అసలు పల్లవి ప్రశాంత్ అనే బిగ్‌బాస్ విన్నర్ మీద కాదు… నాగార్జున మీద, స్టార్ మాటీవీ మీద కేసులు పెట్టాలి, లోపలేయాలి, బిగ్‌బాస్ షో రద్దు చేయాలి అని కదా ఇప్పుడు డిమాండ్లు వినిపిస్తున్నాయి…! వాళ్ల మీద మాత్రమే కాదు, అంబానీ మీద కేసు పెట్టాలి అనే డిమాండ్ కూడా జతకలిస్తే…? చదవగానే నవ్వొచ్చిందా..? ఇదెక్కడి విడ్డూరం, నడుమ ఆయన చేసిన పాపమేంటి అనిపిస్తుందా..? నాగార్జున, స్టార్ మాటీవీ శిక్షార్హులైతే… అంబానీ కూడా శిక్షార్హుడే అవుతాడు… విస్మయకరంగా ఉందా..? కానీ ఇదే నిజం… ఓసారి వివరాల్లోకి వెళ్దాం పదండి… జాగ్రత్తగా అర్థం చేసుకుంటే తప్ప ఈ దందా బోధపడదు…
ఎప్పుడైతే బస్సుల మీద, వాహనాల మీద దాడులు జరిగి… ట్రాఫిక్ అడ్డగోలుగా జామ్ అయిపోయి… తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని… శాంతిభద్రతల సమస్యగా మారిందో అప్పుడే బిగ్‌బాస్ మీద మళ్లీ తీవ్ర విమర్శలు స్టార్టయ్యాయి… దీనికి పైకి కనిపించే బాధ్యులు ఓ ఉన్మాద తత్వం ఉన్న పల్లవి ప్రశాంత్, తన ఫ్యాన్స్… కానీ తెర వెనుక ఎవరు..?
ఓ వార్త కనిపించింది… పక్కా ఫేక్… ఫార్స్, స్టుపిడిటీ… ‘‘ఈ షో వెనుక కర్త, కర్మ, క్రియ అంతా పదీపన్నెండు మంది ఎన్ఆర్ఐ బిగ్ షాట్స్, కార్పొరేట్లు ఉన్నారు… వందల కోట్ల బిజినెస్ ఇది… ఈ షో యాడ్ రెవిన్యూ మొత్తం ఖర్చులుపోను ఆ కార్పొరేట్ వ్యక్తులే తీసుకుంటారు’’ అనేది ఆ వార్త సారాంశం… నవ్వొచ్చింది… అసలు వివరాల్లోకి వెళ్తే..,
ఎండమోల్ షైన్ అనేది అంతర్జాతీయ స్థాయి టీవీ ప్రోగ్రామ్స్ వినోద సంస్థ… రకరకాల టీవీ ప్రోగ్రామ్స్‌కు రూపకర్తలు… బిగ్‌బాస్ కూడా వాళ్లదే… దానికి ఇండియా విభాగం పేరు ఎండమోల్ షైన్ ఇండియా… బిగ్‌బాస్ షో ఇండియాలోనే కాదు, చాలా దేశాల్లో రన్ అవుతోంది… ఈ షోకు సంబంధించి పూర్తి ఐపీ రైట్స్ వాళ్లవే… ఐతే వాళ్లకు ఇండియాలో నెట్‌వర్క్ లేదు కాబట్టి వయాకామ్18తో ఒప్పందం చేసుకున్నారు… ఆ వయాకామ్18 ఓనర్ ముఖేష్ అంబానీ… అక్షరాలా నిజం… ఆ సంస్థ రిలయెన్స్‌కు సంబంధించిన వినోద వ్యాపార విభాగం… బోలెడు చానెళ్లు, పెద్ద వ్యవస్థ అది…
మరి దానికి ప్రాంతీయంగా చానెళ్లు లేవు కదా, అందుకని స్టార్ గ్రూపుతో, అంటే డిస్నీ హాట్‌స్టార్‌తో ఒప్పందం కుదుర్చుకుంది… లోకల్ భాషలో నిర్వహణ వాళ్ల బాధ్యత అన్నమాట… ఉదాహరణకు తెలుగులో స్టార్ మా, తమిళంలో స్టార్ విజయ్… ఇలా… మలయాళంలో ఆసియానెట్… వాళ్లకు కన్నడలో కలర్స్ చానెల్ ఉంది కాబట్టి ఆ భాషలో వాళ్లదే నిర్వహణ… ఈ డిస్నీ హాట్‌స్టార్ కూడా అంతర్జాతీయ వినోద సంస్థ… ఒప్పందాలకు భిన్నంగా వెళ్లి లీగల్ ఇష్యూస్, రెవిన్యూ ఇష్యూస్, కేసుల్లో ఇరుక్కోరు… సో, బిగ్‌బాస్ అనేది అంతర్జాతీయ వినోద దందా…
Ads
తెలుగుకు వద్దాం… స్టార్ మాటీవీతో ఒప్పందం కదా… లోకల్ కంటెస్టెంట్ల ఎంపిక, షో రన్ చేయడానికి లోకల్ సంస్థల సహకారం తీసుకుంటారు, డబ్బులు చెల్లిస్తారు… ఓ సీజన్‌కు ఓంకార్ ఈ బాధ్యతలు మోశాడు, వీళ్లకు ముంబైలోని ఓ క్రియేటివ్ టీం గైడ్ చేస్తుంటుంది… మన రామగోపాలవర్మకు ఆ టీంతో మంచి సంబంధాలున్నయ్… ఆషురెడ్డిలు, అరియానాలు కంటెస్టెంట్లు కావడం ఇందుకే… సరే, నాగార్జునకు 10 కోట్లు, తన అన్నపూర్ణ స్టూడియోస్‌కు 5 కోట్లు, సెటింగ్‌కు 5 కోట్లు, కంటెస్టెంట్ల పారితోషికాలకు 10 కోట్లు, షో నిర్వహణ ఖర్చులకు 10 కోట్లు… ఇలా ఉంటుంది ఖర్చు…
60 నుంచి 70 కోట్ల మేరకు రెవిన్యూ ఉంటుంది… ఈసారి డాబర్, మారుతి, రాధా టీఎంటీ ఎట్సెట్రా సంస్థలు స్పాన్సర్ చేశాయి… ఖర్చులు పోను వచ్చిన ఆదాయం స్టార్ మాటీవీ, వయాకామ్18, ఎండమోల్ షైన్ ఇండియా పంచుకుంటాయి… అదీ ఉజ్జాయింపుగా నాకింత, నీకింత అని కాదు… రేటింగ్స్‌ను బట్టి రెవిన్యూలో వాటాలుంటయ్… అందుకే అధిక రేటింగ్స్ కోసం పిచ్చి, ప్రయాస, తన్లాట… ఈ మొత్తం దందాలో పల్లవి ప్రశాంత్ అంటే… గాలికి ఎగిరిపోయే ఓ గడ్డిపోచ… ఓ గుడ్డి పావు… ఇలాంటోళ్లు జస్ట్, వాడుకోబడతారు… ఇదీ బిగ్‌బాస్ యవ్వారం…
నిజానికి స్టార్ మాటీవీ సాధనసంపత్తి చాలా పెద్దది కాబట్టి ఏటా ఈ 60, 70 కోట్ల ఈ ప్రాజెక్టు రన్ చేస్తున్నారు… ఓ భారీ సినిమా బడ్జెట్‌తో సమానం… జీతెలుగు, ఈటీవీ కలలో కూడా దీన్ని చేయలేవు… జీతెలుగు మహా అయితే 10, 15 కోట్ల వరకూ ఓ షో కోసం ఖర్చుచేస్తుందేమో… ఈటీవీ అయితే ఒకటీరెండు కోట్లు దాటనివ్వదు… చివరగా… ఈ షో వెనుక కార్పొరేట్లు, తెరవెనుక శక్తులు అని రాసుకొచ్చింది ఆసియానెట్ తెలుగు సైట్… హహహ… మలయాళంలో ఆసియానెట్ వాళ్లే బిగ్‌బాస్ షో నిర్వాహకులు… దాని న్యూస్, వెబ్‌సైట్లు మాత్రం బీజేపీ రాజ్యసభ ఎంపీ రాజీవ్ చంద్రశేఖరన్‌వి… ఐనా ఏదో గాలి పోగేసి ఓ ఫేక్ స్టోరీ వండారు… ఫాఫం…!!
Share this Article