‘‘కేసీఆర్‌ను చంద్రబాబు తన మంత్రివర్గంలోకి తీసుకుని ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఉండేది కాదేమో… ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ అధినేతగా, తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి అనతికాలంలోనే ఈ స్థాయికి ఎదగడానికి పరోక్షంగా కేసీఆరే కారణం… 2014 ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు నోటు కేసులో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పకడ్బందీ వ్యూహరచనతో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయించి జైలుకు పంపారు… ఏకైక కుమార్తె పెళ్లి సందర్భంగా రేవంత్ రెడ్డి బెయిల్‌పై బయటకు వచ్చి మళ్లీ వెంటనే జైలుకు వెళ్ళవలసి వచ్చింది… ఈ సంఘటన జరిగి ఉండకపోతే రేవంత్ రెడ్డిలో కసి రగిలి ఉండేది కాదు…
కుమార్తె పెళ్లిని దగ్గరుండి మరీ ఘనంగా జరిపించుకోలేని పరిస్థితి కల్పించిన కేసీఆర్‌పై పగబట్టిన రేవంత్ రెడ్డి, నాటి పరిణామాలను అవకాశంగా మలచుకున్నారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అతడిలోని దూకుడు స్వభావం, వాక్చాతుర్యం పట్ల ఆకర్షితుడైన రాహుల్ గాంధీ పీసీసీ అధ్యక్షుడిగా నియమించి ప్రోత్సహించారు… తనలో ఇంత కసి, పట్టుదల పెరగడానికి కారణమైన కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి కృతజ్ఞుడై ఉంటాడా అంటే అది వేరే విషయం. చంద్రబాబు విషయంలో కేసీఆర్ అటువంటి కృతజ్ఞత ప్రదర్శించకపోగా శత్రుత్వం పెంచుకున్నారు….’’
Ads
బహుశా కృతజ్ఞతలు చెప్పుకోవడానికే యశోద హాస్పిటల్‌కు వెళ్తున్నాడేమో రేవంత్… అసలు కేసీయార్ రేవంత్ గెలుపునకు కంగ్రాట్స్ చెప్పలేదు… రాజకీయ మర్యాద లేదు… ఇన్నేళ్ల తన వైభోగానికి కారకులైన ప్రజలకూ కృతజ్ఞతలు చెప్పలేదు… ప్రజాతీర్పు ఆమోదిస్తున్నాను అనలేదు… కానీ రేవంత్ మాత్రం వెళ్తున్నాడు… ఇక పై రెండు పేరాలు నా సొంత అభిప్రాయాలు కావు… సాక్షాత్తూ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ విరచిత అమూల్య పంక్తులే… ఇదే రేవంత్‌కు అత్యంత ప్రధాన ముఖ్య సన్నిహిత సలహాదారుగా భావించబడుతున్న రాధాకృష్ణ రాసినవే… కారణం, తెలుగుదేశం చంద్రబాబుకు రాధాకృష్ణ ఎంతో, రేవంతూ అంతే…
ఇక విషయానికి వస్తే… చంద్రబాబు మంత్రిపదవి ఇవ్వకపోవడం వల్ల కాదు కేసీయార్ టీఆర్ఎస్ పెట్టుకుంది… చంద్రబాబు దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఎన్నాళ్లు ఆ తెలుగుదేశం దుకాణంలో గుమస్తా పని చేయాలి, మనమే ఓ దుకాణం పెట్టుకుంటే పోలా అనుకుని, భావి రాజకీయ ఆకాంక్షలతో టీఆర్ఎస్ స్టార్ట్ చేసుకున్నాడు… తనకు తెలియకుండానే అది పెరిగీ పెరిగీ తెలంగాణ ఏర్పాటు దాకా దారితీసింది… తరువాత కథలు అందరికీ తెలిసినవే… సో, చంద్రబాబు పట్ల కేసీయార్‌కు కృతజ్ఞత ఉండాల్సిన అవసరమేమీ లేదు… అవకాశం దొరికితే కేసీయార్ ప్రభుత్వాన్ని కూల్చేసేవాడే చంద్రబాబు… కేసీయార్ తెలివైనవాడు కాబట్టి తనను కాపాడుకున్నాడు, చంద్రబాబును తరిమేశాడు…
ఇక రేవంత్… తను కేసీయార్‌కు కృతజ్ఞత ప్రకటించాల్సిన పనేమీ లేదు… రేవంత్‌ను కేసీయార్ మామూలుగా టార్గెట్ చేయలేదు… అలాగని ఆ పగతోనే రేవంత్ కష్టపడలేదు… కాంగ్రెస్‌లో చేరికకు కారణమూ అది కాదు… అంతా తన సొంత సమీకరణాల ప్రకారమే… తెలుగుదేశాన్ని తెలంగాణ జనం ఛీత్కరిస్తున్నారు, చాన్నాళ్లు ఆ పార్టీ ఉండదు, అందుకే కాంగ్రెస్‌లో చేరాడు, బీజేపీకి తనను చేరదీయడం చేతకాలేదు… ముందు నుంచే తనకు సీఎం కావాలనే యాంబిషన్ ఉండేది… తన అడుగులన్నీ ఆవైపే వ్యూహాత్మకంగా సాగినవే…
కేవలం కేసీయార్ మీద పగ కాదు… పార్టీలో సీనియర్లు కేసీయార్ మిత్రులు కావడం కూడా రేవంత్‌కు కలిసొచ్చింది… రాహుల్ ప్రోత్సహించాడు… దీనికితోడు కేసీయార్‌కు దీటుగా నిలబడగల కాంగ్రెస్ నాయకుడు రేవంతే అనే నమ్మకం జనంలో కుదిరింది… అందుకే రేవంత్ లీడర్‌గా బలపడ్డాడు… నోటి దూల ఎక్కువైనా సరే జనం పట్టించుకోలేదు, నువ్వే మా లీడర్ అన్నారు… చివరకు సీఎం కుర్చీలో అలా కూర్చున్నాడు… కాగా కేసీయార్ మీద పగే తనను నడిపించింది అనే సూత్రీకరణ కరెక్టు కాదు, రాధాకృష్ణ అస్సలు అలా రాయకూడదు..!! రేవంత్ అంటే ఏమిటో నీకు కూడా సమజ్ కాకపోతే ఎలాగయ్యా రాధాకృష్ణా…!!
Share this Article