Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మరో రెండు దేశాల ‘సమరం’… అదీ మన విదేశాంగ సమస్యే ఇప్పుడు…

December 10, 2023 by M S R

ఉక్రెయిన్- రష్యా యుద్ధం… కారణాలు ఏవైనా సరే, ఏదో దేశంవైపు లైన్ తీసుకోవాల్సిన అనివార్యత ఇండియాది… ఉక్రెయిన్‌కు అమెరికా, నాటోల మద్దతు… రష్యాతో మనకు అవసరాలున్నయ్, కాలపరీక్షకు నిలబడిన దోస్తీ ఉంది… కానీ ఏ సైడ్ తీసుకోకుండా జాగ్రత్తగా మేనేజ్ చేస్తున్నాం… తప్పదు…

సేమ్, పాలస్తీనా- ఇజ్రాయిల్ ఇష్యూ… రష్యాలాగే ఇజ్రాయిల్ కూడా ఇండియాకు సాయం చేసే దేశమే… కానీ అనేక దశాబ్దాలుగా ఇజ్రాయిల్‌ను కాదని పాలస్తీనాకు సపోర్ట్ చేస్తూ వచ్చాం… కారణాలు బోలెడు… ఇప్పుడు ఇజ్రాయిల్ వైపు మన మొగ్గు… హమాస్ తదితర ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేయలేం, ఇజ్రాయిల్‌నూ దూరం చేసుకోలేం… ఇక్కడా బ్యాలెన్స్ చేస్తున్నాం… తప్పదు…

ఇలాంటిదే మరో సమస్య వస్తోంది… ఇది దక్షిణ అమెరికా ఖండానికి సంబంధించి… అక్కడ గయానా పేరిట ఓ దేశం, దాని పొరుగున వెనిజులా అని మరో దేశం… ఆ రెండు దేశాల నడుమ యుద్ధం ప్రారంభమయ్యే సూచనలున్నయ్… అదీ మనకు తల్నొప్పిగా మారవచ్చు… ఎలాగంటే..? గయనా జనాభే 8 లక్షలు, అందులో 3.5 లక్షల మంది భారతీయ మూలాలున్నవాళ్లే… అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు కూడా ఇండియన్ రూట్సే… మా పక్షాన నిలబడండి మహాప్రభో అని ఆ దేశం మనల్ని వేడుకుంటోంది… కానీ…

Ads

 చమురు నిల్వలపై కన్ను: దక్షిణ అమెరికా ఖండం ఉత్తర భాగాన ఉన్న చిన్న దేశం 'గయానా' ఇప్పుడు పొరుగుదేశం 'వెనిజ్యులా'తో యుద్ధ భయాన్ని ఎదుర్కొంటోంది. ఇందుక్కారణం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన వెనిజ్యులా తమ దేశ సరిహద్దులకు ఆనుకున్న గయానాలోని 'ఎసెక్విబో' ప్రాంతంపై కన్నేయడమే. దశాబ్దాలుగా ఆ ప్రాంతం తమదే అని వాదిస్తున్న వెనిజ్యులా ఇప్పుడు ఏకంగా యుద్ధానికి సన్నద్ధమైంది. తమ దేశంలో ఏకంగా రిఫరెండం నిర్వహించి మరీ దేశ ప్రజల్లో జాతీయ భావనను రెచ్చగొట్టింది. 'ఎసెక్విబో'ను బలప్రయోగం చేసైనా సరే స్వాధీనం చేసుకోవాలన్న ప్రయత్నాల్లో నిమగ్నమైంది. ఇంతకాలం 'ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్'లో కొనసాగుతున్న వివాదాన్ని యుద్ధం వైపు తీసుకెళ్లడానికి కారణం.. గయనాలోని 'ఎసెక్విబో' ప్రాంతం చమురు నిల్వలు సమృద్ధిగా కలిగి ఉండడమే. 2015 నుంచి ఇక్కడ జరిపిన అన్వేషణలో 11 బిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలు బయటపడ్డాయి.

సదరు వెనిజులాతో కూడా మనకు ఇన్నాళ్లూ సత్సంబంధాలే ఉన్నయ్… ఐతే అసలు సమస్య ఏమిటి..? శ్రీలంకలాగే వెనిజులా కూడా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది… అది ఆర్థికంగా బలోపేతం కావాలి… అందుకని అది గయానాలోని చమురు ధనిక ప్రాంతం ఎసెక్విబో అనే ప్రాంతంపై కన్నేసింది… వెనిజులాకు అది సరిహద్దు… దాన్ని ఆక్రమించుకుంటే ఆ చమురుతో తిరిగి ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చునని వెనిజులా ఆశ… అవసరమైతే సైనిక చర్య ద్వారా దాన్ని తమ దేశంలో కలిపేసుకోవాలని ప్రయత్నం…

ప్రపంచంలో భారీ చమురు నిల్వలు ఉన్న ప్రాంతాల్లో ఇది కూడా ఒకటి. వాటిని వెలికితీస్తే రోజుకు 1 మిలియన్ బ్యారెళ్ల కంటే ఎక్కువ ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. అదే జరిగితే ఆ దేశ భవిష్యత్తు ముఖచిత్రమే మారిపోతుంది. ఇన్నాళ్లుగా ఆ ప్రాంతం తమది అంటూ వాదిస్తూ వస్తున్న 'వెనిజ్యులా'కు ఈ సమాచారం మరింత ఆశను పెంచింది. 'ఎసెక్విబో'ను స్వాధీనం చేసుకుంటే తమ దేశ ఆర్థిక సంక్షోభాన్ని గట్టెక్కించడమే కాదు, అభివృద్ధిని పరుగులు తీయించవచ్చు అని ఆ దేశాధ్యక్షుడు నికోలస్ మదురో భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రెండు దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి.

ఆల్‌రెడీ కసరత్తు స్టార్ట్ చేసింది… ఇక్కడ 11 బిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలున్నయ్ మరి… రోజూ మిలియన్ బ్యారెళ్ల చమురు ఉత్పత్తి చేయవచ్చు… ఇంటర్నేషనల్ కోర్డ్ ఆఫ్ జస్టిస్‌లో వివాదం ఉంది… గతంలో వెనిజులాను, ఈ ఎసిక్వెబోను స్పెయిన్ పరిపాలించిందనీ, అందుకే ఇది తమ దేశంలో భాగమని వెనిజులా వాదన… నో, వందేళ్లకుపైబడి అది మా దేశంలో భాగమేనని గయానా ఆ వాదనను తిరస్కరిస్తోంది… నిజానికి ఎసిక్వెబో ప్రాంతం మొత్తం గయానాలో సగానికన్నా ఎక్కువ… అదే ఆ దేశానికి ఆదాయ కేంద్రం…

దురాక్రమణకు పన్నాగం: అంతర్జాతీయ న్యాయస్థానంలో ఉన్న వివాదాన్ని అక్కడే తేల్చుకోకుండా 'ఎసెక్యుబో'ను సైనిక శక్తితో ఆక్రమించుకునేందుకు పావులు కదుపుతోంది. ఈ క్రమంలో వెనిజ్యులా పాలకులు ఆ దేశంలో ఒక రెఫరెండం కూడా నిర్వహించారు. 'ఎసెక్విబో' తమదే అంటున్న ప్రభుత్వ వాదనపై ప్రజాభిప్రాయం కోరింది. ఆ ప్రాంతాన్ని తమ దేశంలో కొత్త రాష్ట్రంగా ఏర్పాటుచేయడంపై కూడా రెఫరెండంలో ప్రస్తావించింది. ప్రభుత్వ వాదనను సమర్ధించాలని దేశాధ్యక్షుడు నికోలస్ మదురో ప్రజలను కోరారు. అంతకు ముందు 'ఎసెక్విబో'ను ఆక్రమించుకుందాం అంటూ ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశారు. ఎసెక్విబో ప్రాంతంలో గయానా ఉపయోగించుకున్న జలాలను సైతం అడ్డుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. కొద్ది రోజుల క్రితం నిర్వహించిన రెఫరెండం ఫలితాలను వెనిజ్యులా రెండ్రోజుల క్రితం విడుదల చేసింది. ప్రజల్లో 95% మంది ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారని ఆ దేశం పేర్కొంది. దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన వెనిజ్యులాలో రాజకీయ అనిశ్చితి నెలకొంది. తనపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత నుంచి దృష్టి మళ్లించేందుకు ప్రజల్లో జాతీయ భావన రెచ్చగొట్టి యుద్ధకాంక్షను రగిల్చేందుకు నికోలస్ మదురో ప్రయత్నిస్తున్నారు. ఎసెక్విబో తమదే అని చెప్పడం ద్వారా ప్రజల్లో ఆయనకు ఆదరణ పెరుగుతోంది. చమురు నిల్వలు, ఇతర సహజ వనరులు సమృద్ధిగా ఉన్న 'ఎసెక్విబో'ను ఆక్రమించుకుని దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలన్న ప్రయత్నాల్లో వెనిజ్యులా దేశాధ్యక్షుడు నికోలస్ మదురో యుద్ధానికి కాలుదువ్వుతున్నారు.

ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి వెనిజులా అధ్యక్షుడు కొన్ని నాటకాలకు తెరతీశాడు… తమ దేశంలోనే ఓ రెఫరెండమ్ జరిపాడు… ఆక్రమించుకోవాలని అనుకున్న ప్రాంతాన్ని ఓ కొత్త రాష్ట్రంగా ప్రతిపాదించాడు… అసలే ఆర్థిక సమస్యల్లో మూలుగుతున్న దేశం కదా, జనం కూడా ఆయన మాటలకే వోటేశారు… 95 శాతం మంది ‘కబ్జాకు’ అనుకూలంగా వోటేశారట… సరే, ఇండియాతో సంబంధాల విషయానికి వద్దాం… సగానికన్నా ఎక్కువ మంది ఇండియన్ రూట్స్ వాళ్లే అనే ఓ సెంటిమెంట్ అంశాన్ని కాసేపు పక్కన పెట్టినా మనకూ చమురు కావాలి… అదే సమయంలో వెనిజులాతో వైరమూ అక్కర్లేదు…

భారత సంతతికి చెందిన అధ్యక్ష, ఉపాధ్యక్షులతో పాటు అక్కడి రాజకీయాల్లో కీలకస్థానాల్లో ఉన్న భారత మూలాలు కల్గిన నేతలు భారత్‌తో మెరుగైన, బలమైన సంబంధాలు కోరుకుంటున్నారు. భారత్ కూడా భారత మూలాలు కలిగిన ప్రజల పట్ల ప్రత్యేక దృష్టి పెడుతోంది. ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన 'ప్రవాసి భారతీయ దివస్' కార్యక్రమానికి గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీని చీఫ్ గెస్టుగా ఆహ్వానించింది. ఆ దేశ అవసరాలు తీర్చే వస్తువులతో పాటు రక్షణ పరికరాలను కూడా భారత్ అందజేస్తోంది. ఎసెక్విబో ప్రాంతంలో గుర్తించిన చమురు నిక్షేపాల వెలికితీత ద్వారా భారీ ఆర్థిక ప్రయోజనాలు ఆశించిన భారత్‌కు, వెనిజ్యులా దుష్టపన్నాగం విఘాతం కల్గిస్తుంది. అందుకే గయానా ఈ యుద్ధ భయం విషయంలో అమెరికాతో పాటు భారత్‌ను ఆశ్రయించి, యుద్ధం తలెత్తకుండా ఆపాలని కోరుతోంది.

కానీ గయానా మన సాయాన్ని కోరుతోంది… యుద్ధమే వస్తే తమ పక్షాన నిలబడాలంటోంది… సమస్య పరిష్కారానికి సహాయపడాలని అభ్యర్థిస్తోంది… అమెరికా, రష్యా, చైనా తదితర అగ్ర దేశాల్లాగే ఇండియా కూడా ఇప్పుడు బలమైన దేశం… ప్రపంచ రాజకీయాల్లో మన మాటకూ విలువ ఉంది… కానీ ఈ రాబోయే యుద్ధంలో తనేం చేయగలదు..? గయానాకు సపోర్టుగా నిలబడాలనీ, మన చమురు అవసరాల కోసం ఆ దేశపు చమురు ఫీల్డ్‌లో పెట్టుబడులు పెట్టాలని కొందరి సలహా… కానీ అంతర్జాతీయ రాజకీయాలు అంత సులభం కావు… మొత్తానికి  మన విదేశాంగ మంత్రి జైశంకర్‌ బుర్రకు మళ్లీ పనిపడింది…!!

చైనా అండ చూసుకుని మాల్దీవులు తోకజాడిస్తోంది… అక్కడ మన సైనిక స్థావరం మన అవసరం… శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్‌లను మచ్చిక చేసుకుని ఆల్‌రెడీ వాటిని దూరం చేస్తోంది చైనా… పాకిస్థాన్ అనే ధూర్తదేశం సరేసరి… ఈ స్థితిలో మన గోచీ సర్దుకోకుండా వేరే దేశాలకు సాయంగా వెళ్లే స్థితిలో ఉన్నామా..? ఇదీ ప్రశ్న…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions