సాక్షిలో వచ్చిన ఓ వార్త పొద్దున్నుంచీ మదిలో గిర్రున తిరుగుతూనే ఉంది… మంచి వార్త… కాకపోతే మెయిన్ ఎడిషన్‌కు తీసుకోక, ఆ వార్త ప్రయారిటీ అర్థం గాక సిటీలో వేశారు… వార్త సారాంశం ఏమిటంటే..? హైదరాబాద్ నగరంలో గత ఏడాది 544 మంది ఆత్మహత్యలు జరిగితే అందులో 433 మగ ఆత్మహత్యలే… అనగా మేల్ సూసైడ్స్…
సాధారణంగా సమాజంలో ఓ అభిప్రాయం ఉంది… ఆడవాళ్లే సున్నిత మనస్కులనీ, త్వరగా కుంగిపోయి అఘాయిత్యాలకు పాల్పడతారనీ, మగవాళ్లు మానసికంగా దృఢంగా ఉండి సమస్యలతో పోరాడతారనీ అనుకుంటారు… కానీ అది నిజం కాదని చెబుతోంది ఈ వార్త… ఇది గాలి పోగేసి వండిన స్టోరీ ఏమీ కాదు…
ఎన్‌సీఆర్‌బీ (నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో) అధికారికంగా చెప్పిన గణాంకాలే… అప్పట్లో ఎవరో రచయిత చెప్పాడు కదా… ‘‘తండ్రి ఎందుకో వెనుకబడిపోయాడు’’ అని… అంటే తండ్రుల త్యాగాలు లెక్కలోకి రావడం లేదనే అర్థంలో..! నిజానికి ఈ వార్త శీర్షిక చెబుతున్నట్టు ‘‘ఓడిపోతున్నాడు అతడు’’… ఆప్ట్ హెడింగ్…
Ads
‘‘రకరకాల కారణాలతో అసలు నిజాలు బయటికి రావు’’ అని ఎవరో పోలీస్ అధికారి వ్యాఖ్యల్ని హైలైట్ చేయడంతో ఆ పక్కనే వేసిన కారణాలకు విలువ, విశ్వసనీయత లేకుండా పోయింది… సరే, కారణాలేమైనా సరే, ఆత్మహత్యల సంఖ్య నిజం… ఒక సమస్యను సరైన కోణంలో అర్థం చేసుకోలేక సిటీ డెస్క్ తప్పుచేసింది, ఇది మెయిన్ పేజీ స్టోరీ… ఇంకాస్త వర్క్ జరిగి ఉండాల్సింది… మామూలు క్రైం స్టోరీ కాదు ఇది…
కాలం మారుతోంది… పురుషుడిపై ఒత్తిడి పెరుగుతోంది… అది ఆర్థికమే కాదు, ప్రేమ వైఫల్యాలు, పెళ్లి వైఫల్యాలు, దైహిక సమస్యలు గట్రా బోలెడు… కనీసం ఆడది ఏడ్చి తనలోని ఒత్తిడిని, బాధను బయటికి పంపించేస్తుంది… మగాడు అదీ చేయలేడు… ఏడ్చే మగాడ్ని ఈ లోకం నమ్మదు కాబట్టి…! పోనీ, సానుభూతితో అర్థం చేసుకుంటుందా లోకం..? అదీ లేదు… ‘‘నువ్వేం మగాడివిరా’’ అని గేలిచేస్తుంది…
పెళ్లి కావడం లేదనేది కొందరి బాధ, జరిగిన పెళ్లితో వచ్చే సమస్యలు మరికొందరి బాధ… పెళ్లి విఫలమై విడాకులకు దారితీస్తే ఇంకో బాధ… మళ్లీ పెళ్లి కావడం ఈరోజుల్లో అసాధ్యంగా మారింది… ఇదొక బాధ… లవ్ బ్రేకప్ ఒక బాధ… కొత్త లవ్ దొరక్క మరో బాధ,,. పేరెంట్స్ బాధ్యతలు, పిల్లలు బాధ్యతలు, పెళ్లాం బాధ్యతలు… తోడుగా సర్కిల్ మెయింటెనెన్స్… కొలువుల కథలు వేరు… బాగా పెరిగిన జీవనవ్యయం, లంకె కుదరని ఆదాయవ్యయాలు… అప్పులు…
ఈ ఆత్మహత్యల్లో కొన్ని ‘కారణాలు తెలియనివి’ అనే కేటగిరీలో ఉన్నయ్… అవును, మగాడి ఆత్మహత్యలకు చాలా కారణాలు బయటపడవు… ఖచ్చితంగా మగాడి జీవితం ఇంతకుముందున్నట్టుగా ఏమీ లేదు… అందుకే ఈ స్టోరీని ఇంకాస్త లోతుగా, తిరగరాసి ఉంటే బాగుండేది… ఆడవాళ్ల కన్నీటికే కాదు, మగాడివీ కన్నీళ్లే… కాకపోతే అవి అంత త్వరగా బయటపడవు… సదరు పోలీస్ అధికారి ఎవరో చెప్పినట్టు… కొన్ని అసలు రికార్డుల్లోకి ఎక్కవు… ఏ హాస్పిటల్‌లోనో, ఏదో రోగంతో మరణించినట్టుగా కనిపించబడతాయి, తరువాత ఇంకెవరూ మాట్లాడరు…
కొద్దిరోజులుగా చాలా వార్తలు వస్తున్నయ్… ప్రియుడితో కలిసి భర్త హత్య, పిల్లలకూ విషం… హత్య దాకా రాని ఎన్నో కేసులు ఆత్మహత్యకు దారితీస్తున్నాయా..? ‘తెలియని కారణాల’ కేటగిరీలో ఇవీ ఉన్నాయా..? భార్యా రూపవతి శత్రు… భార్యా కామవతి శత్రు… రాస్తూ పోతే అనంతం… అవును, ఇదయితే నిజం… ‘‘అతడు ఓడిపోతున్నాడు…!!
Share this Article