ఎయిడ్స్ విధ్వంసాన్ని నివారిద్దాం… నిరంతరం జాగరూకత నింపుదాం… ప్రపంచ ఎయిడ్స్ డే డిసెంబర్ 1 సందర్భంగా…
ప్రపంచ మానవ చరిత్రలో ఎయిడ్స్ వ్యాధి సృష్టించిన విధ్వంసం, బీభత్సం, విషాదాలతో ఏ ఒక్క ఇతర అంశాన్నీ సరిపోల్చలేము. 1981 జూన్ లో బయటపడిన ఎయిడ్స్ అత్యధిక కాలంగా కొనసాగుతున్న ప్రపంచ పీడ. 42 సంవత్సరాల కాలంలో ఎనిమిది కోట్ల 56 లక్షల మంది ఎయిడ్స్ జబ్బుకు దారి తీసే హెచ్ఐవి క్రిమి బారిన పడ్డారు. ఇప్పటికే నాలుగు కోట్ల నాలుగు లక్షల మంది ఎయిడ్స్ జబ్బుతో మరణించారు.
ఎక్కువ మంది ప్రజలను ఇబ్బంది పెట్టే సాంక్రమిక వ్యాధులు (అంటు వ్యాధులు) తరుణవ్యాధులు. కొద్ది రోజులు – వారాలలోనే ముగుస్తాయి. క్షయ వంటి వాటికి ఆరు నెలల నుండి రెండు సంవత్సరాల వరకు చికిత్స ఇస్తే పూర్తిగా నయం అవుతుంది. జీవితకాలపు జబ్బులుగా పరిగణించిన హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వంటి వ్యాధులను పూర్తిగా నయం చేసే ఔషధాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. చాలా ప్రపంచ పీడలు పరిమిత కాలంలోనే కల్లోలాన్ని సృష్టించి పోతుంటాయి. కానీ హెచ్ఐవి – ఎయిడ్స్ జీవితకాలపు సాంక్రమిక జబ్బు. అందువల్ల హెచ్ఐవి సోకిన వారు, వారి కుటుంబాలు నిరంతర చికిత్సతో, అప్పుడప్పుడు తలెత్తే అనారోగ్యాలతో ఆర్థికంగా కష్టాల పాలవుతుంటారు. సకాలంలో తగిన చికిత్స అందనిచో విషాదాంతమవుతుంది.
ఎయిడ్స్ జబ్బుకి కారణమైన హెచ్ఐవి క్రిమి ప్రధానంగా లైంగికంగా వ్యాప్తి చెందుతుంది. అన్ని సాంక్రమిక వ్యాధుల వలెనే… హెచ్ఐవి వ్యాప్తికి అవగాహన లేమి, పేదరికం, ఆరోగ్య వైద్య సదుపాయాల కొరత, చదువు లేకపోవడం ముఖ్యమైన విషయాలు. వీటితో పాటు స్త్రీలను చిన్నచూపు చూడడం, లైంగిక అంశాలను చర్చించడం ఇబ్బందికరం కావడం వంటి విషయాలు హెచ్ఐవి వ్యాప్తిని మరింత పెంచుతాయి. ఈ పరిస్థితులు నెలకొని ఉన్న ఆఫ్రికా, ఆసియా దేశాలలో హెచ్ఐవి జబ్బు ప్రబలంగా వ్యాపించింది.
Ads
2022 నాటికి ప్రపంచవ్యాప్తంగా మూడు కోట్ల 90 లక్షల మంది ఎయిడ్స్ / హెచ్ఐవి జబ్బుతో బాధపడుతున్నారు వీరిలో 15 లక్షల మంది 15 సంవత్సరాలు కంటే చిన్నవారు. ప్రపంచవ్యాప్తంగా 2022 సంవత్సరంలో ఆరు లక్షల 30 వేల మంది ఎయిడ్స్ జబ్బుతో చనిపోయారు. కొత్తగా 17 లక్షల మందికి కొత్తగా హెచ్ఐవి బారిన పడ్డారు.
భారతదేశంలో అందుబాటులో ఉన్న 2019 వివరాల మేరకు 23 లక్షల 49 వేల మంది హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు ఉన్నారు, వీరిలో పది లక్షల మంది మహిళలు. అదే సంవత్సరం దేశంలో దాదాపుగా 60 వేలమంది ఎయిడ్స్ జబ్బుతో మరణించారు. తెలుగు రాష్ట్రాలలో దాదాపు 5 లక్షల మంది హెచ్ఐవి తో బాధపడుతున్నారని అంచనా.
విషాదాలను మిగిల్చి, ఆర్థిక వ్యవస్థలను కుప్పకూల్చిన ఎయిడ్స్ :
సహారా ఎడానికి దిగువన ఉన్న దక్షిణాది ఆఫ్రికాలోని బోట్స్ వానా, ఉగాండా, జింబాబ్వే, జైరి, స్వాజిలాండ్, ఇథియోపియా, కాంగో, మలావి వంటి దేశాలలో బయటపడిన మొదటి దశకంలో 15 నుండి 49 సంవత్సరాల మధ్య వయసు వారిలో, అనగా ‘శ్రామికతరం’లో పది నుండి 40% మంది వరకూ హెచ్ఐవి బారిన పడ్డారు. వారు అనారోగ్యంతో ఫ్యాక్టరీలకు, పనులకు వెళ్లలేక పోవడంతో ఆయా దేశాలలోని ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి.
అనేక కుటుంబాలలో యువత ఎయిడ్స్ జబ్బుతో చనిపోగా… పిల్లలు, అవ్వతాతలు మాత్రమే మిగిలారు. 2004-5వ సంవత్సరంలో అంతర్జాతీయ వితరణ సంస్థలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్యసమితి ఎయిడ్స్ పోరాట సంస్థ ‘యుఎన్ ఎయిడ్స్’ ల పూనికతో పెద్ద ఎత్తున హెచ్ఐవి చికిత్స అందరికీ అందుబాటులోకి వచ్చింది. చికిత్స మూలంగా ఎయిడ్స్ సంబంధిత మరణాలు బాగా తగ్గి, ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు కోలుకున్నాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మూడు కోట్ల మంది హెచ్ఐవి మందులను వాడుతున్నారు.
వైద్య విజ్ఞాన గతిని మార్చిన ఎయిడ్స్:
వైద్యశాస్త్రంలో అనేక కొత్త విధానాలకు హెచ్ఐవి / ఎయిడ్స్ జబ్బు దారులు చూపింది. ఒక జబ్బు కోసం పరిశోధన చేసి రూపొందించిన మందును వేరే జబ్బుకు వాడే ప్రక్రియ (రీపర్పసింగ్ డ్రగ్) ను మొదట హెచ్ఐవి చికిత్సలోనే ప్రవేశపెట్టారు. ప్రస్తుతం జిడోవుడిన్ గా పిలుస్తున్న అజిడోథైమిడిన్ మందును క్యాన్సర్ చికిత్స కోసం రూపొందించారు. కాగా జిడోవుడిన్ ఔషధం హెచ్ఐవి వృద్ధిలో పాత్ర ఉన్న ఒక ఎంజైము పనిని అడ్డుకొని, దాని వృద్దిని నిరోధిస్తుంది. అందువల్ల అజిడోథైమిడిన్ ని హెచ్ఐవి పీడ ప్రారంభమైన ఐదు సంవత్సరాల తర్వాత, 1987 మార్చిలో హెచ్ఐవి చికిత్సకు మొదటి ఫలవంతమైన చికిత్సగా ప్రవేశపెట్టారు.
సాంక్రమిక వ్యాధుల నిరోధానికి ఆయా క్రిములు సంక్రమించే మార్గాలను అడ్డుకోవడం, టీకా – వ్యాక్సిన్ లతో ఆయా జబ్బులకు గురయ్యే వారిలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడం అనేవి ప్రధానంగా ఉన్నాయి. అయితే హెచ్ఐవి జబ్బును నిరోధించడానికి నేటికీ తగిన వ్యాక్సిన్ రూపొందించడం సాధ్యం కాలేదు. అయితే, హెచ్ఐవి చికిత్సలో వాడే కొన్ని మందులను ఈ క్రిమిసోకే అవకాశం ఉన్న వారికి ముందుగానే ఇవ్వడం మూలంగా సంక్రమణను అడ్డుకునే విధానాన్ని నిపుణులు రూపొందించారు. దీనినే ‘ప్రీఎక్స్ పోజర్ ప్రొఫైలాక్సిస్’ అంటారు. ఇది హెచ్ఐవికే పరిమితమైన కొత్త నిరోధక విధానం.
వైద్యశాస్త్రంలో అనేక సంవత్సరాల పరిశోధనల తర్వాత మాత్రమే, మందులను నిర్దేశిత సమస్య వున్న అందరికీ ఉపయోగించేందుకు ప్రవేశపెడతారు. కాగా హెచ్ఐవి జబ్బు యొక్క ప్రాణాంతకమైన తీవ్రత రీత్యా, హెచ్ఐవి ని నిలవరించడంలో మందుల యొక్క ప్రభావం నిరూపితమైన తక్కువ కాలంలోనే, త్వరితగతిన అనుమతులు ఇచ్చి రోగులందరికీ అందుబాటులోకి తెచ్చారు. ఇటీవలి కోవిడ్ పీడ సమయంలో కూడా ఈ రకమైన పరిశోధనలు ముగియకుండానే, ముందస్తు అనుమతులతో కొన్ని మందులు ప్రవేశపెట్టబడ్డాయి.
నిరంతరాయ అవగాహనతోనే హెచ్ఐవి పీడను నిలువరించగలం: ఎయిడ్స్ జబ్బు ప్రారంభమైన తర్వాత 1995లో అత్యంత విధ్వంసక స్థాయికి చేరుకుంది. ఆ ఏడాది 32 లక్షల మంది కొత్తగా హెచ్ఐవి బారిన పడ్డారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా హెచ్ఐవి – ఎయిడ్స్ అవగాహన కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించడంతో హెచ్ఐవి వ్యాప్తిని చాలా వరకు తగ్గించగలిగాము. ఎయిడ్స్ జబ్బుకి దారి తీసే హెచ్ఐవి క్రిమి ప్రధానంగా ఆ క్రిమి సోకిన వారితో సె- ద్వారానే వ్యాప్తి చెందుతుంది. హెచ్ఐవి బాధితురాలు అయిన తల్లి నుండి గర్భస్థ శిశువుకి కూడా వచ్చే అవకాశం ఉంది.
లైంగికత అనేది జీవుల సహజాతాలలో ఒకటి. అది యుక్త వయసు వచ్చిన తర్వాత మొదలు అవుతుంది. జనాభాలో ప్రతి ఏటా కొంత శాతం పిల్లలు కౌమారాన్ని వీడి యుక్తవయసులోకి వస్తుంటారు. వారిలో కొందరు లైంగిక సాహసాలు చేస్తారు. అందుకే హెచ్ఐవి వ్యాప్తి నివారణలో ఏ మాత్రం అలసత్వం కూడదు. అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం కొనసాగుతూ ఉండాలి. ఉదాసీనత మూలంగా అంతకుముందు, హెచ్ఐవి గురించి తెలియని వారు రిస్కులు చేసి ఆ జబ్బుకి గురయ్యే ప్రమాదం ఉంది.
ఎయిడ్స్ బాధిత వర్గాలతో ఎయిడ్స్ అదుపు…. 1988 నుండి ఎయిడ్స్ బాధితులతో సహానుభూతిని చెప్పేందుకు, ఎయిడ్స్ మృతులకు నివాళులర్పించేందుకు, జనాన్ని చైతన్య పరిచేందుకు, ఈ రంగంలో పని చేస్తున్న స్వచ్ఛంద సంస్థల, వైద్య సిబ్బంది సేవలను గౌరవించుకునేందుకు డిసెంబర్ 1 న ‘ప్రపంచ ఎయిడ్స్ డే’ గా నిర్వహిస్తున్నారు. 2023 ఎయిడ్స్ డే కి ఐక్యరాజ్యసమితి ఎయిడ్స్ పోరాట సంస్థ ‘యుఎన్ ఎయిడ్స్’ నినాదం ‘లెట్ కమ్యూనిటీస్ లీడ్’.
ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, ఎయిడ్స్ వల్ల తమ వారిని కోల్పోయిన బాధితులు, హెచ్ఐవికి గురయ్యే ప్రమాదం ఉన్నవారు… ఈ సమూహాలకు చెందినవారు ఎయిడ్స్ పై అవగాహన కల్పించడానికి ముందుండి నడిపించాలని యుఎన్ ఎయిడ్స్ పిలుపునిచ్చింది. …… డాక్టర్ యనమదల మురళీకృష్ణ, ఎండి, సాంక్రమిక వ్యాధుల నిపుణులు, కాకినాడ….. peopleagainstaids@yahoo.co.in
Share this Article