగా పరిగణనలోకి రాదు… చిన్న పత్రికలు యాడ్స్‌కు కక్కుర్తి పడతాయంటే అర్థం చేసుకోవచ్చు… కానీ ఈనాడు, సాక్షిలకు ఏం పుట్టింది..?!
Share this Article