RTC బస్సుల్లో మహిళలకు ఫ్రీ: CBN
టీడీపీ-జనసేన అధికారంలోకి రాగానే మహిళలకు RTC బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
‘అమరావతి, తిరుపతిలో సభలు పెడతాం.
Ads
అందులో ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తాం.
18 ఏళ్లు దాటిన ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ.1500.
తల్లికి వందనం కింద రూ.15,000.
ఏడాదికి ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తాం.
బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తాం.
రైతుకు ఏడాదికి రూ.20000 సాయం చేస్తాం’ అని హామీ ఇచ్చారు…
…….. ఇదీ వాట్సప్ న్యూస్ గ్రూపులో కనిపించిన వార్త… ఇక సారు గారు బ్యాటింగ్ స్టార్ట్ చేశారన్నమాట… కర్నాటకలో కాంగ్రెస్, తెలంగాణలో కాంగ్రెస్ విసిరిన హామీలన్నింటినీ తను కూడా అందుకుని, ఇంకాస్త మెరుగులు దిద్ది… ఇంకో రేంజుకు తీసుకుపోయి ఏపీ ప్రజలపై గుమ్మరిస్తాడన్నమాట… వాటిల్లో ఈ తొలి విడత హామీలు మహిళలపైనే…
ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 18 ఏళ్లు దాటిన ప్రతి ఆడబిడ్డకు నెలనెలా 1500, తల్లికి వందనం పేరిట 15 వేలు (ఒకేసారి..?) హామీలతోపాటు ఏటా 3 సిలిండర్లు ఫ్రీ ఫ్రీ… నిజానికి ఇలాంటి అలవిమాలిన హామీలతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందా..? లేదు… కొంతమేరకు ప్రజలు ఆకర్షితులయ్యారేమో గానీ అవే గెలిపించలేదు…
కర్నాటకలో కాంగ్రెస్ గెలుపు బీజేపీ పాలన మీద ప్రజల తీర్పు… తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు కేసీయార్ పాలన పట్ల జనంలో వ్యతిరేకత… తమిళనాడులో స్టాలిన్ ఎలా గెలిచాడు..? ఇలాంటి జనాకర్షక పథకాలకు పెట్టింది పేరు ఆ రాష్ట్రం… కానీ గత ఎన్నికల్లో స్టాలిన్ మరీ విపరీతమైన హామీలేమీ కురిపించలేదు… ఎఐడీఎంకే ఆల్‌రెడీ బలహీనపడింది… దాని వ్యతిరేక పక్షాలన్నింటినీ కూటమిగా చేసి, ఒక్క వోటు చీలకుండా చూసి స్టాలిన్ గెలిచాడు… మొన్న మూడు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ బోలెడు హామీలు కురిపించింది, కానీ ప్రజలు పెద్దగా హామీలు ఇవ్వని బీజేపీనే గెలిపించారు… సో, ఉచిత హామీలు, వరాలే గెలిపిస్తాయనేది ఓ పెద్ద భ్రమ…
అంతెందుకు..? ఇదే చంద్రబాబు గత ఎన్నికలకు ముందు పసుపు కుంకుమ వంటి పలు పథకాలతో జనానికి పంచి పెట్టాడు కదా… తను కూడా ఏవేవో కొత్త హామీలు ఇచ్చాడు కదా… మరెందుకు ఓడిపోయినట్టు..? ఇదే కేసీయార్ కూడా తన మేనిఫెస్టోలో 500 రూపాయల సిలిండర్ వంటివి ప్రకటించాడు కదా… మరి జనం ఎందుకు నమ్మలేదు..? ఎందుకు ఓడించారు..? ఐనాసరే, చంద్రబాబు ఆగడు… జగన్‌కు ఏమాత్రం చాన్స్ ఇవ్వకూడదని సంకల్పం…
అందుకే ఈ హామీల వర్షం మొదలైంది… చంద్రబాబు ఒకటంటే నేను రెండంటాను అనే బాపతు జగన్ తత్వం… ఇక తన మేనిఫెస్టో ఎలా ఉండబోతోందో…!! ఇప్పటికే తన పంచుడు పథకాలతో రాష్ట్ర ఆర్థిక స్థితి కుదేలైంది… గతంలో ఇదే జగన్ చంద్రబాబును ఆల్ ఫ్రీ బాబు అని వెక్కిరించేవాడు… కానీ తనే టూమచ్ ఫ్రీ జగన్ అయిపోయాడు… ఏటా 500 రూపాయలకు లేదా 400 రూపాయలకు సిలిండర్ ఇస్తామని తెలంగాణలో కాంగ్రెస్, కేసీయార్ హామీలు ఇచ్చారు…
చంద్రబాబు మరో నాలుగు మెట్లు జంప్ చేసి, ఏటా 3 ఫ్రీ అంటున్నాడు… ఓ చిన్న ఫ్యామిలీకి ఏటా ఆ ఫ్రీ సిలిండర్లు చాలు… సోషల్ పెన్షన్లు, తల్లి వందనాలు, అత్తమ్మ కట్నాలు, ఆడబిడ్డ లాంఛనాలు పేరిట ఇంకేం ప్రకటిస్తాడో… సార్, సార్, ఫ్రీ రేషన్, ఫ్రీ నిత్యావసరాలు అని ప్రకటించండి, ఓ పనైపోతుంది… రాష్ట్రం పనైపోతుంది…
Share this Article