Nàgaràju Munnuru……… = తగ్గిన రాబడులు.. పెరిగిన అప్పులు! =
2023-24 ఆర్ధిక సంవత్సరంలో మొదటి 7 నెలల (ఏప్రిల్ నుండి అక్టోబర్) కాలానికి తెలంగాణ రాష్ట్ర ఆదాయ, వ్యయాల మీద కాగ్ నివేదిక విడుదల చేసింది. అందులోని ముఖ్యాంశాలు చూద్దాం.
• ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర రెవెన్యూ రాబడులు (₹2.16 లక్షల కోట్లు, అప్పులు ₹39 వేల కోట్లు) ₹2.59 లక్షల కోట్లకు పైగా ఉంటాయని అంచనా వేశారు.
Ads
• రెవెన్యూ రాబడి అంచనా ₹2.16 లక్షల కోట్లకు గాను తొలి ఏడు నెలల్లో ₹99,775 కోట్లు అంటే కేవలం 46 శాతం మాత్రమే రాబడి సాధించగలిగారు.
• ఇక ఈ సంవత్సరం బడ్జెట్ ప్రకారం సేకరించాల్సిన అప్పులు ₹38,234 కోట్లకు గాను తొలి ఏడు నెలల్లోనే ₹33,378 కోట్లు సేకరించారు. ఇది మొత్తం సేకరించాల్సిన అప్పులో 87 శాతం.
• మార్చి వరకు తీసుకునే రుణ పరిమితి కేవలం ₹4,856 కొట్లే.
• రాష్ట్ర బడ్జెట్లో తొలి ఏడు నెలల కాలంలో జీతభత్యాల కోసం ₹23,391 కోట్లు, పింఛన్లకు ₹9,933 కోట్లు, అప్పుల మీద వడ్డీ చెల్లింపులకు ₹12,956 కోట్లు ఖర్చు చేశారు.
కాగ్ విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ఆదాయ వ్యయాల సంఖ్యలను విశ్లేషిస్తే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయ స్థితిలో ఉందని అర్థం అవుతుంది. ఇప్పుడు కొత్తగా ఏ ప్రభుత్వం ఏర్పడినా రాష్ట్రాన్ని నడిపించడం పెను సవాలుగా మారనుంది.
పోనీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికీ రావలసిన పన్నుల వాటాను సరిగ్గా చెల్లించడం లేదు అని ఆరోపణలు చేసి, రాష్ట్ర ఆర్థిక దుస్థితికి కేంద్రాన్ని దోషిని చేద్దాం అని అనుకున్నా కూడా సాధ్యం కాదు. ఎందుకంటే కేంద్రం పన్నుల్లో రాష్ట్ర వాటా కింద ఈ ఆర్థిక సంవత్సరం ₹14,528 కోట్లు రావాల్సి ఉండగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ₹7,136 కోట్లు అంటే 49 శాతం రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించింది.
ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం దాదాపు అన్ని పార్టీలు విపరీతమైన ఉచిత పథకాలు ప్రకటించిన నేపథ్యంలో మున్ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంకా దిగజారే అవకాశం ఉంది… (ఆర్థిక కార్యదర్శిగా అసాధ్యుడు రామకృష్ణారావుకైనా ఇది పరీక్షే…)
Share this Article