ఆయన ఓ జెయింట్ కిల్లర్… రేవంత్, కేసీయార్… ఇద్దరు సీఎం అభ్యర్థులను కామారెడ్డిలో మట్టికరిపించాడు… సొంత మేనిఫెస్టో, ఆల్‌రెడీ ఎప్పటి నుంచో జనంలో ఉంటూ ఖర్చు పెట్టుకుంటున్నాడు… ఆయనే బీజేపీ వెంకటరమణారెడ్డి… కేటీయార్, కేసీయార్ మీద విపరీతమైన ఆగ్రహంతో ఉన్నాడు… ఆ కారణాల్ని పక్కన పెడితే…
‘‘జనంతో కనెక్ట్ కావడం’’ అంటే ఏమిటో ఓ ఉదాహరణ చెప్పాడు ఓ యూట్యూబ్ చానెల్ ఇంటర్వ్యూలో… కేసీయార్‌కు ఈ విషయం తెలిస్తే… జనం నుంచి ఇంత ఛీత్కారం ఉండేది కాదు… సీఎంను జనం కలవడం ఏమిటి అనే మాటలు కేటీయార్ నోటి నుంచీ వచ్చి ఉండేవి కావు… 2, 362 పథకాలకు వైఎస్ పేరు పెట్టుకున్న ఆయన సొంత కొడుకు జగన్ కూడా నేర్చుకోవాలి… జనానికి అందుబాటులో ఉండటం అంటే ఏమిటో…
‘‘నేనప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జెడ్పీ ఛైర్మన్… వైఎస్ అంటే బాగా అభిమానం… ఓసారి ఆయన ఇంటికి వెళ్లాను… ఇద్దరు మంత్రులు, ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు అప్పటికే అక్కడ… ఈలోపు కింద నుంచి చిన్న గొడవ… ఓ బక్కరైతు గొడవ చేస్తున్నాడు… సార్‌ను కలవాలి, లేకపోతే ఇక్కడే చచ్చిపోతాను అంటున్నాడు… అది విని వైఎస్ తనను లోపలకు పంపించమన్నాడు…
Ads
కుర్చీలో కూర్చుని ఏమిటయ్యా సంగతి అనడగలేదు… లేచి నిలబడి ఆ రైతు భుజంపై చేయివేసి ఏమిటి నీ బాధ అనడిగాడు… ‘‘అయ్యా, పది రోజుల్లో నా బిడ్డ పెళ్లి, నాకున్నదే అరెకరం… అది అమ్మితే గానీ పెళ్లి చేయలేను, ఆ భూమికి పాస్‌బుక్కు ఇవ్వడం లేదు, అది లేకపోతే ఎవరూ కొనరు, బిడ్డ పెళ్లి ఆగిపోతే చచ్చిపోతా, ఇంకేం చేయాలి..?’’ అని గోస వెళ్లబోసుకున్నాడు…
అప్పటికప్పుడు వైఎస్ సీఎంవో సెక్రెటరీ జన్నత్ హుస్సేన్‌ను పిలిచి కలెక్టర్‌కు ఫోన్ కలపమన్నాడు… మండలం పేరు ఆ రైతునే అడిగి, ఆ మండల తహసిల్దార్‌కు ఫోన్ కాన్ఫరెన్స్‌లో కలపాల్సిందిగా అడిగాడు… తనే నేరుగా మాట్లాడి ఆ పాస్‌బుక్కు సాయంత్రానికల్లా ఆ రైతు ఇంట్లో ఉండాలి అని ఆర్డరేశాడు… కేవీపీని పిలిచి ఆ రైతుకు 2 లక్షలు ఇమ్మన్నాడు… ఇద్దరు బిడ్డలకు తలా లక్ష ఖర్చు చేసి పెళ్లి చేయాలనీ ఆ అరెకరం పొలం కొడుకు కోసం అలాగే ఉంచుకోవాలని రైతుకు చెప్పడంతో రైతు ఆయన కాళ్ల మీద పడిపోయాడు…’’
నిజమే… వైఎస్ ధోరణి వేరు… మామూలు జనంతో కలవడంలో ఆయన్ని మించినవాళ్లు లేరు… అందరికీ ఇలాంటి సాయం చేస్తాడని కాదు… సగటు మనిషి సమస్యలు తెలిసి, సానుకూలంగా స్పందించే పాలకుడిగా మొత్తం ప్రజానీకానికి ఓ భరోసా ఇవ్వడం… వేలాది మంది రైతులపై ఉన్న కరెంటు కేసులు ఎత్తేయడం, బకాయిలు రద్దు చేయడం, ఉచిత కరెంటు ఇవ్వడమే కాదు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, 108, 104 ఎట్సెట్రా ఎన్నో పథకాలు జనాకర్షకాలు కాదు, జనప్రయోజన పథకాలు…
ఆ రైతును మీ ఎమ్మెల్యే ఎవరో తెలుసా అనడిగాడు వైఎస్… లేదన్నాడు రైతు… పోనీ, మీ జిల్లా మంత్రి తెలుసా అనడిగాడు… తెలియదన్నాడు రైతు… అప్పుడు అక్కడ ఆ రైతుకు సంబంధించిన ఎమ్మెల్యే, జిల్లా మంత్రి ఉన్నారు… వారి వైపు ఓ చూపు విసిరి, ఆ రైతును మరీ నేనెలా తెలుసు అనడిగాడు… మీరు తెలియని వాళ్లెవరు అన్నాడు రైతు… ఎక్సలెంట్ ఎగ్జాంపుల్… ప్రగతి భవన్, కేసీయార్, ఫామ్ హౌజు, సచివాలయం… జనానికి ఎందుకు దూరమయ్యాయో తెలిసిందిగా… జగన్ ఏం నేర్చుకోవాలో తెలిసిందిగా… రేవంత్‌కూ కర్తవ్యబోధ జరిగిందిగా… సో గుడ్ వెంకటరమణారెడ్డీ… సరైన సంఘటన సమయానికి చెప్పావు… ప్రజెంట్ పాలకులు నేర్చుకపోతే కేసీయార్‌లాగే దూరమైపోతారు… అంతేకదా…
Share this Article