పెళ్లయి ఎన్నేళ్లయితేనేం..? దీర్ఘకాలిక సాంగత్యం, సంసారం అలాగే నిలకడగా సాగాలనేమీ లేదు… ఈరోజుల్లో, మరీ ప్రత్యేకించి సెలబ్రిటీ కాపురాల్లో విడిపోవడాలు పెద్ద విశేషాలు కూడా ఏమీ కాదు… ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ సంసారం పెటాకుల బాటలో ఉందని ఎవరో ఓ ఇంగ్లిష్ పత్రిక వెబ్‌సైట్ స్టార్ట్ చేసింది… మిగతా అందరూ దాన్నే అందుకున్నారు… నిజమో, కాదో తరువాత… కానీ రాసిన తీరు మాత్రం గమ్మతుంది…
ఐశ్వర్య అమితాబ్ ఇంట్లో సుఖంగా లేదు… అత్త జయాబచ్చన్‌తో అస్సలు పడటం లేదు, చాలా ఏళ్లుగా ఇద్దరి నడుమ మాటలే లేవు… ఇక ఈ వాతావరణంలో బిడ్డను పెంచలేక, ఉంచలేక, ఆ పిల్లను తీసుకుని పుట్టింటికి వచ్చేసింది… అమ్మతో ఉంటోంది… అంతా బాగానే ఉంది, నిజమే అనుకుందాం… పెళ్లయి పదహారేళ్లయింది, అబ్బే, విడిపోతారా అనుకోవడానికి ఏమీలేదు… ముందే చెప్పుకున్నాం కదా… పెటాకులకు కారణాలు బోలెడు…
అందరూ ఈ మొత్తం రాస్తూరాస్తూనే… ఈ విభేదాలు విడాకులకు మాత్రం దారితీసే అవకాశం లేదని ముక్తాయిస్తున్నారు… అదే సమయంలో ఆమె తన యాభయ్యవ పుట్టినరోజును పుట్టింట్లోతోనే అమ్మతో, బిడ్డతో కలిపి జరుపుకుంది, మొగడు అభిషేక్ బచ్చన్ ఏదో రెండు వాక్యాల్లో ఏదో సోషల్ మీడియాలో శుభాకాంక్షల్ని మమ అనిపించాడు… పెళ్లి ఉంగరాన్ని కూడా ధరించడం లేదు… భార్యాభర్తల నడుమ కూడా చాన్నాళ్లుగా సంబంధాలు సరిగ్గా లేవు… అత్తామామలు కూడా ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పలేదు అని రాస్తున్నారు…
Ads
తన పుట్టినరోజును పుట్టింట్లో, అత్తింటివారి సంబంధం లేకుండా జరుపుకోవడం… భార్యాభర్తల నడుమ సంబంధాలు క్షీణించడం… అత్తింటి నుంచి వచ్చేసి పుట్టింటికి చేరుకోవడం… అభిషేకుడూ పట్టీపట్టనట్టుగా ఉండటం… ఇవన్నీ దేనికి సూచికలు..? ఇక పరిస్థితి మెరుగుపడే అవకాశాల్లేవని చెప్పడం… సరే, ఇప్పుడు అధికారికంగా అమితాబ్ కుటుంబం గానీ, ఐశ్వర్య గానీ స్పందించకపోవచ్చు… లేదా ఖండించవచ్చు… పూర్తిగా తెగదెంపులు అయ్యేదాకా ఏమీ మాట్లాడవద్దనీ అనుకోవచ్చు…
కాకపోతే ఇవన్నీ రాస్తూనే, అబ్బే, ఇవన్నీ నిజమే, కానీ ఇప్పుడప్పుడే విడాకుల దాకా వెళ్లే అవకాశాలు లేవని రాయడం పాత్రికేయ గడుసుతనం కాక మరేమిటి..? ఇక మరో కోణంలోకి వెళ్దాం… యాభయ్యేళ్లు నిండినా సరే ఐశ్వర్య ఈరోజుకూ ఓ ముగ్ధమందారం… తొలి సినిమా ఇరువర్ వచ్చి ఇరవై ఆరేళ్లు… ఇప్పటికీ అదే లావణ్యం… ఈరోజుకూ ఆమెకు మంచి తెర డిమాండ్ ఉంది… మొన్నీ మధ్య మణిరత్నం ప్రిస్టేజియస్ ప్రాజెక్టు పొన్నియన్ సెల్వన్‌లో ప్రధాన పాత్ర… ఆమె సంతకాలు చేయాలే గానీ అవకాశాలకేం తక్కువ… కుప్పలుతెప్పలు పడతాయి…
కానీ అభిషేకుడు ఓ ఫ్లాప్ హీరో… ఇదీ నా సినిమా అని చెప్పుకునే బాపతు రేంజ్ సినిమా ఈమధ్యకాలంలో ఏదీ లేదు… ఈ సాఫల్యవైఫల్యాలు ఆత్మన్యూనతలకు, అహాలకూ దారితీసిందా..? దీనికితోడు తనకు సొంతమైన నీలికళ్ల ఓ ప్రపంచ సౌందర్యాన్ని కూడా కాపాడుకోలేకపోవడం… ఇందులో ఎవరి తప్పు ఎంతనేది పక్కన పెడితే, రాబోయే పరిణామాాలు ఏమిటనేదీ పక్కన పెడితే… అది సినిమా కుటుంబమే కదా… ఇగోలు, ఇతర యవ్వారాల జంఝాటాల సంగతి తెలిసినవాళ్లే కదా… ప్రత్యేకించి జయాబచ్చన్ గతంలో తను కూడా సినిమా స్టారే కదా… అంతటి జాతీయ ప్రబల స్టారుడు అమితాబ్ కూడా ఈ సొంతింటి లోటుపాట్లను చక్కదిద్దలేకపోయాడా..? లేక అప్పటికే తన చేతులూ దాటిపోయిందా..?!
UpDate :: ఈ వార్తలన్నీ బహుళ ప్రచారం పొందాక ఏదో ఫంక్షన్‌కు అమితాబ్, అభిషేక్, ఐశ్వర్య హాజరయ్యారట… పలకరించుకున్నారట… డాన్సులు చేశారట… బహుశా కొన్నాళ్లు ఈ కవరింగు ఉంటుందేమో… జగం మెచ్చిన నటులు కదా…
Share this Article