ఒక వార్త… తెలంగాణ బరిలో సోనియా గాంధీ… మరో వార్త… మెదక్ నుంచి కేసీయార్..? నిజమేనా..? ఈసారి మెదక్ పార్లమెంటరీ స్థానంలో సోనియా వర్సెస్ కేసీయార్ పోటీని చూడబోతున్నామా..? హోరాహోరీ సమరం సాగనుందా..? ఇరుపక్షాలూ తమ సాధనసంపత్తిని భారీ స్థాయిలో మొహరిస్తాయా..?
మొన్న కామారెడ్డిలో కేసీయార్ పోటీ చేస్తే రేవంత్ రెడ్డిని బరిలోకి దింపారు… గెలుపో ఓటమో జానేదేవ్… భలే స్ట్రాటజీ… మరోవైపు గజ్వెల్‌లో ఈటలను దింపింది బీజేపీ… (ప్రభుత్వ వ్యతిరేక వోటు చీలిపోయి కేసీయార్ రెండు చోట్ల గెలవాలనేమో… అదసలే బీజేపీ… బీఆర్ఎస్ దోస్త్…) ఒకవేళ నిజంగానే మెదక్ బరిలో సోనియా, కేసీయార్ నిలబడితే… బీజేపీ నుంచి కిషన్‌రెడ్డిని నిలబెడతారా..? అంబర్ పేట, సికింద్రాబాద్ కాదు సారూ, అది మెదక్… పోనీ, డీకే అరుణ బెటర్ అంటారా..?
Ads
అవునూ, నిజంగానే సోనియా మెదక్ నుంచి పోటీ చేస్తుందా..? మెదక్ నుంచే దేనికి..? గతంలో ఇక్కడ ఇందిరాగాంధీ పోటీచేసింది కాబట్టి ఈసారి సోనియా ఆ వారసత్వాన్ని కొనసాగించాలట… ఎవరో రాసుకొచ్చారు… ఇన్ని దశాబ్దాల తరువాతా ఈ వారసత్వ పోటీ…!! నో, నో, అత్యంత సురక్షిత స్థానం నల్గొండ… లేదా ఖమ్మం… అందుకని ఈ సీట్లలో ఒకటి ఎంచుకోవాలని మరొకరు రాసుకొచ్చారు… పోటీ చేస్తే గీస్తే మెదక్ నుంచే చేసి, ఆ బలమైన పోటీ స్థానంలో కేసీయార్‌ను ఓడిస్తేనే కదా పొలిటికల్ మజా… నల్గొండ, ఖమ్మంలో ఏముంది..?
అవునూ, నిజంగానే కేసీయార్ మెదక్ నుంచి పోటీ చేస్తాడా..? అంటే నువ్వు సీఎం కాకపోతే ఇక ఢిల్లీకి పోయి చక్రాలు తిప్పుతావా..? నీకు వోటేసిన గజ్వెల్ ప్రజలు పిచ్చోళ్లా..? ఐనా చక్రాలు తిప్పడానికి ఢిల్లీలో తమరి జాతీయ పార్టీని గుర్తించినవారెవ్వరు..? అక్కడ కూర్చుని గాయిగత్తర లేపడానికి ఏమీ లేదు… సో, మెదక్ నుంచి కేసీయార్, సోనియాలు పోటీపడతారనేది జస్ట్ ఓ ఊహాగానం… మీడియా నాలుగు వార్తలు రాసుకోవడానికి మాత్రమే…
తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫయిర్స్ కమిటీ ఆమెను తెలంగాణలో నిలబడమని కోరుతూ ఓ తీర్మానం చేసింది… ఫలానా మెదక్, ఫలానా నల్గొండ నుంచి అని కాదు… పైగా వీలైతే తెలంగాణ నుంచే రాజ్యసభకు వెళ్లమని కోరుతోంది… ఆమే వోకే అంటే రాజ్యసభ సీటు చిటికెలో పని… ఏదో సోనియాగాంధీ పట్ల విధేయత, కృతజ్ఞత ప్రకటనకు ఈ తీర్మానం… అంతేతప్ప సీరియస్ కోరికేమీ కాదు… పైగా మెదక్ సురక్షితమూ కాదు… మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు నాన్-కమ్మ ఆంధ్రా వోటర్లు బీఆర్ఎస్‌కు ఫుల్ సపోర్ట్ చేశారక్కడ… కాంగ్రెస్ చతికిలపడింది… సో, ఆమెను పోటీచేయించడంకన్నా అదే వ్యయప్రయాసల్ని ఓ పది మంది బీఆర్ఎస్ నుంచి లాగేయడానికి వెచ్చిస్తే… రేవంత్ అధికారానికి స్థిరత్వం…
పైగా భావి ప్రధానిగా కాంగ్రెస్ శ్రేణులు కీర్తించే ఆ రాహుల్ గాంధీ ఆమేథీ నుంచి పోటీచేయకుండా… ఓటమి భయంతో ముస్లిం జనాభా అధికంగా ఉండే వాయనాడ్‌కు వెళ్లి గెలిచాడనే అపప్రథ ఆల్‌రెడీ కాంగ్రెస్‌పై ఉంది… ఇప్పుడు సోనియా మెదక్ నుంచి పోటీచేస్తే, పుసుక్కున ఓడిపోతే ఎంత అపప్రథ…! ఎందుకా రిస్క్..? పైగా ఆమె వయస్సు, ఆమె ఆరోగ్యం ఇప్పుడు లోకసభ ఎన్నికల్లో పోటీపడటానికి పెద్ద సహకరించే స్థితి లేదు… ఆ రాహుల్‌కు పగ్గాలు ఇచ్చేసి రిటైర్ అయిపోయే ఆలోచన ఆమెది… ఏదీ, అసలు కుదిరితే కదా…!!
Share this Article