ఈ పెళ్లిళ్లు ఏ కేటగిరీలోకి వస్తాయి..? ఇది పెద్ద ప్రశ్న… మనం వార్తలోకి వెళ్లేముందు అసలు భారతీయ సంప్రదాయంలో ఎన్నిరకాల పెళ్లిళ్లు ఉన్నాయో చూద్దాం… అష్ట విధ వివాహాలు… ఇందులో ఇప్పుడు కొన్ని వర్తించవు… యాజ్ఞవల్క్య స్మృతి ప్రకారం…
- బ్రాహ్మ :- విద్యాచారాలు గల వరునికి కన్యనిచ్చి చేసే వివాహం
- దైవ :- యజ్ఞయాగాదులు జరిపించిన పురోహితునికి ఇవ్వవలసిన రుసుమునకు బదులుగా కన్యాదానం చేయడం
- ఆర్ష :- కన్యాశుల్కంగా వరుడి నుంచి ఒక జత ఆవు-ఎద్దులను తీసుకుని పెళ్ళి చేయడం
- ప్రాజాపత్య :- కట్నమిచ్చి పెళ్ళి చేయడం
- అసుర :- వరుడు ధనమిచ్చి వధువును కొనడం
- గాంధర్వ :- ప్రేమ వివాహం
- రాక్షస :- వధువును ఎత్తుకెళ్ళి పెళ్ళి చేసుకోవడం
- పైశాచ :- వధువును నిద్రిస్తున్నప్పుడో, మత్తులో ఉన్నప్పుడో ఆమె అభీష్టానికి వ్యతిరేకంగా అపహరించడం
ఇందులో ప్రస్తుతం చాలా వరకు వర్తించవు… అసుర… అంటే ఉల్టా కట్నమిచ్చి పెళ్లి చేసుకోవడం… ప్రస్తుతం ఆడపిల్లలకు కొరత ఉంది కాబట్టి చాలా సంబంధాల్లో వధువు తండ్రికి పెళ్లి ఖర్చులు ఇస్తున్నారు లేదా తామే స్వయంగా పెళ్లి జరిపిస్తున్నారు… కన్యాశుల్కం అంటారా..? వోకే…
Ads
గాంధర్వ వివాహాలు బోలెడు… పెద్దలు అంగీకరిస్తే పెళ్లి పందిట్లో… లేకపోతే గుళ్లో లేదా రిజిష్టరాఫీసులో… ప్రాజాపత్య పెళ్లిళ్లు ఎప్పటి నుంచో ఉన్నవే… మిగతా పెళ్లిళ్ల మాటెలా ఉన్నా… వరుడిని కిడ్నాప్ చేసి, ఎత్తుకొచ్చి, బలవంతంగా పెళ్లి చేస్తే…? దాన్నేమనాలి… యాజ్ఞవల్క్య స్మృతి రాస్తున్నప్పుడు ఊహించి ఉండరు… అందుకే ఆ ఉదాహరణల్ని వదిలేశారు…
బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఇలాంటి పెళ్లిళ్లను పకడ్వా పెళ్లిళ్లు అంటారు… యుక్త వయస్సు వచ్చిన అబ్బాయిల్ని కాపాడుకోవడం కొన్ని జిల్లాల్లో తల్లిదండ్రులకు పెద్ద పరీక్ష… ఏడాది క్రితం వార్త ఒకటి చూద్దాం… బెగూసరై జిల్లాలో ఓ పశువుల డాక్టర్… పెళ్లీడుకొచ్చాడు… కొందరి కన్నుపడింది… దగ్గరలోని గ్రామంలో ఓ పశువు హఠాత్తుగా అనారోగ్యం పాలైందని ఫోన్ చేశారు… ఇంకేముంది..? కిడ్నాప్… పెళ్లిబట్టలు తొడిగారు… బలవంతంగా పెళ్లి చేసేశారు… అబ్బాయి తల్లిదండ్రులు ఇప్పుడు కేసు పెట్టారు… ఇదీ వార్త…
(ఇది ఏడాది క్రితం జరిగిన పెళ్లి వీడియో….)
ఎయిటీస్‌లో బెగూసరై మాత్రమే కాదు, లఖిసరై, ముంగర్, మొకామా, జెహానాబాద్, గయ తదితర జిల్లాల్లోనూ ఈ పెళ్లిళ్లు జరిగేవి అధికంగా… చాలామంది బయటకు చెప్పుకునేవాళ్లు కాదు… పోలీసు కేసు పెడితే ఇంకా చిక్కులు పెడతారని భయం… ఒంటరిగా ఎక్కడికీ వెళ్లకుండా పెళ్లీడు అబ్బాయిలకు తల్లిదండ్రులు ఆంక్షలు పెడుతూనే ఉంటారు… కానీ అనేకమంది తెలియకుండా చిక్కుకునేవాళ్లు…
ఇలాంటి పెళ్లిళ్లకు కారణాలు అనేకం… ప్రధానమైంది కట్నం… డబ్బు… ఒకవేళ అమ్మాయి తరఫు వాళ్లకు డబ్బులేదనుకొండి… కాస్త నదురుగా కనిపించిన అబ్బాయి మీద కన్నేస్తారు… ఒంటరిగా దొరికితే ఎత్తుకొచ్చేస్తారు… అప్పటికప్పుడు పెళ్లి వేదిక ప్రిపేర్ చేసి, అమ్మాయికి అలంకరించేసి, అర్జెంటుగా ముత్తయిదువలను కూడగట్టేసి హడావుడిగా పెళ్లి చేసేస్తారు… పెళ్లి ప్రమాణాలు చేయించేస్తారు… బెదిరించి మరీ సంసారం చేయిస్తారు… పిల్లో పిల్లాడో పుడితే వాడే అలా పడి ఉంటాడు ఇక…
ఒకవేళ అబ్బాయి తరఫు వాళ్లు గొడవలకు వస్తారేమోనని బంధుమిత్రులతో ఘర్షణకు కూడా రెడీ అయిపోతారు ఈ పకడ్వా పెళ్లిళ్ల సందర్భాల్లో… కొన్నాళ్ల తరువాత అబ్బాయిని వదిలేస్తారు… చాలా పెళ్లిళ్లు రాజీతో ముగుస్తాయి… ఆల్‌రెడీ ఈ పెళ్లి జరిగాక అబ్బాయి తల్లిదండ్రులు వేరే సంబంధాలు చూస్తే, అమ్మాయి తరఫు వాళ్లు ఆ పెళ్లిళ్లు జరగనివ్వరు… అందుకని ఏదో పాయింట్ దగ్గర కాంప్రమైజ్ అయిపోతారు…
అమ్మాయి, అబ్బాయి వయస్సు… చదువు సంధ్య… ఎత్తు, ఇష్టాయిష్టాలు జాన్తానై… అబ్బాయి దొరకడమొక్కటే ముఖ్యం… దొరికితే ఇక పెళ్లే… చేసుకోను అని భీష్మించుకున్నా కుదరదు… ఎయిటీస్‌లో చాలా ఎక్కువగా జరిగేవి… తరువాత ఇవి క్రమేపీ తగ్గిపోయాయి… ఐనాసరే ఇంకా అక్కడక్కడా జరుగుతూనే ఉన్నయ్… వార్తల్లోకి వచ్చేవి తక్కువ… పేదరికం తాండవించే ప్రాంతాల్లో, కట్నం అనే మహమ్మారి ఉన్నన్నిరోజులూ ఈ పెళ్లిళ్లు కూడా ఉంటాయేమో…!!
తాజాగా… వైశాలి జిల్లాలో జరిగింది… గౌతమ్ కుమార్ అనే యువకుడు ఎంచక్కా బాగా చదువుకున్నాడు… బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా టీచర్ కొలువు కూడా దొరికింది… జాయినయ్యాడు కూడా… భలే దొరికాడురా వరుడు అనుకున్న రాజేశ్ రాయ్ అనే వ్యక్తి బంధువులు గౌతమ్ పై కన్నేశారు… స్కూల్‌కు వెళ్లి కిడ్నాప్ చేసి, 24 గంటల్లో తమ బంధుగణంలో చాందిని అనే ఒక అమ్మాయికి తాళి కట్టించేశారు…
మెడ మీద గన్ను పెట్టి బెదిరిస్తే పాపం ఏం చేస్తాడు మరి… అక్కడికీ చాందినికి తాళి కట్టడానికి మొరాయిస్తే దేహశుద్ది కూడా చేశారట… కోర్టులు హుంకరించినా… పోలీసులు బెదిరించినా… సొసైటీ పరిస్థితులు మారనంతకాలం ఇలాంటి పకడ్వా వివాహాలు ఆగవు… ఇదే తాజా ఉదాహరణ… ప్చ్… పెళ్లీడు యువకులు ఏ వేళనైనా సరే, ఒంటరిగా తిరిగే రోజులు కావివి…
Share this Article