చత్తీస్‌గఢ్… కాబోయే సీఎం పేరును మాజీ ముఖ్యమంత్రి రమణసింగ్ ద్వారానే ప్రతిపాదింపజేసింది బీజేపీ హైకమాండ్… అందరినీ కూర్చోబెట్టి విష్ణదేవ్ శాయ్ పేరును ప్రకటించింది… ఓ ఎస్టీ ముఖ్యమంత్రి… ఏ వర్గ కొట్లాటలూ లేకుండా ఎంపిక సజావుగా సాగిపోయింది… కాబోయే సీఎం నేపథ్యం ఆర్ఎస్ఎస్… అనూహ్యమైన ఎంపిక… ఆ రాష్ట్రంలో ఎస్టీలు ఎక్కువ…
మధ్యప్రదేశ్… సేమ్… కాబోయే సీఎం పేరు మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ద్వారా ప్రతిపాదింపజేశారు… ఆయన ఐదుసార్లు ఎంపీ, నాలుగుసార్లు ముఖ్యమంత్రి… పార్టీ చెప్పినట్టుగా మౌనంగా మోహన్ యాదవ్ పేరును ప్రకటించాడు… ఓ బీసీ ముఖ్యమంత్రి… తనది ఏబీవీపీ నుంచి ఎదిగిన ప్రస్థానం… సాఫీగా ఎంపిక… అనూహ్యమైన ఎంపిక… ఆ రాష్ట్రంలో బీసీలు ఎక్కువ…
రాజస్థాన్… సేమ్… కాబోయే సీఎం పేరును ఆ పదవి కోసం భీష్మించుక్కూర్చున్న మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే ద్వారా ప్రతిపాదింపజేశారు… తప్పలేదు, పార్టీ నిర్ణయాన్ని, మెజారిటీ ఎమ్మెల్యేల ఆమోదాన్ని శిరసావహించింది… పార్టీ చెప్పినట్టు భజన్‌లాల్ శర్మ పేరు ప్రకటించింది… ఓ బ్రాహ్మణ ముఖ్యమంత్రి… సాఫీగా ఎంపిక, అనూహ్యం కూడా… ఆర్ఎస్ఎస్ మద్దతు… మనం పొద్దున చెప్పుకున్నాం కదా, జైపూర్ రాణి దియాకుమారి గురించి… ఆమెను డిప్యూటీ చీఫ్ మినిస్టర్‌గా ఎంపిక చేశారు…
Ads
మూడు రాష్ట్రాల్లోనూ మూడు అనూహ్య ఎంపికలు… ఓసీ, బీసీ, ఎస్టీ సామాజిక సమీకరణం… అందరూ 50- 60 ఏళ్ల వాళ్లే… అందరివీ సంఘ్ నేపథ్యాలే… భజన్‌లాల్ అయితే మరీ కొత్తగా ఎమ్మెల్యే అయ్యాడు… తొలిసారి ఎమ్మెల్యే, వెంటనే సీఎం… అనూహ్యం… పేరుమోసిన పెద్ద తలకాయల నాయకత్వాల నుంచి బీజేపీ తమ శ్రేణులను విముక్తం చేస్తోంది… కొత్త ఈక్వేషన్స్, కొత్త ఎక్స్‌పరిమెంట్స్ చేస్తోంది… రాబోయే రోజులకు ఓ కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకుంటోంది…
మరి మన తెలంగాణ, మన ఏపీల్లో తనే ఎందుకు పార్టీని భ్రష్టుపట్టిస్తోంది… అది పెద్ద డిబేటబుల్ ప్రశ్న… కానీ ఇతర రాష్ట్రాల్లో బీజేపీ కొత్త సమీకరణాలతో దూకుడుగా పోతోంది… నిజానికి మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ ఈ రేంజ్ గెలుపులను ఊహించలేదు… ప్రత్యేకించి చత్తీస్‌గఢ్ మళ్లీ చేజారినట్టే అనుకుంది… ఎగ్జిట్ పోల్స్ కూడా అదే చెప్పాయి… అంతిమంగా ఆ రాష్ట్రమూ కాషాయమయమైంది…
సరే, రాజస్థాన్‌లో ఎవరీ భజన్‌లాల్ శర్మ… రాజస్థాన్ యూనివర్శిటీలో పొలిటికల్ సైన్స్‌లో పీజీ చేశాడు… సొంత వ్యాపారం ఉంది… వరుసగా నాలుగుసార్లు రాష్ట్ర బీజేపీకి ప్రధాన కార్యదర్శిగా చేశాడు… సైలెంట్ వర్కర్… ఈయన సంగనేర్ నియోజకవర్గం నుంచి (జైపూర్ ఏరియా) 48 వేల వోట్ల మెజారిటీతో గెలుపొందాడు… తను రాష్ట్ర పార్టీలో ఎన్నాళ్లుగానో ప్రముఖుడే… కానీ ఏకంగా సీఎం విజయహారం తన మెడలో పడుతుందని తనే ఊహించి ఉండడు… తొలిసారే ఎమ్మెల్యే, వెంటనే సీఎం పదవి అనేది ఊహించడమే అబ్బురంగా ఉంది…
తెలంగాణలో కూడా బీసీ సీఎం అని ప్రకటించింది… ఎస్సీ వర్గీకరణకు సై అంది… కానీ బీఆర్ఎస్‌తో కనిపించని స్నేహాన్ని కొనసాగించి, కేసీయార్‌లాగే తనూ చతికిలపడింది… నిజంగానే కేసీయార్ పట్ల ఈ సానుకూల వైఖరి గనుక లేకుంటే బీజేపీ మరిన్ని సీట్లను గెలిచి ఉండేది… ఇప్పుడు చేతులు కాలాయి కదా, ఇక ఏం చేస్తుందో..? ఏపీ బీజేపీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది… తమిళనాట అన్నామలై ఎంపికలాగా… దక్షిణ రాష్ట్రాల్లో కొన్ని విశేష ప్రయోగాలు చేస్తేనే బీజేపీకి ఫాయిదా…!!
Share this Article