ఖడ్గ తిక్కన దాకా అవసరం లేదు… మొన్నటికిమొన్న ఓ బర్రెలక్క బరిలోనే మొండిగా నిలబడింది, తెలంగాణ నిరుద్యోగ సమస్యను ఎలుగెత్తింది… అది డెమోక్రటిక్ స్పిరిటే కాదు, ఫైటింగ్ స్పిరిట్ కూడా… రాజకీయ పార్టీలు, నాయకత్వ స్థానాల్లో ఉన్నవాళ్లకు ఖచ్చితంగా ఉండాల్సిన సుగుణం అది… గెలుపో ఓటమో జానేదేవ్, నిలబడి కొట్లాడాలి కదా… బీఆర్ఎస్ అనుబంధ సింగరేణి కార్మిక సంస్థ ‘తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం’’ రాబోయే సింగరేణి ఎన్నికల్లో నిలబడటం లేదనీ, దాని ముఖ్యులు ఆ పార్టీకి, ఆ సంఘానికి రాజీనామాలు చేశారనీ, బీఆర్ఎస్ అసలు బరిలోనే దిగకుండా చేతులెత్తేసిందనే వార్తలు చదివితే నిజంగా ఆశ్చర్యం వేసింది…
ఈ పార్టీయేనా..? దేశవ్యాప్తంగా విస్తరించి జాతీయ స్థాయిలో గాయిగత్తర లేపి, కేసీయార్‌ను ఏకంగా ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టాలని భావించింది… ఆఫ్టరాల్ ఒక ఏరియాలో… అదీ బొగ్గు గనుల సింగరేణిలో… కేవలం ఆ కార్మికులకు సంబంధించిన ఒక పరిమిత ఏరియాలో ఎన్నికలకు సిద్ధపడకపోవడం విస్మయకరమే కదా మరి… ఇలా బరి నుంచి పారిపోవడం ఏమిటి..? మొత్తం సంఘం బాధ్యులందరూ ఒకేసారి సంఘానికి, దాని మాతృపార్టీ బీఆర్ఎస్‌కు వీడ్కోలు చెప్పి, మెల్లిగా కాంగ్రెస్ తలుపులు తట్టడం ఏమిటి…?
Ads
ఇదేం ఫైటింగ్ స్పిరిట్..? ఒక డెమోక్రటిక్ సెటప్‌లో… అదీ పదేళ్ల పాటు ప్రభుత్వంలో ఉండి… ఉద్యమ పార్టీ అని చెప్పుకుని… ఇలా చేతులెత్తేయడం ఏమిటి..? సగటు సింగరేణి కార్మికులు ఏమని భావించాలి..? సాగినంతకాలం సాగించుకుని, జనం ఛీత్కరించాక ఇక మొత్తం దుకాణమే షట్ డౌన్ చేయాలా..? మరి ఈ సంఘం వెనుక నిలబడిన సగటు కార్మికుడు మొహం ఎక్కడ పెట్టుకోవాలి..? మీ ఖర్మ అని వదిలేస్తున్నట్టా ఈ వైఖరి..?
పైన ఆ సంఘం లోగో చూశారు కదా… ఒక కేసీయార్, ఒక కవిత… బాణం గుర్తు… ఇందులో సింగరేణి ఐడెంటిటీని సూచించేది ఏమున్నది..? పైగా ఇది కవితకే అసైన్ చేయబడిన కార్మికసంఘం… అందుకే హరీశ్, కేటీయార్ దీని జోలికి వెళ్లరు… అంతా కవిత ఏది చెబితే అదే… సరే, వాళ్ల పార్టీ, వాళ్లిష్టం… కానీ సవాళ్లు ఎదురైనప్పుడే కదా బలంగా, స్థిరంగా నిలబడాల్సింది… సగటు కార్మికుడి పక్షాన పోరాడాల్సింది… అదేకదా ఈ సంఘాలకు ఉండాల్సిన డెమొక్రటిక్ స్పిరిట్…
పోటీ నుంచే పారిపోతే ఇక ఆ స్పిరిట్ ఏమున్నట్టు..? ఇది ఎలా ఉందంటే… ఫలితాలు వచ్చిన మర్నాటి నుంచే నమస్తే తెలంగాణను చుట్టేస్తున్నట్టుగానే ఉంది… బీఆర్ఎస్‌కు అనుబంధంగా ఉన్న పిల్ల సంఘాలేవైనా ఉంటే, వాటికీ ఇదే స్పిరిట్ వర్తిస్తుందా..? మీ బాట మీరు చూసుకొండి, ఇక మాకు చేతకావడం లేదు అని చెబుతున్నట్టుగా భావించాలా..? ఏం, కాంగ్రెస్‌తో పోరాడలేరా..? దాని సంఘం ఐఎన్‌టీయూసీ అంటే అంత వెరపా..? మద్యం కేసుల్లో కూడా ‘‘తెలంగాణ తలవంచదు’’ అని తల ఎగరేసిన కవిత ధైర్యం జస్ట్, ఈ సింగరేణి బరిలోనూ కనిపించదేం..?!
Update :: శుక్రవారం సాయంత్రం కవిత ఒక ప్రకటన చేస్తూ… సింగరేణి ఎన్నికల్లో పోటీలో ఉంటామని, కార్మికులు బాణం గుర్తుకు వోటు వేసి గెలిపించాలని అప్పీల్ చేసింది…
Share this Article