మక్కసత్తు ముద్దలు ~~~~~~~~~~~~~~
మక్క సత్తు ముద్దలు
అచ్చమైన ఉత్తర తెలంగాణ తిండి.
ఇక్కడివాళ్లు దీనికోసం ప్రాణమిడుచుకుంటరు.
అసలు సత్తువాసనకే సగం ప్రాణం ఆవిరయిపోతది.
బతుకమ్మ , శివరాత్రి, పెద్ద ఏకాదశి పండుగ ఏదయినా
పలారంల దీన్ని వెనుకబడేసేటిది ఒక్కటి గుడ లేదంటే లేదు.
పంట మక్కలు అంటే చిన్న మక్కలు పూలుపూలుగ వేయించి
ఆ ప్యాలాలను మెత్తగ విసిరి లేదా గిర్ని పట్టించి పిండిగ మార్చి
మంచి బెల్లం సన్నగ చిదిమి, చిక్కటి పాలల్ల వేసి మంచిగ కరిగించి
పాలల్ల ప్యాలాల పిండి వేసి కలెగలిపి ముద్దలు గడితే.. సత్తు సిద్ధం.
పసి పిల్లలకు,ముసలివాళ్లకు, పొట్టతోటి ఉన్న పడతుల కోరికకూ
తీపిగోరే నాలుకలకు..ఇంతకంటె కమ్మటి పలారం ఇంకోటి ఉండది.
తవ్వెడు పిండి ముద్దగడితే మూడు రోజులైనా మంచి రుచిగుంటది.
పయినాలకూ, సద్దిగిన్నెలకూ సత్తు,ఎంతన్న మంచిదీ, సౌకర్యమూ !
సరిగ్గా పదిహేన్నెళ్ల తర్వాత కమ్మటి మక్క సత్తుముద్ద కండ్లవడె,
మరి దొరుకక దొరుకక దొరికిన తిండికి, ఇగ వేరే చెప్పేదేముంటది..!!
ఇది.. మన తిండి - మన ఆహారసంస్కృతి.
~డా. మట్టా సంపత్కుమార్ రెడ్డి
Share this Article