నిన్న సోషల్ మీడియాలో ఓ టాపిక్… ప్రియాంక, రాహుల్ గాంధీల వెనుక కనిపించిన ఆ యువతి ఎవరు..? సహజంగానే టీవీ కెమెరాలు పదే పదే ఆ ఇద్దరి వైపు చూపిస్తుంటాయి కాబట్టి వాళ్ల వెనుకే కూర్చున్న ఆ అందమైన మొహం కూడా అందరి దృష్టినీ ఆకర్షించింది… ఎప్పుడూ మన పొలిటికల్ తెర మీద గానీ, నేషనల్ స్క్రీన్ మీద గానీ చూసినట్టు లేదు, ఇంతకీ ఎవరీమె..? ఇదీ డిబేట్ టాపిక్…
ఆమెకూ తెలంగాణ రాజకీయాలకు సంబంధం ఏముంది..? ఆమె ఎందుకొచ్చింది..? రాహుల్, ప్రియాంకల దగ్గర వీవీఐపీ హోదాలో కూర్చునే హోదా ఏమిటి..? ఇలా చర్చ సాగిపోయింది… ఆమె పేరు ప్రణితి షిండే… మన సరిహద్దుల్లో ఉండే మహారాష్ట్ర, సోలాపూర్ సిటీ సెంట్రల్ ఎమ్మెల్యే ఆమె… మూడుసార్లు గెలిచింది… అంతేకాదు, మహారాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్… వయస్సు 43… ఆమె తండ్రి సుశీల్ కుమార్ షిండే…
Ads
ఆయన తెలుసు కదా… కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్దండుడు… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా కూడా చేశాడు… అలా ఆయనకూ తెలుగు ప్రజలకూ సంబంధం ఉంది… ఆయనకు ముగ్గురు ఆడపిల్లలు… వారిలో ప్రణితి ఒకరు… చిన్న కూతురు… ఆయన రాజకీయాల్లో రిటైర్‌మెంట్ ప్రకటించాక ఈమె ఆ పగ్గాలు అందుకుంది… Jai Jui అనే ఓ స్వచ్చంద సంస్థ ద్వారా జనంలో ఉండే ఆమె తండ్రి వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చింది… (28 ఏళ్లకే తొలిసారి ఎమ్మెల్యే అయ్యింది…)
చాలా యాక్టివ్ పొలిటిషియన్… ప్రస్తుతం దేశ యాక్టివ్ రాజకీయాల్లో ఉన్న అందమైన మహిళల్లో ఈమెదే అగ్రస్థానం… (రాజకీయాల్ని గ్లామర్ కళ్లతో చూడటం ఏమిటనేది వేరే చర్చ…) రేవంత్ రెడ్డి మంత్రివర్గం ప్రమాణస్వీకారానికి ఢిల్లీ హైకమాండ్ పెద్దలతోపాటు ఇరుగు పొరుగు రాష్ట్రాల పార్టీ ముఖ్యులకు కూడా ఆహ్వానాలు పంపించారు… ఈమె మహారాష్ట్ర పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కదా, ఆ హోదాలో హాజరైంది… పైగా మన సరిహద్దుల్లో ఉన్న నియోజకవర్గ ఎమ్మెల్యే…
అంతేకాదు, ఇంకాస్త ఉంది చెప్పుకోవడానికి… గుర్తుందా..? ఆమధ్య కేసీయార్ 600 వాహనాలతో అట్టహాసంగా, పటాటోపంతో సోలాపూర్‌కు ర్యాలీగా వెళ్లాడు… టీఆర్ఎస్‌లోని తెలంగాణను వదలుకుని, బీఆర్ఎస్ అనే జాతీయ పార్టీ అయ్యాక దేశంలో ఎక్కడా తనకు పెద్ద యాక్సెప్టన్సీ లభించలేదు… ఆ స్థితిలో ఆయన కన్ను మహారాష్ట్ర రాజకీయాలపై పడింది… అందులోనూ సోలాపూర్ ప్రధానం…
ఇక్కడ తెలుగువాళ్లు ఎక్కువే… మన సరిహద్దుల్లో ఉండటమే కాదు… అది చేనేత కేంద్రం… టెక్స్‌టైల్ ఇండస్ట్రీలు ఎక్కువ… సో, మనవాళ్లు ఎక్కువ కాబట్టి అక్కడి నుంచే తన జాతీయ రాజకీయాల్ని నరుక్కురావాలని కేసీయార్ ప్లాన్… తనే కాదు, మజ్లిస్‌కు హైదరాబాద్ ఓల్డ్ సిటీ తరువాత రాష్ట్రం బయట మంచి పట్టున్న స్థానం కూడా ఇదే… 2014, 2019 ఎన్నికల్లో ప్రణితి గెలిచింది మజ్లిస్ అభ్యర్థులపైనే… సో, ఇలా పలు కోణాల్లో ఆమెకు తెలంగాణతో, హైదరాబాద్‌తో లింక్ ఉంది… రేవంత్ ప్రమాణస్వీకార సభలో మెరిసింది… రేపటి లోకసభ ఎన్నికల్లో సోలాపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కాబోతోంది…
Share this Article