ఆహా ఓటీటీలో బాలయ్య హోస్ట్ చేసే అన్‌స్టాపబుల్ షో ఆగిపోయింది అని ఓ వార్త కనిపించింది… కారణం ఏమిటయ్యా అంటే, అన్నపూర్ణ స్టూడియోలో ఆ షో కోసం వేసిన సెట్టింగ్ మొత్తం పీకిపారేశారు… సో, ఇకపై అన్‌స్టాపబుల్ షో ఉండదు… అది అన్‌స్టాపబుల్ ఏమీ కాదు, జస్ట్, స్టాపబుల్ అని ఆ వార్త సారాంశం… నిజమేనా..?
ఒక కోణంలో నిజమే… స్టూడియోలో ఆ సెట్టింగ్ తీసేయడం కూడా నిజమే… ఫస్ట్ సీజన్ సూపర్ హిట్… బాలయ్యను ఓ కొత్త కోణంలో ఆవిష్కరించింది… తను కూడా ఒక ఓటీటీ కోసం షో చేస్తున్నాననే ఫీలింగేమీ లేకుండా చాలా ఫ్రీగా, సరదాగా హోస్ట్ చేశాడు… ఫస్ట్ సీజన్‌లో గెస్టుల ఎంపిక కూడా బాగానే ఉంది… తక్కువ రీచ్ ఉన్న ఓటీటీ ఐనా సరే ఈ షో ద్వారా అదీ పాపులరైంది…
దాదాపు 13 ఎపిసోడ్ల వరకూ ఫస్ట్ సీజన్ ప్రసారమైంది… తరువాత ఇదే ఊపులో సెకండ్ సీజన్ స్టార్ట్ చేశారు… కానీ పొలిటికల్ రంగు పూయడం ప్రారంభించాడు బాలయ్య దానికి… పైగా సంబంధం లేని గెస్టుల్ని ఉమ్మడిగా తీసుకొచ్చి కూర్చోబెట్టాడు… ఒకటీరెండు ఎపిసోడ్లలో భాష, స్క్రిప్టు కూడా విమర్శల పాలైంది… గెస్టుల అఫయిర్స్ వంటివి కాఫీ విత్ కరణ్ వంటి వెగటు హిందీ షోలకే పరిమితం, తెలుగులో అవి రక్తికట్టవు… మన స్టార్లు కూడా అంత ఫ్రీగా పెదవి విప్పరు… అంతేకాదు, క్రమేపీ గెస్టులు ఎవరూ పెద్దగా ఈ షోకు రావడానికి ఆసక్తి కూడా చూపించలేదు…
Ads
గెస్టులు దొరక్క ఎపిసోడ్స్ రెగ్యులర్ ఇంట్రవెల్స్‌తో రాలేదు… చివరకు పదో పదకొండో ఎపిసోడ్లు కష్టమ్మీద పూర్తిచేశారు… తరువాత భగవంత్ కేసరి సినిమా కోసం కావచ్చు ప్రత్యేకంగా ఓ ఎపిసోడ్ చేశారు… మొన్నామధ్య యానిమల్ కోసం మరో ఎపిసోడ్… సో, ఇలా బాలయ్య డేట్లు ఇచ్చిన ఆ 13 ఎపిసోడ్లు ఎలాగోలా అయిపోయాయి… మరి మూడో సీజన్..? ప్రస్తుతానికి లేదు…
మధ్యలో చంద్రబాబు అరెస్టుతో బాలయ్య అటూఇటూ తిరగాల్సి రావడంతో కొంత బ్రేక్… రాబోయే ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి జీవన్మరణ సమస్య… బాలయ్య కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాడు… తన కుటుంబానికీ ఈ ఎన్నికలు ఓ పరీక్ష… రాష్ట్రమంతా ప్రచారం చేయాల్సి ఉంటుంది… తను అన్‌స్టాపబుల్ అంటూ ఓ షో చేస్తూ కూర్చోవడం కుదరదు… ఇది ఒక కోణం…
ప్రస్తుతం ఆహా ఓటీటీ ఫైనాన్షియల్ యాస్పెక్ట్స్ అంత ఫ్రూట్‌ఫుల్‌గా ఏమీ లేవు… పెట్టుబడులు పెడుతూ పోవడమే తప్ప రిటర్న్స్ చాలా తక్కువ… అసలు ఓటీటీల బిజినెసే ఓ సంక్లిష్టమైన సబ్జెక్టు… ఏదో సినిమాలో రూపాయి పెడితే రెండుమూడు రూపాయలు లాభం లెక్క చూసుకున్నట్టుగా కుదరదు… ఈ సిట్యుయేషన్‌లో ఉంటుందో ఉండదో తెలియని అన్‌స్టాపబుల్ మూడో సీజన్ కోసం లక్షల రూపాయల అద్దె అన్నపూర్ణ స్టూడియోకు కడుతూ పోవడం వేస్ట్… సో, ఆ సెట్టింగుకు మంగళం పాడారు… సో, అన్‌స్టాపబుల్ అంటూ ఏమీ ఉండదు… ఎవరీ థింగ్ ఈజ్ స్టాపబుల్ బ్రో…
Share this Article