“కమలములు నీటబాసిన
గమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్
దమ దమ నెలవులు దప్పిన
దమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ..!”
ఇది ఒకప్పుడు పాపులర్ నీతి పద్యం. ఈ నీతి జాతి జీవనాడుల్లో బాగా ఇంకిపోవడంతో ఇప్పుడు విడిగా ఈ పద్యాన్ని ఎవరూ పైకి చెప్పుకోవాల్సిన పని లేదు. స్దాన బలిమి చాలా ముఖ్యం. మొసలి నీటిలో ఉంటే పులి. బయటికొస్తే పిల్లికి కూడా భయపడాల్సిందే. పోలీసు ఖాకీ డ్రస్ వేసుకుంటే లేదా చేతిలో తుపాకి ఉంటే పవర్ ఫుల్. ఖాకీ డ్రస్ వేసుకుని, చేతిలో తుపాకి ఉండి, పోలీస్ స్టేషన్లో ఉంటే మరీ పవర్ ఫుల్. వెయ్యేనుగులు మీద పడ్డా అలాంటి పోలీసు స్దాన బలిమి ముందు నిలువ లేవు. అలాంటి పేరుగొప్ప, అపరిమిత స్థాన బలం ఉన్న ఒక పోలీస్ స్టేషన్ కు ఆఫ్టరాల్ ఒక కరెంటు డిపార్ట్ మెంట్ లైన్ మ్యాన్, అది కూడా కాంట్రాక్ట్ ఉద్యోగి చుక్కలు చూపించాడు.
Ads
హైదరాబాద్ లో రోడ్డు మీద నిఘా డ్యూటీలో ఉన్న పోలీసులు ఒక ద్వి చక్ర వాహనం నడుపుతున్న మైనర్ పిల్లాడిని పట్టుకున్నారు. ఈలోపు కరెంట్ డిపార్ట్ మెంట్లో పనిచేసే ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి ఫోన్ చేసి- ఆ పిల్లాడిని తానే పంపానని, వదిలి పెట్టాలని కోరాడు. అంత చిన్న పిల్లాడికి బండి ఎలా ఇచ్చావ్ అని పోలీసులు ఫోన్లోనే గడ్డి పెట్టారు. దీనితో హర్ట్ అయిన కాంట్రాక్ట్ ఉద్యోగి ఆ పోలీస్ స్టేషన్ కు కరెంట్ కట్ చేసి పారేశాడు. భూమి నిలువుగా చీలినా; ఆకాశం విరిగి మీద పడ్డా, పదేళ్లు కరెంటు బిల్లు కట్టకపోయినా పోలీస్ స్టేషన్ కు కరెంట్ కట్ కాదు. అలాంటిది పోలీస్ స్టేషన్లో కారు చీకట్లు ఎలా కమ్ముకున్నాయో మొదట పోలీసులకు అర్థం కాలేదు.
రెండు గంటలు అంధకారంలో మగ్గిన తరువాత పోలీసులు కరెంట్ కట్ క్రైమ్ సీన్‌ను రీ కన్స్ట్రక్ట్ చేశారు. అప్పుడు వారికి కార్య కారణ సంబంధం తెలిసింది. లైన్ మ్యాన్ ను తిట్టాము కాబట్టి…లైన్ కట్ చేసి ఉంటాడని ఊహించి… బాబ్బాబూ! కరెంటు లైన్ కనెక్ట్ చేయరా..నాయనా! అని ప్రాధేయపడ్డారు. నా మనో భావాలు దెబ్బతిన్నాయి. నేనివ్వనుగాక ఇవ్వను అని మొండికేశాడు. చివరికి పోలీసు ఉన్నతాధికారులు, కరెంట్ డిపార్ట్ మెంట్ పెద్ద అధికారులు కలుగజేసుకుని …పోలీసు స్టేషన్లో ఆరిన దీపాలను తిరిగి వెలిగించారు. ఈ వార్త పెద్దగా పత్రికల్లో రాకపోవడమే మంచిదయ్యింది. లేకపోతే వాటర్ వర్క్స్ వాడిని రోడ్డు మీద పట్టుకోగానే పోలీస్ స్టేషన్ కు వాటర్ కట్. ఇంటర్ నెట్ కేబుల్ వాడిని పట్టుకోగానే నెట్ కట్. “For every action there is an equal and opposite reaction” అని న్యూటన్ సూత్రం!…… By…. -పమిడికాల్వ మధుసూదన్
Share this Article