ఆల్ ఆఫ్ సడెన్… ముఖేష్ అంబానీ చిన్న తెర మీద ప్రత్యక్షమై… అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో మేం అందించే ఎయిర్ ఫైబర్ సేవలు పొందండి, ఆనందంగా ఉండండి, అవసరమైతే వేరే సర్వీస్ ప్రొవైడర్లతో పోల్చుకొండి, డబ్బు ఊరికే రాదు అని ప్రమోషన్ నీతులు చెప్పాడు అనుకొండి… ఎలా ఉంటుంది..?
నీతులు అంటే గుర్తొచ్చింది… ఆయన భార్య నీతా అంబానీ బొమ్మలు పెద్ద హోర్డింగులపై, బిల్ బోర్డులపై కనిపించి… రిలయెన్స్ ట్రెండ్స్ ప్రచారానికి పూనుకుంటే..? పోనీ, ఆయన కుటుంబసభ్యులు తలా ఒక అంబానీ కంపెనీని ఇలాగే ప్రచార ప్రకటనలతో ప్రమోట్ చేస్తే…? అబ్బే, అస్సలు బాగుండదు…
కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి… డబ్బు పారేస్తే బోలెడు మంది క్రియేటివ్ పీపుల్ దొరుకుతారు… సెలబ్రిటీలు కరెన్సీ నోట్లను కళ్లకద్దుకుని కాళ్లదగ్గరకు వస్తారు, వీళ్లకేం తీట అంటారా..? నిజమే గానీ… ఈమధ్య ఎవరి ప్రొడక్ట్‌ను వారే ప్రమోట్ చేసుకోవాలనే కొత్త ట్రెండ్ ఏదో మొదలైంది కదాని, ఈ డౌట్ అంతే…
Ads
షాద్‌నగర్ ఏరియాలో సుకేతన రియల్ ఎస్టేట్ వెంచర్ యాడ్స్ చూశాక ఇదే అనిపించింది సుమీ… స్వర్గసీమ శాండల్‌వుడ్ ఫార్మ్స్ అట… సదరు రియల్ ఎస్టేట్ కంపెనీ ఓనర్ చంద్రశేఖర్ ఏకంగా ఓ పౌరాణిక గెటప్ వేసి తెరపై ప్రత్యక్షమయ్యాడు… పేరు చండ్ర చంద్రశేఖర్ అనుకుంటా… ఇంతకీ ఈ వేషం భీముడా, ఘటోత్కచుడా, దుర్యోధనుడా, యమధర్మరాజా క్లారిటీ లేదు… లేక ఇంకేదో పాత్ర కావచ్చు కూడా…
తనకు బహుశా స్పూర్తి శరవణ స్టోర్స్ అధినేత శరవణన్ కావచ్చు… ఈమధ్య తమ కంపెనీ క్యాంపెయిన్ తనే తీసుకుంటున్నాడు… ఏదేదో చెప్పేస్తున్నాడు… అవునూ, తను కూడా హీరో కదా… తనను మించిన సెలబ్రిటీ ఎవరున్నారు అనుకున్నట్టున్నాడు… అసలు వీళ్లందరికీ స్పూర్తి మన గుండు బంగారం… లలితా జువెలర్స్ కిరణ్… అనేక యాడ్స్‌లో కనిపించి, డబ్బు ఊరకే రాదు అంటూ మస్తు జాగ్రత్తలు చెబుతూ, తమ దుకాణాల్లో రాయితీలు వివరిస్తూ దూసుకుపోయాడు…
‘‘నిజమే కంపెనీ ఓనర్ చెప్పే మాటలకు విలువ ఎక్కువ, విశ్వసనీయత ఎక్కువ’’ అంటుంటారు గానీ… ప్రతి కంపెనీకి ఇది పనిచేయదు… ఓ బాత్ సోప్ యాడ్ చేయాలంటే ఓనర్ కుటుంబసభ్యురాలు తెరపైకి రానక్కర్లేదు కదా… మన బరువు, పర్స్ బరువు తగ్గించగల ‘కలర్స్’ ఒబే షాప్స్‌కు సదరు ఓనర్ రాశి పబ్లిసిటీ చేస్తే వోకే, కానీ అన్ని ఉత్పత్తులకూ ఓనర్లే దిగిరాలేరు కదా… ఈ ఓనర్లే ప్రచారకర్తలుగా మారే పక్షంలో ఫాఫం, రతన్ టాటా ఎన్ని వందల యాడ్స్‌లో కనిపించాలో..! గుండుసూది నుంచి ఎయిర్ విస్తారా దాకా…!!
Share this Article