విధి వైపరీత్యం అంటారా..? విధి వైచిత్రి అంటారా..? డెస్టినీ డిసైడ్స్ అంటారా..? టైమ్ డిసైడ్స్ ఎవరీ థింగ్ అంటారా..? మన కళ్లెదుటే బోలెడు… నేనంటే తెలంగాణ, తెలంగాణ అంటేనే నేను అని ప్రచారం చేసుకునే కేసీయార్‌ను యావత్ తెలంగాణ సమాజం ఛీకొట్టి, తను ద్వేషించిన ఆంధ్రులే తన ఉనికిని కాపాడటం ఓ విధివిలాసం…
ఓ ఎమ్మెల్సీని కొనడానికి క్యాష్ బ్యాగులు తీసుకుపోయి, దొరికిపోయి, జైలుకుపోయిన రేవంత్‌రెడ్డి నేడు తనే ముఖ్యమంత్రి… కేసు పెట్టి, అంతు చూడాలనుకున్న ఈ కేసీయార్ కళ్లెదుటే రేవంత్ ప్రమాణస్వీకారం… రాత్రికిరాత్రి అరెస్టు చేసి, తన కూతురి శుభకార్యానికీ దూరం చేసిన అదే పోలీసులు ఇప్పుడు సెల్యూట్లు కొడుతూ, బొకేలు ఇస్తూ, ట్రాఫిక్ క్లియర్ చేస్తూ బోలెడంత బిజీ బిజీ… పోస్టింగుల కోసం క్యూలు కట్టబోతున్నారు… ఇదీ విధే…
అంతకుముందు గద్దర్‌ను చూస్తుంటే ఇదే ఆశ్చర్యం కలిగేది… ప్రజాయుద్ధనౌకగా పేరొందిన తనే చివరకు ఆస్తికుడయ్యాడు… మనువాదం అక్షింతలు, ఆశీస్సుల కోసం తువ్వాల చాచి వంగాడు… ఏ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ధిక్కరించి బుల్లెట్ ద్వారానే రాజ్యాధికారం అన్నాడో తనే పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి సై అన్నాడు… ఏ చేతులు తన దేహంలోకి బుల్లెట్ దింపాయో అవే శక్తులు తనకు సెల్యూట్ కొట్టి అధికారికంగా అంత్యక్రియల్ని చేశాయి… తనను కాల్చాలనుకున్న తుపాకులు గౌరవవందనం చేసి, గాలిలోకి పేలాయి…
Ads
వారసుడు కాదు, వారసురాలిగా బిడ్డ వెన్నెల గనుక గెలిచి ఉంటే… అదీ డెస్టినీకి ఓ ఉదాహరణగా ఉండేది… కానీ గెలవలేదు… శబరిమలలో రుతుమహిళల్ని ప్రవేశపెట్టి ఆ ఎల్డీఎఫ్ సర్కారులోని సీపీఐ లెంపలేసుకుంది… ఒక నారాయణ తిరుమల వెళ్లాడు, అదేదో విశాఖ ఆశ్రమానికి వెళ్లాడు… సో, డెస్టినీ ఎవరిని ఎటు తీసుకుపోతుందో ఎవరూ చెప్పలేరు… ఇది మళ్లీ ఎందుకు చెప్పుకోవడం అంటే… ధనసరి అనసూయ అలియాస్ సీతక్క ప్రస్థానం…
తను జనశక్తి గ్రూపులో ఓ దళసభ్యురాలు అప్పట్లో… అప్పటి ఆ ఏరియా ఆ గ్రూపు నక్సలైట్ల లీడర్ రామును పెళ్లి చేసుకున్నా, తరువాత విడిపోయింది… తన విప్లవజీవితం దృష్ట్యా పోలీసుల వేధింపులు, బెదిరింపులు అనుభవించే ఉండొచ్చు… కానీ అభినందనీయం ఏమిటంటే..? ఆమె ప్రధాన స్రవంతి రాజకీయాల్లోకి వచ్చినా పాత చేదు అనుభవాలతో సొసైటీ మీద వ్యతిరేక భావనను పెంచుకోలేదు… సొసైటీని ఇంకా ఎక్కువ ప్రేమించింది…
అంతటి కరోనా విలయంలో మారుమూల పల్లెలకూ ప్రయాసపడి తిరిగి ‘నేనున్నా’ అనే భరోసాను, నిత్యవసరాలను, మందుల్ని ఇచ్చింది… ఎస్, ఆమె ఓ లీడర్… ఈసారి ఎలాగైనా ఆమెను ఓడించాలనుకుని బీఆర్ఎస్ బడే నాగజ్యోతిని ఆమెకు పోటీగా నిలబెట్టారు… ఆమెది పీపుల్స్‌వార్ నేపథ్యం… పుట్టిందే అజ్ఞాతంలో… విప్లవగీతాలే లాలిపాటలు… అడవే ఊయల… తల్లి, తండ్రి దళంలోనే… నాగజ్యోతి మావోయిస్టు పార్టీ అగ్ర నేతలు బడే నాగేశ్వరరావు అలియాస్ ప్రభాకరన్న, బడే రాజేశ్వరి అలియాస్ నిర్మలక్క దంపతుల కుమార్తె…
ఇద్దరు బాబాయ్‌లూ అదే గ్రూపు… ఒకరు ఇప్పుడు తెలంగాణ మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి… జనశక్తి సీతక్క గెలుపు కోసం జనశక్తి కూర రాజన్న ప్రచారం చేయగా… నాగజ్యోతి రాజకీయాల్ని సహజంగానే మావోయిస్ట్ పార్టీ, ఆమె బాబాయ్ వ్యతిరేకించారు… అది సైద్ధాంతికం… ఈమె ఎమ్మెస్సీ చేయగా, సీతక్క పీహెచ్‌డీ చేసింది…
ఇప్పుడు సీతక్క తెలంగాణ రాష్ట్ర మంత్రి… రేవంత్ కేబినెట్ సభ్యురాలిగా ప్రమాణం చేస్తోంది… ఏ రాజ్యమైతే ఆమెపై నిఘా వేసి, నక్సలైటుగా వేధించిందో… అదే రాజ్యం ఆమెకు సెల్యూట్ చేస్తోంది… ఒకవేళ ఆమెకు హోం మంత్రిత్వ శాఖను గనుక ఇస్తే అది మరీ విధి వైచిత్రి… ఏ పోలీసుల వేధింపులు అనుభవించిందో, దొరికితే ఖతం చేయాలని చూసిందో ఆ పోలీస్ శాఖకు ఆమె బాస్… వావ్… ఇదీ డెస్టినీ అంటే… నేపాల్‌లో భీకర సాయుధవిప్లవాన్ని నడిపించిన ప్రచండ తరువాత రోజుల్లో ఆయుధరహితంగానే ఆ దేశానికి అధినేత అయ్యాడు… అందుకే ఎవరో సినిమా కవి అన్నట్టు… విధి చేయు వింతలన్నీ…!!
Share this Article