అయ్యో… బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందా..? కేటీయార్ ఇక మంత్రి కాదా..? మరి హైదరాబాద్ ఐటీ పరిస్థితేమిటి..? అని ఈ ‘విశ్వనగరం’లో పనిచేసే బోలెడు మంది ఐటీ ఉద్యోగులు కంగారుపడుతున్నారు సోషల్ పోస్టుల్లో… అక్కడికి హఠాత్తుగా ఐటీ ఇండస్ట్రీ స్తంభించిపోతుందేమో అన్నట్టు… ఇదుగో, ఇలాంటోళ్లే చంద్రబాబు ఓడిపోతే… అయ్యో, ఆ ఐటీ పితామహుడు లేకపోతే ఐటీ ఆగిపోదా..? ఐటీ ఉనికికే ప్రమాదం అన్నట్టుగా రందిపడ్డారు… పోనీ, రండిపడ్డట్టు నటించారు… ప్రపంచం ఏమైపోతుంది అన్నట్టుగా విలపించారు…
ఈ ఆందోళనలు, కన్నీళ్లు మన తెలుగువాళ్ల సొంతం… ఎవరి కోసమూ టెక్నాలజీ ఆగదు… ఎక్కడ నిపుణులు ఉన్నారో, ఎక్కడ నాణ్యమైన జీవన ప్రమాణాలు, పరిస్థితులు ఉన్నాయో అక్కడికి పెట్టుబడులు వస్తాయి… కంపెనీలు వస్తాయి… ఎస్, భౌగోళికంగా, వాతావరణపరంగా, విద్యాపరంగా, భిన్న సంస్కృతులు, భాషల సంగమస్థలిగా, నాణ్యమైన జీవనకేంద్రంగా హైదరాబాద్‌కు బోలెడన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి… ఇక్కడ ఐటీ పాతుకుపోవడానికి ప్రధాన కారణం అదే…
బెంగుళూరులో అధికారం మారుతూనే ఉంది తరచూ… చెన్నై కూడా అంతే… పూణె, ముంబై కేంద్రాలు కూడా ఐటీ కేంద్రాలే… ఎవరు ఐటీ మినిస్టర్లో ఎవరికీ పెద్దగా తెలియదు… నయాపైసా నష్టమేమీ వాటిల్లలేదు… రాష్ట్ర ప్రభుత్వాలకు ఐటీ నుంచి మంచి రెవిన్యూ ఉంది… ఏ ప్రభుత్వమైనా ఎందుకు వదులుకుంటుంది… సరిపడా పవర్, వాటర్, మౌలిక వసతులు గట్రా సమకూరుస్తుంది… రాయితీలు ఇస్తుంది… ఐటీ, ఇన్వెస్ట్‌మెంట్స్‌కు మంచి సెక్రెటరీ, మంచి టీం ఉంటే చాలు…
Ads
ప్రభుత్వ విధానాలు అంటారా..? ఉన్నది చెడగొట్టకుండా ఉంటే సరి… మరి రేప్పొద్దున రేవంత్ ప్రభుత్వం మాటేమిటి..? మంచి ఐటీ మంత్రి లేకపోతే ఎలా…? ఇవీ కొందరి డౌట్స్… సరే, ఆ కోణంలోనూ ఆలోచిస్తే మొన్నటి ఎన్నికల్లో ఎల్లారెడ్డి నుంచి గెలిచిన మదన్‌మోహన్ ఉన్నాడుగా… అఫ్‌కోర్స్, రేవంత్ మంత్రివర్గంలో తను ఉంటాడో లేదో తెలియదు కానీ, మంచి చాయిసే…
తనది కామారెడ్డి ఏరియా… రెండు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నాడు… భార్య ప్రీతి ఎవరో కాదు… మొన్న ఓటమి పాలైన ఎర్రబెల్లి దయాకర్‌రావు కూతురు ఆమె… మదన్‌మోహన్ ఓసారి జహీరాబాద్ నుంచి ఎంపీగా పోటీచేసి స్వల్ప తేడాతో ఓడిపోయాడు… తనకు స్వయంగా పలు నగరాల్లో ఐటీ కంపెనీలున్నాయి… మరిక ఐటీ మంత్రిగా గనుక చాన్స్ వస్తే తనకన్నా ఇండస్ట్రీకి ఏం కావాలో ఇంకెవరికి తెలుసు..? నిజానికి తను మన రాజేంద్రనగర్ అగ్రివర్సిటీలో అగ్రికల్చర్ ఎంఎస్సీ చేశాడు…
ఒకేసారి వేలాది మందితో మాట్లాడగలిగే యాప్ కాంగ్రెస్ కోసం రూపొందించాడు… ఎఐసీసీ కోసం శక్తియాప్ రూపొందించాడు… జాతీయ నాయకులతో మంచి పరిచయాలే ఉన్నాయి… సరే, కేబినెట్ కూర్పులో చాలా సమీకరణాలుంటయ్… అందులో తను ఫిట్టవుతాడా, రేవంత్ టీంలో ఉంటాడా లేదానేది వేరే విషయం… కాకపోతే ఐటీ ఇండస్ట్రీ కోసం పనిచేసే నాయకులే కరువైనట్టు గగ్గోలు అనవసరం అని చెప్పడమే ఈ కథన ఉద్దేశం…
అబ్బే, ఎర్రబెల్లి అంటే రేవంత్ కు పడదు అంటారా..? నిజానికి ఎర్రబెల్లి, ఆయన అల్లుడు రాజకీయ దారులు వేర్వేరు… పోనీ, అదే ఎర్రబెల్లిని మొన్న వోడించిన యంగ్ ఎంట్రప్రెన్యుర్ యశస్వినీ రెడ్డికి ఛాన్స్ ఇచ్చినా మంచిదే…
Share this Article