పంట దిష్టికి హీరోయిన్ బొమ్మ
“నేలంగూలిన దాని పెన్నురముపై నిర్భీతిఁ గ్రీడింప, “నో!
బాలా! ర”మ్మని మూపుఁ జేర్చుకొని, సంస్పర్శించి, యూరార్చుచున్
గోలాంగూలముఁ ద్రిప్పి, గోవురజమున్ గోమూత్రముం జల్లి, త
ద్బాలాంగంబుల గోమయం బలఁది; రా
పండ్రెండు నామంబులన్”
శ్రీకృష్ణుడు నెలల పిల్లవాడు. కృష్ణుడిని మింగేద్దామని రాక్షసి పూతన వచ్చింది. తన చనుబాలు ఇస్తే ఆ విషానికి పిల్లాడి ప్రాణాలు పోతాయని పూతన అనుకుంది. అనుకున్న పథకం ప్రకారం కృష్ణుడు ఆడుకుంటున్న చోటికి రానే వచ్చింది. చనుబాలు ఇచ్చింది. కృష్ణుడు పాలతోపాటు పూతన ప్రాణాలను కూడా తాగేసి…దాని పొట్టమీదే ఆడుకుంటున్నాడు. భాగవతంలో ఈ సందర్భంలో మన పోతన చెప్పిన అనన్యసామాన్యమైన పద్యమిది.
Ads
నేలగూలిన పూతనమీద నిర్భయంగా, హాయిగా ఆడుకుంటున్న కృష్ణుడిని చూసిన యశోద, గోపికలు వెంటనే పిల్లాడిని ఎత్తి పట్టుకుని…దెబ్బలేమీ తగల్లేదు కదా అని తడిమి…తడిమి…చూశారు. ఆవుదగ్గరికి తీసుకెళ్లి తోకను కృష్ణుడి చుట్టూ మూడుసార్లు తిప్పి దిష్టి తీశారు. కృష్ణుడి ఒంటిమీద గోధూళి, ఆవుపేడ చల్లి…విష్ణువు పన్నెండు నామాలు చెప్పి…రక్ష! రక్ష! అన్నారు.
“రామో నామ బభూవ, హుం, తదబలా సీతేతి, హుం,తౌ పితుః
వాచా పంచవటీ తటే విహరతః తామాహర ద్రావణ:l
నిద్రార్ధం జననీ కధామితి హరే:హుంకారతః శ్రుణ్వతః
“సౌమిత్రే!క్వధను ర్ధను ర్ధను” రితి వ్యగ్రాః గిరః పాతు నః”
లీలాశుకుడి కృష్ణకర్ణామృతంలో రెండుయుగాలు కలగలిసిన గొప్ప శ్లోకమిది. బాలకృష్ణుడు ఉయ్యాల్లో ఎంతకూ నిద్రపోవడం లేదు. అమ్మా! ఏదన్నా కథ చెబితే ఊకొడుతూ…పడుకుంటాను అన్నాడు కృష్ణుడు. అలాగే అని ఉయ్యాల ఊపుతూ కథ చెబుతోంది యశోద.
అనగనగనగా అయోధ్య…
ఊ…
దానికి రాజు దశరథుడు.
ఊ…
ఆ దశరథుడి పెద్దబ్బాయి రాముడు.
ఊ…
ఆ రాముడి భార్య సీతమ్మ.
ఊ…
తండ్రి మాటకోసం ఆ రాముడు- సీతమ్మ అడవికి వెళ్లారు.
ఊ…
వారు పంచవటిలో ఉండగా రావణాసురుడు సీతమ్మను అపహరించుకుని వెళ్ళాడు.
లక్ష్మణా! ధనుర్బాణాలు తీసుకో! అని ఒక్కసారి ఉలిక్కిపడి…కోపంగా కళ్లెర్రచేసి…కృష్ణుడు ఉయ్యాల్లోనుండి దిగబోతుంటే…
ఏ పీడకల వచ్చిందో పిల్లాడికి అనుకుంటూ…
వంటింట్లో నుండి పిడికెడు ఉప్పు, మూడు ఎండు మిరపకాయలు తెచ్చి…కృష్ణుడి చుట్టూ సవ్యంగా మూడుసార్లు, అపసవ్యంగా మూడుసార్లు తిప్పి…థూ! థూ! థూ! అని మూడుసార్లు ఉమ్మినట్లు చేసి…దిష్టి తీసి…మళ్లీ పడుకోబెట్టి జోలపాడింది.
అవతారపురుషుడికే దిష్టి తప్పలేదు. ఇక మనమెంత?
చీపురుతో, కుంకుమ నీళ్లతో, ఉప్పుతో, ఎండు మిరపకాయలతో దిష్టి తీయడం తెలిసిందే.
పసిపిల్లలకు దిష్టి తగలకూడదని బుగ్గన దిష్టి చుక్క పెట్టడం అనాదిగా ఉన్నదే. ఇళ్లకు, వాహనాలకు దిష్టి తగలకుండా దిష్టి బొమ్మలు, నిమ్మకాయలు- మిరపకాయలు, గవ్వల తాళ్లు తెలిసినవే.
నరుడి దిష్టికి నాపరాయైన పగులుతుందని సామెత ఉండనే ఉంది.
శరీరంలో కళ్లు అందరికీ నిర్మాణపరంగా ఒకటే అయినా కొందరి కళ్లు ఎందుకు దిష్టి తగిలేలా ఉంటాయి? అన్నది పెద్ద చర్చ. ఈర్ష్య అసూయలతో రగిలే కళ్లు మంచివి కావు అని…అలాంటివారి చూపునుండి రక్షణకు మన పూర్వులు దిష్టి దోష పరిహారంగా ఏవేవో ఉపాయాలు కనుగొన్నారు. ఇంతకంటే లోతయిన దిష్టి జ్ఞానం అనవసరం.
వ్యవసాయంలో పంటలకు దిష్టి తగలకుండా కుండలు బోళ్లించి…సున్నపు బొట్లు పెట్టి…ఓ కర్రకు కాళ్లు చేతులు కూడా పెట్టి…దిష్టిబొమ్మను వేలాడదీయడం యుగయుగాలుగా ఉన్నదే.
తెలంగాణ గద్వాల దగ్గర ఒక రైతు ఆయిల్ పామ్ తోటలో అంతరపంటగా మిరప సాగు చేస్తున్నారు. పంట బాగా పండింది. అందరి కళ్లూ మిరపమీదే ఉన్నాయి. ఊరందరి దిష్టితో తన మిరప విలవిలాడిపోతోందని భయపడ్డ రైతు సంప్రదాయ దిష్టిబొమ్మ వల్ల ప్రయోజనం లేదనుకుని…వైవిధ్యమైన దిష్టి బొమ్మ పెట్టాడు. ఒక సినిమాలో కవ్వించే భంగిమలో ఉన్న హీరోయిన్ చిత్రాన్ని పెద్ద ఫ్లెక్సీలో వేయించి…ఆ ఫ్లెక్సీని మిరప పంటముందు బిగించాడు. అంతే! దారినపోయేవారు పంటను చూడడం మానేసి…హీరోయిన్ ను మాత్రమే చూస్తున్నారు.
దృష్టిని మళ్లించడం ద్వారా దిష్టి దోషం బారినపడకుండా పంటను కాపాడుకోవచ్చన్న ఈ రైతు అందరి దృష్టిలో ప్రశంసాపాత్రుడు కావాలి.
ద్వాపరయుగం కాబట్టి…అప్పుడంటే యశోదమ్మ ఆవుతోక, ఉప్పు, ఎండు మిరపకాయలు, థూ థూలతో దిష్టి తీసింది. ఇది కలియుగం. తోకలు, ఉప్పులు, మిరపకాయలు పనిచేయవని గ్రహించినవాడై…ఈ గద్వాల రైతు మిరపకు అందాల అనుష్కను దిష్టిబొమ్మగా పెట్టుకున్నాడు!
కాకపోతే…ఇదే ఆదర్శమై అన్ని పొలాల గట్లమీద ఇలాగే అర్ధనగ్న, పూర్ణనగ్న చిత్రాలే వెలిస్తే…
అప్పుడు “దిష్టిదోషాన్ని” ఎలా నిర్వచించాల్సి ఉంటుందన్నదే ప్రశ్న! – పమిడికాల్వ మధుసూదన్ 9989090018
Share this Article