జెర సైసు… అంటే కాస్త ఆగు హరీష్ రావు… ఇంకా కొత్త ప్రభుత్వం కొలువు దీరి రెండు రోజులు కూడా కాలేదు… అప్పుడే మొదలు పెట్టినవా..? ఇన్నేళ్లు రాజకీయాల్లో ఉంటివి, హనీమూన్ పీరియడ్ అనేది ఒకటి ఉంటుందని తెలియదా..? రైతుబంధు పైసలు ఏమైనయ్, ధాన్యం బోనస్ ధర ఏమైంది అని అప్పుడే స్టార్ట్ చేస్తే ఎట్లా..? జెర రేవంత్‌ను బుడ్డగోచీ సర్దుకోనివ్వు… మొన్ననే కదా తెలంగాణ సమాజానికి స్వేచ్ఛ లభించింది…
తొమ్మిదిన్నరేళ్ల పాలనలో నమ్ముకున్న తెలంగాణ సొసైటీని కుప్పకుప్ప చేశారు మీరు… అద్భుతమైన మిగులు బడ్జెట్‌ను కాస్తా 5.5 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి తోశారు… ఏం చేశారయ్యా అంటే… కనిపించేది ఆ కుంగిన కాళేశ్వరం… కొత్త సర్కారు తవ్వడం మొదలెడితే ఎక్కడ అక్రమాలు బయటపడతాయోనని ఫైళ్లు మాయం చేస్తున్నారు… అక్రమాలు, అవినీతి బయటపడకుండా అప్పుడే ఎదురుదాడి స్టార్ట్ చేశారా..?
జనం మీద పడి బతికిన సలహాదారులు, కార్పొరేషన్ల చైర్మన్లు, అకాడమీలు, పీఏలు, పీఆర్వోలు, పీఎస్‌లు, ఎక్స్‌టెండెడ్ సర్వీసులు… అబ్బో… ఒక్కొక్కరూ ఒక దేశ్‌ముఖ్… తెలంగాణ ఖజానాకు పట్టిన ధనక్రిములు… రాజీనామాలు చేయకపోతే ప్రభుత్వమే జీవోలు ఇచ్చి బయటికి తరమాల్సి వస్తోంది… ఇంకా వేలాడుతున్న గబ్బిలాలు బోలెడు… రేవంత్ ఇంకా కొరడా పట్టుకోలేదు కదా… పర్లేదు, ఆ గ్యారంటీలు అమలు చేస్తారు, లేకపోతే రాబోయే ఎంపీ ఎన్నికలకు ఏ మొహం పెట్టుకుని వెళ్తారు… కానీ ముందు జరగాల్సింది బీఆర్ఎస్ మథనం…
Ads
పేరులోని తెలంగాణ ఆత్మను కత్తిరించుకున్నారు… దేశంలో ఎవడూ యాక్సెప్ట్ చేయలేదు మిమ్మల్ని… చివరకు ఏ తెలంగాణవాదులు మీకు భరోసాగా ఉన్నారో వాళ్లూ ఛీకొట్టారు… ఎవరిని మీరు ద్వేషించారో ఆ ఆంధ్రులే మీకు వోట్లేసి ఉనికి నిలబెట్టారు… కమ్మ, తెలుగుదేశం కాంగ్రెస్‌కు సపోర్ట్ చేశారని, మిగతా కులాలు మీకు జైకొట్టాయి… లేకపోతే తమరి అంకె ఏ 20 దగ్గరో ఆగిపోయేది… ముందుగా ఎందుకు జనానికి, తెలంగాణకు దూరం అయ్యారో మథించండి…
80 వేల కోట్ల అప్పులట, కరెంటు సంస్థలకు… ఆ ప్రభాకర్‌రావును లోపలేసి విచారిస్తే కదా, కమీషన్లు ఎన్ని వేల కోట్లో తేలేది… కాళేశ్వరం తవ్వాలి కదా… అవేవో కోకాపేట భూములట, తవ్వాలి కదా… హైదరాబాద్ భూముల్లో ఇంకా ఎన్ని మిగిలాయో లెక్క తేలాలి కదా… తవ్వకాల్లో ఇంకెన్ని బయటపడాల్సి ఉందో… మరిక అప్పుడే బోనస్ ధర ఏది..? రైతుబంధు ఏది అనేస్తే ఎలా..? వందల ఎకరాల బడా జమీందార్లకూ బంధు డబ్బులు ఇచ్చారు కదా… మరి ఆ సాయానికీ ఓ కట్టుబాటు, ఓ పద్ధతి ఆలోచించాలి కదా…
గ్యారంటీలు అమలు చేయాలి… అరకొర మెజారిటీని పెంచుకోవాలి, మీరు నేర్పిన విద్యనే మీమీద ప్రయోగించాలి, గ్రేటర్‌లో బలపడాలి… ఏ పార్టీ అధికారంలో ఉంటేనేం, తమ సంగతి తామే చూసుకునే మజ్లిస్‌ను దారికి తెచ్చుకోవాలి, ఆల్‌రెడీ ప్రొటెం స్పీకర్ అంటూ స్నేహహస్తం చాచారు కదా… హైకమాండ్ అవసరాలు తీర్చాలి, వచ్చే ఎంపీ ఎన్నికలకు డబ్బు సర్దాలి… మీ అనుకూల కాంగ్రెస్ సీనియర్ల ఆటలు కట్టించాలి… కేసీయార్‌కు రిటర్న్ గిఫ్ట్‌లు ఇవ్వాలి… అధికార వ్యవస్థ ప్రక్షాళన జరగాలి… తెల్లారిలేవగానే అబ్రకదబ్ర అనగానే అయిపోతాయా..? అందుకే జెర సైసు హరీషూ… ఒక్కొక్కటే చేసుకుంటూ వస్తాడు… లేకపోతే, మీలాగే జనానికి దూరమై పోతాడు… తథ్యం… కాలం పెద్ద పెద్ద కేసీయార్‌లనే ఓ చూపు చూసింది… రేవంత్ ఎంత..?!
Share this Article