తెలంగాణ సీఎం అధికారిక నివాసం ప్రగతిభవన్… దాని ప్రవేశద్వారం వద్ద ఏర్పాటు చేసిన గ్రిల్స్‌ను ఈరోజు బద్ధలు కొడుతున్నారు… ఒక దొర గడీగా వెలిగిన ఈ అత్యంత విశాలమైన రాజప్రాసాదం కంచెలు పడిపోతుంటే సోషల్ మీడియా నిండా అభినందనలు… గడీ గోడలు కూలుతున్న చప్పుడు… అబ్బే, కూల్చడం దేనికి అని విమర్శలు చేస్తున్నారు… కానీ అది ఒక సంకేతం…
జగన్ సీఎం కాగానే కరకట్ట మీది చంద్రబాబు అధికారిక నివాసాన్ని కూల్చడం చంద్రబాబు పట్ల, ఆయన పార్టీ పట్ల తనెలా ఉండబోతున్నాడో ఓ ఇండికేషన్ ఇచ్చాడు… అది వేరు… కానీ ప్రగతిభవన్ కంచెలు మాత్రమే కూల్చడం ఓ పాజిటివ్ చర్య… ఓ రాజప్రాసాదాన్ని ప్రజాభవన్‌గా మార్చి, ఓ ప్రజాదర్భార్ చేయబోతున్నాను అని చెప్పే సంకేతచర్య…
నిజానికి అది అత్యంత రద్దీ ఉండే రోడ్డు… వైఎస్ అది కట్టినప్పుడు చిన్నదే… కానీ కేసీయార్ దాన్ని విపరీతంగా విస్తరించాడు… 9 ఎకరాలు… దానికోసం 50 కోట్ల దాకా ఖర్చు… ఐఏఎస్ అధికార్ల క్వార్టర్లు, నాన్ ఐఏఎస్ క్వార్టర్లు కూడా కూల్చేశారు.,. అత్యంతాధునికంగా రీమోడల్ చేశారు… (బుల్లెట్ ప్రూఫ్ బాత్‌రూమ్స్ అని అప్పట్లో కొన్ని ధ్రువీకరించబడని వార్తలు కూడా చదివినట్టు గుర్తు…) నగరం నడిమధ్యలో అంత పెద్ద గడీ దేనికి..? ఇంతా చేస్తే అందులో ఎన్ని అధికారిక సమావేశాలు జరిగాయి..? అసలు సీఎం ఎన్నిరోజులు ఉన్నాడు అందులో..?
Ads
ఇప్పుడు ఆ బారికేడ్లు తీసేస్తే ఆ రోడ్డు ట్రాఫిక్ బాగా మెరుగుపడి, జనానికి అవస్థలు తప్పుతాయి… నిజంగానే సీఎం రేవంత్ చెప్పినట్టు జనం సమస్యలు మొరపెట్టుకోవడానికి గనుక ఈ భవన్ ఉపయోగపడితే ఇంకా మేలు… ఆ రాచరికపు ఛాయలు, జాడల బదులు నిజమైన ప్రజాభవన్ కనిపిస్తే మేలు…
రిటైర్డ్ జడ్జి, రచయిత Rajender Zimbo Mangari అభిప్రాయం ఏమిటంటే… ‘‘ప్రగతిభవన్‌ను ప్రజాభవన్‌గా మార్చినంత మాత్రాన ప్రజలు సంతోషించరు. అది నిజంగా ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజల కోసమే ఉండాలి. ముఖ్యమంత్రి ఆ భవనాన్ని తన అధికారిక నివాస భవనంగా ఉపయోగిస్తారా లేదా అనేది తెలియదు. దాన్ని అధికారిక నివాసంగా స్వీకరిస్తే ప్రజలు అందులోకి సులువుగా వెళ్లగలిగే పరిస్థితి ఉండాలి. ఒకవేళ దాన్ని అధికారిక నివాసంగా స్వీకరించకపోతే విద్యార్థుల చదువు కోసమో, కళాకారుల కోసమో, ప్రజావైద్యావసరాల కోసమో ఉపయోగించాలి. ఇంకా ఏదైనా గొప్ప ఆలోచన వస్తే ఆ భవనాన్ని ఆ విధంగా సద్వినియోగం చేయాలి…’’
నిజమే… సచివాలయానిది మరో కథ… కొత్తగా కట్టిన బిల్డింగులున్నా సరే, వాస్తు సరిగ్గా లేదనే పేరుతో మొత్తం కూల్చేసి వందల కోట్లతో కొత్తది కట్టారు… అసలు కేసీయార్ సచివాలయానికి వెళ్తే కదా… ఉన్న భవనాల సద్వినియోగం అనేది ఓ కళ… అందులో ఏపీ వాటా కింద వచ్చిన పాత భవనాలను కూల్చేసి, కొత్త బిల్డింగులు అలాగే ఉంచేసి వాడుకుంటే సరిపోయేది… పోనీ, అంత ఇష్టపడి (అన్ని వందల కోట్లు ఎందుకు ఖర్చయిందో, మధ్యలోనే అంచనాలు ఎందుకు పెరిగాయో దేవుడికే తెలియాలి…) కట్టుకున్న సచివాలయం వాస్తు కేసీయార్‌కు ఏమైనా ఉపయోగపడిందా..? ఉన్న ముఖ్యమంత్రి పదవిని ఊడగొట్టింది… అందుకే భవన వినియోగం, నిర్మాణం ఇష్టారీతిన ఉండకూడదు..!
Share this Article