‘ఎప్పటికైనా సీఎంను అవుతా… అన్నా, నువ్వు చెప్పు, సీఎంను అవుతానా ? కాదా ?’ రేవంత్ రెడ్డి వేసిన ఈ ప్రశ్నకు ‘కమ్మ పార్టీలో రెడ్డి సీఎం ఎలా సాధ్యం అవుతుంది’ అని నా సమాధానం . అసెంబ్లీ ఆవరణలో టీడీఎల్పి , (టీడీపీ) సియల్పి (కాంగ్రెస్) ఆఫీస్ ల మధ్య దారిలో జరిగిన చర్చలో రేవంత్ రెడ్డి నేనూ మాట్లాడుకున్న విషయం ఇది … అప్పుడు అనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కూడా కాదు …
*******
2006 లో ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉంది .. టీడీపీ శాసనసభాపక్షం కార్యాలయంలో బాబు ప్రెస్ కాన్ఫరెన్స్ తరువాత మెట్ల మీద మీడియాతో పిచ్చాపాటి … ఓ నేత ‘‘టీడీపీ నైతిక విలువలకు కట్టుబడి ఉంటుంది , కాంగ్రెస్ అలా కాదు అని చర్చ’’ పెట్టాడు… నేను వ్యంగ్యంగా ‘‘ఔను, టీడీపీలో విలువలు ఎక్కువ, ఎన్టీఆర్ టీడీపీ పెట్టాక, టికెట్లు ఇచ్చాక, ఇద్దరు అభ్యర్థులు మేం పోటీ చేయం అని వెళ్లి పోయారు… ఎందుకంటే, నామినేషన్ వేయాలి అంటే డిపాజిట్ కట్టాలి కదా ? డబ్బులతో ప్రమేయం ఉన్న ఎన్నికల్లో పోటీ చేయం అని వెళ్లిపోయారు’’ అంటూ టీడీపీలో విలువలకు అంత ప్రాధాన్యత అని వ్యంగ్యంగా చెప్పాను (ఇద్దరు వెళ్ళింది నిజమే కానీ కారణం కాంగ్రెస్ ద్వారా వచ్చిన శాసనసభ్యత్వానికి రాజీనామా చేయాలని ఎన్టీఆర్ చెప్పినందుకు వెళ్లారు..) ఇది విన్న రేవంత్ రెడ్డి ‘‘అన్న మన మీద బాగా జోకులేస్తున్నాడు … చూడాలి’’ అని ఏదో అన్నారు … అతను రేవంత్ రెడ్డి అని అప్పుడే పరిచయం … అసెంబ్లీ మండలి ఒకేసారి సమావేశం కావడంతో మండలి నుంచి రేవంత్ రెడ్డి టీడీయల్పి వైపు వచ్చారు ..
Ads
ఇండిపెండెంట్ గా mlc గా గెలిచి టీడీపీలోకి వచ్చారు . మహబూబ్ నగర్ జిల్లా నుంచి అప్పటికే నాగం జనార్దన్ రెడ్డి , రావుల చంద్రశేఖర్ రెడ్డి బాబుకు సన్నిహితులు, ఆప్తులు … రేవంత్ రెడ్డి వారికి జూనియర్.. కానీ చాలా వేగంగా బాబుకు దగ్గర అయ్యారు … ఎన్టీఆర్ భవన్ లో , అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ ఉద్యమం , రాజకీయాల గురించి చర్చించుకునే వాళ్ళం … కెసిఆర్ వల్ల తెలంగాణ రాదు … దీన్ని నువ్వు నమ్మాలి అని నాతో వాదించేవారు …
***
సియల్పి ముందు చర్చలో నన్ను చూడగానే ఎన్టీఆర్ భవన్ కు తాళం వేయించేంత వరకు నిద్రపోడు అనే వారు … తాళం కాదు, ఆ ఏరియాలో మ్యారేజ్ హాల్ లేదు … ఎన్టీఆర్ భవన్ మ్యారేజ్ హాల్ కు బాగా ఉపయోగ పడుతుంది అని చెప్పాను … తెలంగాణాలో టీడీపీకి పది వేల కోట్ల విలువ ఉంటుంది, నాకు అప్పగిస్తే చూపిస్తా అన్నారు .. అప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ అధ్యక్షుడు .. ఈ పది వేల కోట్ల లెక్క ఏమిటో తెలియదు …
ఎప్పటికైనా సీఎంను అవుతాను అని చెబితే …. ప్రాంతీయ పార్టీ ఒక రాష్ట్రానికే పరిమితం అవుతుంది . తెలంగాణాలో ఉండదు … ఐనా కమ్మ పార్టీ ద్వారా రెడ్డి సీఎం సాధ్యం కాదు అని చెప్పాను … ‘‘టీడీపీ, కాంగ్రెస్, ఇవన్నీ నేను పైకి వెళ్ళడానికి ఉపయోగపడే మెట్లు మాత్రమే … ఏ పార్టీ ఐనా ఒకటే’’ అని ఆ రోజే చాలా స్పష్టంగా చెప్పారు …
రేవంత్ రెడ్డి తాను చెప్పినట్టుగానే సీఎం అయ్యారు … నేను చెప్పినట్టే కమ్మ పార్టీలో రెడ్డి సీఎం సాధ్యం కాలేదు .. రెడ్డి పార్టీ నుంచే రెడ్డి సీఎం అయ్యారు . సాధారణంగా రాష్ట్ర స్థాయి నాయకత్వంలో ఉన్న నాయకులు కుల సమావేశాలకు వెళ్లడం తక్కువ… వెళ్లినా జాగ్రత్తగా మాట్లాడుతారు . రేవంత్ రెడ్డి ఒకసారి రెడ్ల సమావేశంలో అన్ని పార్టీలూ రెడ్లకు టికెట్లు ఇవ్వాలి, రెడ్లే గెలుస్తారు అని ప్రకటించారు . అదే జరిగింది కూడా… టీడీపీలో ఉన్నా తెలంగాణ డిమాండ్ వినిపించారు …
ఉద్యమ కాలంలో ఓ రోజు ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ నాయకులు ఓ చర్చలో‘‘ ప్రజలు తెలంగాణ కోరుకోవడం లేదు … అది నాయకుల డిమాండ్ మాత్రమే’’ అంటే … ‘‘ఈ రోజు మీరు ఇంటికి వెళ్లిన తరువాత భోజనం చేసేటప్పుడు భార్యతో ఇదే చెప్పండి, ప్రజలు తెలంగాణ కోరుకోవడం లేదు అని… అప్పుడు మీ భార్య రియాక్షన్ బట్టి మీరు నిర్ణయానికి రండి అని చెప్పాను’’ అని రేవంత్ రెడ్డి చెప్పారు …
మీడియా వాళ్ళను తొక్కుతాను అన్నా, తిట్టినా, మొదటి నుంచి అంతే… తిట్టడంలో దాపరికం ఉండదు … కోదండరాం నాయకత్వంలో jac ఏర్పాటు, ఉద్యమం సందర్భాల్లో టీడీపీపై తీవ్రమైన వత్తిడి ఉండేది .. ట్రాన్స్ఫర్ల కోసం మా ఇంటి ముందు నిలబడే వీళ్ళా నాయకులు అంటూ తిట్టేసే వారు (లెక్చరర్లు బదిలీ కోసం నాయకుల చుట్టూ తిరగడం ) …
మంత్రి కావాలి అనుకుంటే ఎప్పుడో అయ్యేవాడిని నా టార్గెట్ సీఎం అనే వారు . కాలం కలిసి వచ్చింది . డిసెంబర్ ఏడున అనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు …
బాబు మనిషా ?
రేవంత్ ను ఆర్ఎస్ఎస్ అని కొందరు , బాబు మనిషి అని కొందరు రకరకాలుగా చెబుతుంటారు … రేవంత్ రెడ్డి ఇండిపెండెంట్ mlc కాక ముందు తెరాసలో మహబూబ్ నగర్ జిల్లా నాయకుడు . తెరాస నుంచి బయటకు వెళ్లి mlc అయ్యారు . మరి రేవంత్ బాబు మనిషా ? ఆర్ఎస్ఎస్ మనిషా అంటే… ఇవేవీ కాదు, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, ఏ వాదీ కాదు .. రేవంత్ ఎవరి మనిషీ కాదు, తన మనిషి .. తన టార్గెట్ తనకు ముఖ్యం … అతనే చెప్పారు ‘‘ఈ పార్టీలు అన్నీ తాను పైకి వెళ్ళడానికి ఉపయోగ పడే నిచ్చెన మెట్లు మాత్రమే’’ అని…
రేవంత్ రామ్ గోపాల్ వర్మకు మంచి మిత్రుడు … రాంగోపాల్ వర్మ తనను తాను ప్రేమించుకునే విషయం బహిరంగంగా చెబుతాడు … రేవంత్ అంత బహిరంగంగా చెప్పరు . అంతే తేడా .. వర్మతో స్నేహం గురించి రేవంత్ రెడ్డి చెబితేనే నాకు తెలుసు … రక్త చరిత సినిమా బాగా లేదని , ఆసక్తి రేకెత్తించాలి అంటే ఎన్టీఆర్ ను అవమానించారు అనేలా అక్కడక్కడా దాడులు చేయించారు … వారే చెప్పిన విషయం ….
***
వన్ మాన్ షో
‘‘నేను ఎప్పుడూ గుంపుల ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడను … ఒక్కడినే మాట్లాడుతాను అని చెప్పాక’’…. ఓసారి గుర్తు చేసుకున్నాను, నిజమే, ఎన్టీఆర్ భవన్ లోనైనా , టీడీయల్పిలోనైనా ఒక్కరే మాట్లాడే వారు . వన్ మాన్ షో అన్నట్టుగానే ఇండిపెండెంట్ mlc నుంచి సీఎం వరకు ఎదిగారు . వన్ మాన్ షో ఉండదు, సమిష్టి నిర్ణయాలు ఉంటాయి అని రేవంత్ రెడ్డిని clp నాయకునిగా ప్రకటిస్తూ కాంగ్రెస్ ఇంచార్జ్ వేణుగోపాల్ ప్రకటించారు .
ఇప్పటి వరకు నడిచిన వన్ మాన్ షో ఇకపై ఎలా ఉంటుందో కాలమే చెప్పాలి .. ఆంధ్ర మేధావుల సంఘం వారు రేవంత్ ను వైయస్ఆర్ తో పోలుస్తున్నారు … ఏ మనిషికి ఆ మనిషి ప్రత్యేకం, ఎవరితో ఎవరికి పోలిక ఉండదు. వైస్సార్ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ను ఒక ప్రాంతీయ పార్టీగా నడిపారు . పి.జనార్దన్ రెడ్డి ఒక్క పేరు మాత్రమే సోనియా గాంధీ సూచించినా, ఆ ఒక్కరిని కూడా ysr మంత్రివర్గంలోకి తీసుకోలేదు . ఉమ్మడి రాష్ట్రంలో ysr కు అది చెల్లుబాటు అయింది . ఇప్పుడు అధికార పక్షానికి నాలుగు సీట్లు మాత్రమే ఎక్కువ ysr లా చెల్లుబాటు కాదు … కాంగ్రెస్ శాసన సభ్యుల్లో అందరూ రేవంత్ రెడ్డి కన్నా సీనియర్లే …
ఇప్పటి వరకు కనిపించిన రేవంత్ రెడ్డి ఒకరు … ఇకపై ఎలా కనిపించబోతున్నారో చూడాలి . టీడీపీ మీడియా మొత్తం రేవంత్ రెడ్డికి అండగా ఉంటుంది . రేవంత్ కు అదో పెద్ద పాజిటివ్ అంశం… యండమూరి వీరేంద్ర నాథ్ నవల ‘‘తప్పుచేద్దాం రండి’’లో ఓ అంద మైన అమ్మాయి … సాధారణ కుటుంబం … సీఎం కావాలని వ్యూహం … నవలలో చాలా అద్భుతంగా మనుషుల మనస్తత్వాలు జోడించారు … సాధారణ స్త్రీ సీఎం కావాలి అనుకుంటే ఎలా అవుతుంది అనుకుంటాం … తప్పు ,ఒప్పు అనే దానితో సంబంధం లేకుండా తన లక్ష్య సాధన కోసం ముందుకు వెళుతుంది ..
అనుముల రేవంత్ రెడ్డి ఎన్నో ఏళ్ల నుంచి సీఎం అవుతా అని చెప్పి, సీఎం కావడంతో యండమూరి తప్పు చేద్దాం రండి గుర్తుకు వచ్చింది …. బుద్దా మురళి
Share this Article