పొద్దున్నే ఓ వార్త… కనీకనిపించకుండా ఆంధ్రజ్యోతిలో ఓ సింగిల్ కాలమ్… విషయం ఏమిటీ అంటే..? కేసీయార్ నివాసంలో ఇటీవల 3 రోజులపాటు శాంతియాగం నిర్వహించారు… ఎన్నికలకు ముందు కేసీయార్ రాజశ్యామల యాగం, చండీయాగం నిర్వహించారు కదా… తరువాత కొద్దిరోజులకు శాంతియాగం నిర్వహించాల్సి ఉంది… డిసెంబరు 10న దానికి ముహూర్తం ముందే నిర్ణయించారు… కానీ ఈలోపు కేసీయార్ తుంటి ఎముక విరిగింది కదా, సో, 10న ఆ యాగం నిర్వహించలేదు…
నిర్వహించకపోతే మరిన్ని కష్టాలు తప్పవు అని పండితులు హెచ్చరించడంతో 13న మొదలుపెట్టి 15న పూర్ణాహుతితో ముగించారు… ఒకరోజు కవిత, మరోరోజు హిమాంశు యాగంలో పాల్గొన్నారు… ఇదీ సదరు వార్త సారాంశం… చదువుతుండగానే ఇక్కడ కొన్ని డౌట్లు… ఏమిటంటే… అసలు రాజశ్యామల, చండీయాగాలకూ ఈ శాంతి యాగానికీ సంబంధం ఏమిటి..? నిజానికి ఫామ్ హౌజ్‌లో నిర్వహించిన ఆ పూజలు ఏమిటి..? కాస్త వివరాల్లోకి వెళ్దాం…
Ads
కేసీయార్‌కు ఈ యాగాలు, హోమాల పట్ల అనురక్తి, నమ్మకం ఎక్కువ… తను చేయించినన్ని యాగాలు బహుశా ఈ కాలంలో ఏ రాజకీయవేత్తా చేయించి ఉండడు… అత్యంత సంక్లిష్టత, ప్రయాస, వ్యయం అవసరమయ్యే అయుత చండీయాగం కూడా తను నిర్వహించిన సంగతి తెలుసు కదా… అధికార సాధనకు రాజశ్యామల యాగాన్ని చేయిస్తుంటారు… ప్రత్యర్థుల మీద పైచేయి సాధించడం దాని ఉద్దేశం… ఎక్కువగా ఇలాంటివి, అంటే దశమహావిద్యల పూజల్ని వామాచార పద్ధతిలో చేయిస్తే ఎక్కువ ఫలితం ఉంటుందంటారు…
అవి వేణుస్వామి వంటి వామాచార పూజారులు కరెక్టుగా చేయిస్తారు… కానీ ఈమధ్య సంప్రదాయ, దక్షిణాచార పూజారులు కూడా ఈ రాజశ్యామల వంటి యాగాలు చేయిస్తున్నారు… ఏదో మమ అనిపిస్తుంటారు… విశాఖ పీఠాధిపతులూ ఈ పూజలు చేయిస్తున్న తీరు చూశాం కదా… మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ మీద గెలుపుకి, మూడోసారి విజయానికి కేసీయార్ రాజశ్యామల, చండీయాగాలు చేయించాడు… నిజం… తన రాజకీయ వారసుడు కేటీయార్ ఇలాంటివి పెద్దగా నమ్మడు…
కానీ కేసీయార్ బేసిక్‌గా మరిచిపోయింది ఒకటుంది… యాగాలు, హోమాలు కేవలం ఉపశాంతులు, శాంతులే తప్ప ‘విధి లిఖిత ఫలితాల్ని’ మార్చలేవు… కేసీయార్‌కు జాతకరీత్యా అత్యుత్తమ దశ దాటిపోయింది ఇక… అష్టమ శని ప్రారంభమైంది… ఆ ఫలితాలు తప్పవు… అందుకే రాజశ్యామల, చండీయాగాలు ఫలించలేదు… గ్రహాలు వక్రసంచారం చేస్తుంటే ఏ యాగమూ రక్షించలేదు… సో, జనం ఛీత్కరించారు… ఫలితాలు కుదేలయ్యాయి…
సో, తను నిర్వహించిన రాజశ్యామల, చండీయాగాలకూ మొన్న నిర్వహించిన పూజలకూ సంబంధం లేదు… కాకపోతే కేసీయార్ కుటుంబం నిర్వహించింది గ్రహశాంతి యాగం… గతంలో చేయించిన యాగాలు, హోమాల్లో తప్పులు దొర్లినట్టు అనిపిస్తే, ఆ ప్రభావం పోవడానికి ఈ శాంతి కల్యాణం చేయిస్తారు… ఆల్‌రెడీ జాతక దుష్ఫలితాలు కనిపిస్తూ కేసీయార్ తుండి విరిగి మంచాన పడ్డాడు కాబట్టి తన తరఫున కవిత, హిమాంశు పూజలో కూర్చున్నారు…
నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడకూడదనీ, ఏర్పడినా నాలుగురోజులు స్థిరంగా ఉండకూడదనీ కేసీయార్ భావన… ఆ దిశగా పలువుర్ని సంప్రదిస్తే కరీంనగర్‌కు చెందిన ఓ పంతులు తన పబ్బం గడుపుకోవడానికి ఓ మాజీమంత్రి ద్వారా కేసీయార్ దగ్గరకు వచ్చాడట… ఆ పూజలు నేను చేయిస్తానంటూ ఇదుగో ఈ పూజలు చేయించాడట… కానీ గ్రహాల వక్రగతి ఉన్నప్పుడు ఇవేవీ పనిచేయవు… ఎంత వద్దూవద్దనుకున్నా ఆ రేవంతుడే కుర్చీ ఎక్కాడు… కొరడా చేతపట్టాడు… పిల్లి శాపాలకు ఉట్లు తెగవు, ఇలాంటి పూజలకు జాతకఫలాలు మారవు…
అవునూ, పాత యాగాల్లో తప్పుల పరిహారార్థం వైష్ణవ సంప్రదాయంలో ఇలాంటి గ్రహశాంతి పూజలో, శాంతికల్యాణాలో ఉన్నాయి అనుకుందాం… మరి ఈ పూజలో కూడా తప్పులు దొర్లితే అప్పుడేం చేస్తారు..?
Share this Article