Rat Hole – Real Heroes: ఉత్తరాఖండ్ ఉత్తరకాశిలో సొరంగం దారి నిర్మాణ కార్మికులు 41 మంది సొరంగం తొలుస్తూ…17 రోజులు అందులోనే చిక్కుబడిపోయారు. చివరికి అద్భుతం జరిగి అందరూ ప్రాణాలతో క్షేమంగా బయటపడ్డారు. వారి ప్రాణాలను రక్షించడం కూడా రాజకీయం కావడం దేశం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం. ఆ చర్చ ఇక్కడ అనవసరం.
పైనుండి కొండను నిలువుగా తొలిచే వెర్టికల్ డ్రిల్లర్లు, రాతిని, మట్టిని తొలిచే హారిజాంటల్ డ్రిల్లర్లు, అప్పటికప్పుడు విదేశాల నుండి తెప్పించిన బాహుబలి అత్యాధునిక డ్రిల్లర్లు విఫలమైన చోట…ఎలుకలా మనుషులు కలుగులను తవ్వే “ర్యాట్ హోల్ మైనింగ్ కార్మికులు” ఎలా సఫలం కాగలిగారు? అన్నది మాత్రం తెలుసుకునితీరాల్సిన విషయం. నలుగురు కూర్చుని నవ్వే వేళల్లో తలచుకుని పొంగిపోవాల్సిన విషయం. మేఘాలయాలో బొగ్గుతవ్వకాల్లో ఒకప్పుడు వాడిన ర్యాట్ హోల్ మైనింగ్ ను…వరుస ప్రమాదాల నేపథ్యంలో తరువాత నిషేధించారు. డ్రిల్లర్లు, ఇతర ఆటోమేటిక్ యంత్రాలేవీ లేకుండా గునపం, పార, తట్ట పట్టుకుని కొద్ది కొద్దిగా తవ్వుకుంటూపోవడమే “ర్యాట్ హోల్ మైనింగ్”.
Ads
దారి తెన్నూ లేని సొరంగంలో చిక్కుకున్న కార్మికులు ప్రాణాలతో బయటపడడం కష్టమని ఒక దశలో అనిపించింది. ఎవరికీ ఏ అపాయం లేకుండా అందరూ బయటపడ్డారు. కథ సుఖాంతం. చార్ ధామ్ పుణ్యక్షేత్రాలను వేగంగా చేరుకోవడానికి వేస్తున్న రహదారిలో భాగమైన ఈ సొరంగం దారి నిర్మాణం ప్రకృతిని ఎంతగా పాడు చేస్తోంది? పర్యావరణాన్ని ఎలా పాడు చేస్తోంది? హిమాలయ పర్వతాలు అభివృద్ధి బరువును, నవ నాగరికతను మోయలేక ఎలా కుంగిపోతున్నాయన్న చర్చ కూడా ఇక్కడ అనవసరం.
41 మంది ప్రాణాలను కాపాడిన ర్యాట్ హోల్ మైనింగ్ కార్మికులు మీడియాతో మాట్లాడుతూ ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ఇటువైపు ఇండియా టుడే ఇంగ్లిష్ న్యూస్ ఛానెల్ లైవ్ లో స్టూడియోలో టీ వీ జర్నలిస్ట్ శివ్ అరూర్. అటువైపు సొరంగం ముందు ర్యాట్ హోల్ మైనింగ్ కార్మికులు మున్నా, వకీల్.
“మీరు గొప్ప సాహస కార్యం చేశారు. ఈరోజు దేశం మిమ్మల్ను చూసి పొంగిపోతోంది. మనసారా అభినందలు. మీ నైపుణ్యానికి, మీ సాహసానికి సలాం” అని జర్నలిస్ట్ చక్కటి హిందీలో గొప్పగా చెప్పారు.
“వారి వెంట ఈ దేశ ప్రజల ప్రార్థనలున్నాయి. ఆశీస్సులున్నాయి. ఆకాంక్షలున్నాయి. అందరు అన్ని ప్రయత్నాలు చేశారు. చివరి ప్రయత్నంగా మేము దిగాము. భగవంతుడు మాకు ఆ అవకాశం ఇచ్చాడు. కాపాడగలిగాము. మా జన్మ సార్థకమయ్యింది….” అని మున్నా మాట్లాడలేక…ఆనందం పట్టలేక ఏడ్చేశాడు. ఈ సందర్భాన్ని టీ వీ జర్నలిస్ట్ శివ్ లైవ్ లో చాలా హుందాగా, మానవీయంగా హ్యాండిల్ చేశారు.
“అవును మేము పొడిచేశాం. మేము లేకుంటే వారు బతికేవారా?” అని మున్నా గొప్పలు చెప్పుకోలేదు. “ఎవరి ప్రయత్నం వారు చేశారు. మా ప్రయత్నం ఫలించింది. వారిని కాపాడ్డానికి దేవుడు మమ్మల్ను సాధనంగా ఎంచుకున్నాడు” అనడానికి ఎన్ని జన్మల సత్ సంస్కారం మూటకట్టుకుని పుట్టి ఉండాలి? ఎంత వినయం?
ఎప్పుడు ఎలా మాట్లాడాలో? ఎంత మాట్లాడాలో? విజయగర్వం అలవిగాని అహంకారంగా మారకుండా… ఎలా ఉండాలో? పురాణాల నిండా కథలు కథలుగా ఉంటాయి. అలాంటి వ్యక్తిత్వం అలవరుచుకోవాలని నీతి కథల నిండా ఆ ఆదర్శాలే ఉంటాయి. ఆచరణలో మాత్రం చాలా అరుదుగా కనిపించే వ్యక్తిత్వాలివి. అలా అత్యంత అరుదయిన, అత్యంత విలువైన వ్యక్తిత్వం ర్యాట్ హోల్ మైనింగ్ కార్మికుల్లో కనిపించింది.
వారి ప్రయత్నం ఒక్కటే ఈ విజయంలో కారణం కాకపోవచ్చు. ఒక్కో ప్రయత్నం కొంత శాతం ఫలితాన్ని ఇస్తూ…చివరి అంకం వారి చేతికి చిక్కి ఉండవచ్చు. కొండను తొలచబోయి…కొండ కడుపులో చిక్కుకుపోయిన కార్మికుల ప్రాణాలను కాపాడడంలో భాగస్వాములైన అందరికీ ఈ విజయంలో భాగం ఇవ్వాల్సిందే. అందరినీ అభినందించాల్సిందే.
ఈ విజయాన్ని ఓట్లుగా మార్చుకోవాలని సొరంగం ముఖద్వారం దగ్గరే ముఖస్తుతులు, పరవశ భజన గీతాలు, క్రెడిట్ కొట్టేసే నగ్న స్వరూపాల నిస్సిగ్గును- మాదొక చిరు ప్రయత్నం; దేవుడు మమ్మల్ను సాధనంగా ఎంచుకున్నాడు అన్న ర్యాట్ హోల్ మైనింగ్ కార్మికుల వినయాన్ని పక్క పక్కన పెట్టి పోల్చి చూడకూడదు. కానీ- చూడాలి. అప్పుడే మనిషిలో సహజంగా ఉండాల్సిన మానవత్వపు మహౌన్నత్యం విలువ తెలుస్తుంది.
ఎదుటివారి ప్రాణాపాయ సమయంలో మన మహానాయకుల పబ్లిసిటీ పిచ్చి పర్వతమంత ఎత్తుకు ఎగబాకి…మనల్ను తలదించుకునేలా చేయవచ్చు.
రాజకీయ నాయకుల క్రెడిట్ స్కోరింగ్ కాంపిటీషన్ ముందు ఉత్తరాఖండ్ కొండ చిన్నబోయింది.
ర్యాట్ హోల్ మైనింగ్ కార్మికుల వినయం కొండ అద్దమందు కొంచెమై ఉంది. వారు కొండను జయించారు.
ఇలాంటివారు కోటికొక్కరు ఉండబట్టే ఇంకా వర్షాకాలంలో వర్షాలు పడుతున్నాయి. ఎండాకాలంలో ఎండలు కాస్తున్నాయి. సూర్యుడు తూర్పున ఉదయించి…పడమటే అస్తమిస్తున్నాడు.
“దైవం మానుష రూపేణ…”
దేవుడు మనిషి రూపంలోనే సహాయం చేస్తూ ఉంటాడు. మనం ఆ మనిషిని వదిలి…దేవుడి వెతుకులాటలో జీవితమంతా అగమ్యగోచరంగా తిరుగుతూ ఉంటాం.
గోవర్ధనగిరిని వేలుతో ఎత్తి పట్టి…ఏడు పగళ్లు, ఏడు రాత్రులు నిశ్చలంగా నిలుచుంటే…మనం దానికింద క్షేమంగా ఉండి…కృష్ణుడిని గోవర్ధనగిరిధారి, గిరిధారి అని కీర్తిస్తున్నాం. భజనలు చేస్తున్నాం. 17 పగళ్లు, 17 రాత్రుళ్లు కొండను తొలచి, చెక్కి…కార్మికులను క్షేమంగా ఎత్తి పట్టుకొచ్చినవారిని ప్రశంసించకపోతే…ఆ కరుణాంతరంగుడు, అపార కృపా పారావారుడు అయిన గోవర్ధనగిరిధారి కూడా మనల్ను క్షమించడు.
అమూల్యమైన ‘అమూల్’ నీరాజనం:-
ఏరోజుకారోజు జరిగే సంఘటనలతో రోజూ ఒక కార్టూన్ ద్వారా అమూల్ ప్రచారం చేసుకోవడం దశాబ్దాలుగా ఒక ఆనవాయితీ. ఈరోజు సొరంగం కార్మికులను రక్షించడం మీద అమూల్ కార్టూన్ అమూల్యమైన ప్రశంస. ఇంగ్లీషు, హిందీ భాషలో ఉన్న మాధుర్యాన్ని ఎంత సొగసుగా కార్టూన్ రచయిత పట్టుకున్నాడో చూడండి.
“Major rescue, Miner miracle
మేజర్ రెస్క్యూ, మైనర్ మిరాకిల్”
“Khao. Din ya rat
“ఖావో. దిన్ యా రాత్”
ఇంతపెద్ద రెస్క్యూ ఆపరేషన్ ను, ఒక ర్యాట్ హోల్ మైనర్ కాపాడిన మిరాకిల్(అద్భుతం).
దిన్ యా రాత్ లో రాత్రి పగలూ మళ్లీ rat ర్యాట్ మైనర్ల ప్రస్తావనే.
ఒక భాషలో ఉన్న మాటను ఇంకో భాషలో మరేదో అర్థం కోసం వాడుతూ…శబ్దసామ్యాన్ని చమత్కారానికి ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోవాలనుకునేవారు రోజూ అమూల్ కార్టూన్లు ఫాలో కావాలి. అమూల్ ప్రకటనలో భాషాభిమానులు నేర్చుకోదగ్గ పాఠాలు కోకొల్లలు.
అన్నట్లు-
నిషేధించిన ర్యాట్ హోల్ మైనింగ్ వృత్తి 41 ప్రాణాలను రక్షించింది.
మాట రాక ఏడుస్తున్న మున్నా మౌనంలో మనకు గట్టిగా, స్పష్టంగా, సూటిగా వినపడాల్సిన ప్రశ్న-
“వృత్తి కోల్పోయి…పూటగడవని…మా కార్మికుల రేపటి బతుకు ఏమిటి?”…. – పమిడికాల్వ మధుసూదన్, 9989090018
Share this Article