ఏదో పత్రికలో… ఎక్కడో ఓ మూల… పబ్లిష్ చేద్దామా వద్దా అనే డైలమాలో పడి, చిన్నగా, కనీకనిపించనట్టుగా, అనేక వార్తల నడుమ ఓ బిట్‌గా వేసినట్టు కనిపిస్తూనే ఉంది… ఏమో, ఆ వార్త మీద సదరు సబ్ ఎడిటర్‌కే నమ్మకం లేనట్టుగా ఉంది… ఏమో, వార్త అంటే భర్తల దాష్టికాలు, హింస తప్ప భార్యల శాడిజం వార్త ఎందుకవుతుంది అనే సంప్రదాయ, ఛాందస పాత్రికేయం ఏదో తలకెక్కిన బాపతు కావచ్చు…
విషయం ఏమిటంటే… ఇది ఢిల్లీ హైకోర్టు చేసిన ఓ వ్యాఖ్య… చెప్పిన ఓ తీర్పు… భర్త ప్రమాదానికి గురయ్యాడు… ఇంట్లోనే ఉంటున్నాడు… గాయపడి, మంచం మీద ఉన్నప్పుడు ఏ భర్తయినా భార్య నుంచి శ్రద్ధను, దయను, జాలిని, ప్రేమను ఆశిస్తాడు కదా… కానీ ఈ భార్య ఏం చేసిందంటే… నుదుట బొట్టు తీసివేసింది… గాజులు వేసుకోలేదు… తెల్లటి బట్టలు ధరిస్తూ ఓ వితంతువులా కనిపించసాగింది అందరికీ…
Ads
ఎందుకలా..? శాడిజం..! భర్త అనగానే తాగొచ్చి, వంగోబెట్టి నాలుగు తన్నేవాడిలాగే చిత్రీకరించారు ఇన్నేళ్లూ… అకారణంగా భార్యను క్రూరంగా హింసించడాన్నే పదే పదే చూపించాం, రాశాం, చదివాం… అవి లేవని కాదు… దానికి భిన్న కోణమూ ఉంది… ఎంతసేపూ భార్య అంటే బాధితురాలు అని… భర్త అంటూ క్రూరుడు అన్నట్టుగానే చూశాం… కానీ ఇది పూర్తిగా డిఫరెంట్…
మనం చదువుతున్నాం కదా… లోకంలో చూస్తూనే ఉన్నాం కదా… ప్రియుడిని మరిగి భర్తను హత్య చేయించిన నేరాలు… పిల్లలను కూడా అడ్డుతొలగించుకున్న పైశాచికాలు… అత్తలను రాచిరంపాన పెట్టే కోడళ్లు… మామలను మఠాలను తరిమిన కోడరికాలు… బోలెడు… ఆమధ్య ఒకటి చదివాం కదా, ఆమె ఏమైందో, ఎక్కడుందో గానీ… ప్రియుడికి భర్తలా ప్లాస్టిక్ సర్జరీ చేయించి, భర్తను కడతేర్చిన ఓ మహిళ గురించి…
సో, భార్య అంటే బాధ కాదు, భర్త అంటే హింస కాదు… ఐతే ఢిల్లీ హైకోర్టుకు వచ్చిన ఆ కేసే చూద్దాం… భర్త బతికి ఉండగానే ఓ వితంతువులా వస్త్రధారణ చేసుకుని, కావాలనే అందరికీ అలా కనిపించడం చూడటానికి చిన్న విషయంలాగే కనిపించవచ్చుగాక… కానీ సదరు భర్తకు అది హత్యతో సమానం… అందరూ పకపకా నవ్వుతూ ఎగతాళిగా చూసే సోషల్ స్టిగ్మాను పక్కన పెట్టండి…
ఈ బాధాకర పరిస్థితుల్లో కూడా తన పట్ల భార్య కక్ష తీర్చుకుంటోంది, నువ్వు సచ్చిపోయావురోయ్ అన్నట్టుగా ప్రవర్తించడం ఆ భర్తకు మరణసదృశమే… కోర్టుకు వెళ్లాడు ఎవరి సాయంతోనో… కుటుంబకోర్టు భర్త బాధను అర్థం చేసుకుంది… తనకు అనుకూలంగా తీర్పు చెప్పింది… కానీ అప్పటికీ సదరు భార్య వదిలిపెట్టదలుచుకోలేదు… తను విడాకులు ఇవ్వదు, వదిలిపెట్టదు…
కుటుంబకోర్టు తీర్పుపై హైకోర్టుకు వెళ్లింది… ‘‘ఇది క్రూరత్వమే యువరానర్, నన్ను వదిలేయాలని ఆమెకు చెప్పండి, విడాకులు ఇప్పించండి’’ అని వేడుకున్నాడు సదరు భర్త… నో, నో, నా బట్టలు నా ఇష్టం అంటుంది భార్య… నిజమే, నీ బట్టలు నీ ఇష్టం… కానీ ఉద్దేశపూర్వకంగా ఓ వితంతువులా కనిపిస్తూ బాధించడం క్రూరత్వం కిందకే వస్తుంది… అది శాడిజం…’’ అంటూ హైకోర్టు కూడా బాధితుడి పట్ల సానుభూతితో భార్య పిటిషన్‌ను కొట్టిపడేసింది… న్యాయస్థానాల్లో ఇంకా న్యాయం మిగిలే ఉంది సుమీ…! అన్నట్టు యువరానర్… గృహహింస కేసుల్ని భార్యల మీదా అనుమతించాలి, ఆ కోణంలో ఆ చట్టాల్ని సవరించాలి మిలార్డ్…! చట్టాలు భర్తల రెస్క్యూకు కూడా రావాలి…!!
Share this Article