విను తెలంగాణ – తెల్లబోయిన సింగరేణి’ : పదేళ్ళ పరిపాలనలో ‘కాలేరు’ కథ పెద్దదే!
ఇంకా మూడు రోజుల్లో ఎన్నికలు. ఏ శ్వేత పత్రామూ అక్కరలేదు. అక్కడ క్షేత్ర పర్యటనలో వెలుగు చూసిన ఈ చీకటి కోణాలను చదివితే రాష్ట్ర ఏర్పాటు వల్ల లబ్దిపొందింది ఎవరో తేట తెల్లం అవుతుంది. ఎవరిది స్వేదమో, మరెవరిదీ దోపిడో విస్పష్టంగా బోధపడుతుంది. పదేళ్ళలో మరింత నల్లబారి అవిసిపోయిన కార్మికుల స్థితీ గతీ సారాంశంలో ఇక్కడ చదవండి. నిన్నటిదాకా అబద్దాలు వినడానికి అలవాటు పడిన మనకు ప్రతి ‘కాలేరూ’ తెల్లబోయే నిజాలే చెబుతున్న వైనంపై రాసిన పాత్రికేయ పత్రం ఇది… –కందుకూరి రమేష్ బాబు
మలిదశ ఉద్యమంలో సింగరేణి కార్మికులు ఎంత ప్రముఖంగా నిలిచారో తెలిసిందే. ముఖ్యంగా సకల జనుల సమ్మే అప్పుడు, అంతకు ముందూ, కెసిఆర్ నిరాహార దీక్ష సమయంలో అరెస్ట్ ఐనప్పుడు గానీ, శ్రీకాంతా చారి ఆత్మహత్య అప్పుడు గానీ, శ్రీ కృష్ణ కమిటీ వేసినప్పుడు గానీ – ఇలా దాదాపు ఏడూ ముఖ్య సమయాల్లో అక్కడి కార్మికులే ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచారన్నది మరవరాదు. ఒక రకంగా ఉద్యమానికి తొలి విజిల్ ఊదింది సింగరేణియే. మీకు గుర్తుండే ఉంటుంది, ఆనాడు సకల జనుల సమ్మె సమయంలో వారి పూనిక వల్లే మరికొన్ని రోజులు పొతే దక్షిణ భారతం కరెంటు లేని దశకు వచ్చే పరిస్థితి ఉండింది. అటువంటి పోరాట కారుల జీవితాల్లో ఈ పదేళ్ళ పరిపాలన చీకటి అధ్యయాన్నే నెలకొల్పిందనే చెబితే విషాదంగా ఉంటుంది గానీ అది చేదు నిజం. “ఒకనాటి సింగరేణి యేనా ఇప్పుడు మేం చూస్తున్నది” అని ఒక కార్మిక సంఘం నాయకుడు వాపోవడాన్ని బట్టి మారిన ‘కాలేరు’ కథను చెప్పకనే చెబుతుంది.
Ads
కోల్ బెల్ట్ లో ‘కాలేరు’ అన్న మాట స్థానికమే. అక్కడి కాలరీలను ‘కాలేరు’ అంటారు. కానీ స్వీయ రాజకీయ అస్తిత్వం కోసం, స్వపరిపాలన కోసం సమైక్య ఆంధ్రుల నుంచి రాష్ట్రం వేరు పడేందుకు అందరికన్నా మిన్న ‘కాలేరు’ రగిలి పోయింది. తెలంగాణా ఆత్మ గౌరవం పేరిట, మన వనరులు మనకే, మన నీళ్ళు నిధులు ఉద్యోగాలూ మనకే అంటూ చేసిన పోరాటం ఫలించి స్వరాష్ట్రం ఏర్పడగానే ఎంతగానో ఉపశమనం పొందింది. కానీ ఒక్కో ఏడు గడుస్తుంటే వారి ఆశలు నీరుగారిపోయాయి. ఒక్కటని కాదు, అన్ని విధాలా నల్లనేల నిస్తేజమైంది. కొత్త ఉద్యోగాలు కాదు కదా, ఉన్న ఉద్యోగాలు పోగొట్టుకున్న దుస్థితి కాలేరుది. ఆంధ్ర పాలన వద్దనుకుంటే మళ్ళీ కాంట్రాక్టులన్నీ వాళ్ళ చేతుల్లోకే వెళ్ళడంతో తెల్లబోయిన దుస్థితి నల్ల బంగారు సింగరేణిది. ఇలా, మలిదశ ఉద్యంమంలో పునాది ఐన ‘ఆత్మ గౌరవాన్ని’ సైతం నీరుగార్చిన వైనం ఇక్కడ పరిపరి విధాలు.
రాష్ట్రం ఏర్పడితే కొత్తగా గనులు ఏర్పడుతాయని కార్మికులంతా భావించారు. అవి రాలేదు కదా ఉన్న భూగర్భ గనులను ఓపెన్ కాస్ట్ గనులుగా మార్చింది తెలంగాణా ప్రభుత్వం. మీకు తెలుసు, ‘కుర్చీ వేసుకుని ఓపెన్ కాస్త గనులను మూపిస్తానాన్న కెసిఆర్ ఆర్భాటపు హామీ. అది ఆచరణలో నెరవేరకపోగా ఫక్తు అవకాశవాద నినాదమే అని రుజువైంది. అంతేకాదు, లక్ష మంది కాకపోయినా అప్పుడున్న డెబ్బయ్ వేల ఉద్యోగాలు అట్లాగే కొనసాగుతాయని అందరూ భావించారు. కానీ ఈ పదేళ్ళలో వాటి సంఖ్య 39 వేలకు తగ్గించింది కెసిఆర్ ప్రభుత్వం. ఈ ఒక్క ఉదాహరణ చాలు, ఉద్యమ నినాదమైన ఉద్యోగాల ప్రాధాన్యత సింగరేణిలో నెరవేరనే లేదని.
ఇక ఉద్యమ నినాదంలోని ‘నియామకాల’ తర్వాత ‘నిధుల’ విషయానికి వస్తే అదీ అధోగతే. రాష్ట్రం వచ్చాక సింగరేణి లాభాల్లో ఉన్నప్పటికీ నిధుల లేమితో కొట్టుమిట్టాడుతుందంటే ఎవరూ నమ్మరుగానీ అదే వాస్తవం. ఈ సంస్థ అప్పులు తెచ్చి జీతాలు ఇవ్వాల్సిన దుస్థితిలో పడిందంటే అతిశయోక్తి కాదు. అవును. సింగరేణి తమ బొగ్గును, జైపూర్ ప్లాంట్ నుంచి కరెంటును ప్రభుత్వ విధ్యుత్ సంస్థలైన జెన్కో, ట్రాన్స్ లకు అమ్ముతూ వస్తోంది. ఆయా సంస్థలు డబ్బులను ఎప్పటికప్పుడు సింగరేణికి చెల్లించాలి. కానీ ప్రభుత్వం ఆయా విద్యుత్ సంస్థలకు సకాలంలో చెల్లించకపోవడంతో అ అప్పులు క్రమంగా పెరుకుపొయి నేడు సుమారు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల దాకా అయ్యాయి. ఇన్ని వేల కోట్ల రూపాయల బకాయిలను ఆ సంస్థలు చెల్లించకపోవడంతో సింగరేణి మంచి లాభాల్లో ఉన్నప్పటికీ ప్రతి నెలా జీతాల చెల్లింపుకు అప్పుల కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడిందని కార్మికుల నాయకులు వివరంగా విశదీకరిస్తున్నారు.
స్వరాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క కొత్త మైన్ తెరవలేదు. అప్పటికీ మంజూరై ఉన్న పన్నెండు గనులను కూడా తెరవలేదు. తెరిచే పరిస్థితి లేదు. ముందు చెప్పినట్టు నిధులు లేకపోవడంతో సింగరేణిలో గనుల విస్తరణ అన్నది లేకుండా పోయింది. రాష్ట్రం ఏర్పాటయ్యాక ఇలాంటి తిరోగమన పరిస్థితి ఒకటి తలెత్తుతుందని కలలో కూడా ఎవరూ ఊహించలేదు.
ఒక్క మాటలో చెప్పాలంటే, రాష్ట్ర సాధనకోసం ఉద్యమించిన ఇక్కడి కార్మికులు ఈ పదేళ్ళలో ఎన్నడూ ఊహించని రెండు ప్రధాన పరిణామాలను చవి చూడాల్సి వచ్చింది. అందులో ఒకటి, పర్మినెంట్ కార్మికులను తగ్గిస్తూ రావడం, రెండవది, కాంట్రాక్ట్ కార్మికులను పెంచుతూ పోవడం. చిత్రమేమిటంటే, అందరికీ ఉపశమనంగా కనిపించే ‘వారసత్వ ఉద్యోగాలు’. వీటి గురించి ప్రభుత్వం ఘనంగా చెబుతుంది గానీ ఆచరణలో నిరాశపరిచే పరిస్థితే ఉంది. అవును. వారస్వత ఉద్యోగాల పేరిట జరిపిన నియామకాలు అన్నీ కలిపినా మొత్తం ఉద్యోగుల సంఖ్య ఒకనాడున్న ఉద్యోగాల కన్నా తక్కువే అని చెప్పాలి.
2
వివరంగా చేబితే, తెలంగాణ ప్రభుత్వం వచ్చేటప్పటికి సింగరేణిలో 64 వేలమంది పర్మినెంట్ కార్మికులుండగా ఆ సంఖ్య నేడు 39 వేలకు తగ్గింది. ఆ నాడు ఎనిమిది, తొమ్మిది వేల కాంటాక్ట్ కార్మికులుండగా నేడు సుమారు 32 వేలకు వారి సంఖ్య పెరిగింది. పోనీ కాంట్రాక్ట్ కార్మికులకు దేశ వ్యాప్తంగా ఇస్తున్నట్టు మినిమం వేజేస్ ఇస్తున్నారా అంటా అదీ లేదు. రోజుకు నాలుగు వందల నుంచి ఐదు వందలు వేతనమే. అంతేకాదు, ఈ మినిమం వేజేస్ అన్నది పదేళ్ళలో ఒక్కసారి కూడా పెంచలేదని కూడా ఇక్కడే చెప్పాలి.
ఇక వారసత్వ ఉద్యోగాల గురించి చెప్పాలి. అవి కూడా ప్రభుత్వం స్వతంతంగా ఏమీ ఇవ్వడానికి ముందుకు రాలేదు. స్థానికంగా ఆందోళనలు చేసి కార్మికులు, ముఖ్యంగా యువత పలు రూపాల్లో ఆందోళనలు చేపట్టి పోరాడి సాధించుకున్నదే. ఆఖరికి ఇక్కడి భూమి పుత్రుల ‘బిడ్డల సంఘాలు’ కూడా ఏర్పడ్డాయి. వాటన్నిటి ఫలితమే ఈ ఉద్యోగాలు. కాగా, ఆ వారసత్వ ఉద్యోగాలు మెడికల్ బోర్డు అని పెట్టి కొంతమందికి ఇస్తున్నారు. అవి కూడా మొత్తం పైరవీలతో జరుగడం ఒక చెప్పుకోదగిన వైఫల్యం. ఒక్కో దగ్గర ఆరు లక్షలు, ఏడూ లక్షలు తీసుకుని ఆ ఉద్యోగాలు ఇచ్చారని తెలిస్తే విని ఆశ్చర్యపోతాం గానీ ఇక్కడ అది సాధారణ విషయంగా మారిపోయింది. ఈ సంగతి ఎవర్ని అడిగినా చెబుతారు. విచారకరమైనది ఏమిటంటే, ‘కాలేరు’లో ఈ పరిస్థితి మునుపెప్పుడూ లేదు.
ఇక్కడ డబ్బులు తీసుకొని జరిపే నియామకాలే పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇలా సుమారు ఎనిమిది నుంచి తొమ్మిది వేల నియామకాలు జరిగాయని వినికిడి. ఇవన్నీ కేవలం ‘వారసత్వ’ ఉద్యోగాలే కాదు, చనిపోయిన వాళ్ళు, అనారోగ్యంతో ఉన్న వాళ్ళు, వారందరినీ మెడికల్ గా అన్ ఫిట్ చేసి, యువతకు తొమ్మిది వేల దాకా ఉద్యోగాలు ఇచ్చారు.
తండ్రిని ‘ఆన్ ఫిట్’ చేసి కొడుకును ‘ఫిట్’ చేసే ఉద్యోగం ఇవ్వాలి. అందుకోసం ‘మెడికల్ బోర్డు’ అని పెట్టి జబ్బు ఉన్నా లేకపోయినా ‘అన్ ఫిట్’ చేసి జాబ్ ఇస్తున్నారు. డబ్బులు ఇవ్వని పక్షంలో జబ్బులున్నా అన్ ఫిట్ కాని స్థితి. నిజానికి సింగరేణిలో ఒకటి రెండు శాతం లంచాలు లేవని కాదు, కానీ ఇంత విచ్చల విడిగా ఎన్నడూ లేదని కార్మికులు వాపోతున్నారు.
మరో విషాదం ఏమిటంటే, ఈ వారసత్వ ఉద్యోగాల విషయంలో నియమ నిబంధనలు సరైన సమయంలో తేల్చకపోవడంతో చాలా మంది కుటుంబాల్లో కల్లోలమే రేకెత్తింది. అనేక సంసారాలు కూలిపోయిన వైనం ఒకటి ఈ విలేకరి దృష్టికి వచ్చింది. ప్రభుత్వం అలసత్వం వల్ల కుటుంబాల్లో వైషమ్యాలు, సంక్షోభం, గృహ హింస కూడా తలెత్తడం అన్నది అతిశయోక్తిగా అనిపిస్తుంది గానీ ఆ కుటుంబాలను కలిస్తే ఇదేంతటి సమస్యో అర్థం కాదు. ప్రభుత్వం ఉదాసీన నిర్ణయాల వళ్ళ, ముందు చూపు లేని నిబంధనల రూపకల్పన వల్ల దంపతుల మధ్య విభేదాలకు కారణమైన ఉదాహరణలు ఇక్కడున్నాయి. ఈ విషయంలో మరింత స్థడీ అవసరం, ప్రభుత్వం ఇప్పటికైనా ఉదార నిర్ణయంతో సమీక్ష అవశ్యం.
కాస్త వివరంగా చెబితే, పెళ్లీడు పిల్లలకు ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకంతో తమ బిడ్డలను ఇస్తామని నిచ్చితార్థం చేసుకోవడం, పెళ్లి చేయడం, సంసారాలు కూడా మొదలై బిడ్డ తల్లులవడం దాకా జరిగి పోయాయి. చివరకు తమ తర్వాతి తరానికి వారసత్వ ఉద్యోగం రావాలంటే రెండేళ్ళ కనీస వయో పరిమితి ముందే సదరు కార్మికుడు విరమణ చేయాలన్న నిబంధన ఒకటి పెట్టారు. ఇటువంటి నిబంధన విషయం ఊహించని తండ్రులు చాలా మంది పిల్లల పెళ్ళిళ్ళు చేసి బంగ పడ్డారు. క్రమేణా అది పెద్దలకు పెను సమస్యగా మారింది. తమ కూతురు- అల్లుళ్ళు, కొడుకూ -కోడలు విషయంలో కలతలు మొదలై తాము సంసారాలు కూలిపోకుండా జోక్యం చేసుకున్నా లాభం లేకుండా పోయింది. ఉద్యోగం రానందున తమ కూతురి సంసార జీవితం అన్యాయం అయిపోయిందని అమ్మాయిల తల్లీదండ్రులు పంచాయితీలకు దిగారు. విడాకులకు డిమాండ్ చేశారు. దీనికి తోడు తీసుకున్న కట్నకానుకలు వాపసు ఇవ్వడం వంటి విషయాల్లో అనేక గొడవలు తలెత్తి ఇరు కుటుంబాల్లో వైషమ్యాలకు దారితీసింది. ఇక పెళ్ళిళ్ళు పెటాకులైన జంటలు కోలుకోవడానికి కష్టమే అవుతోంది. ఫలితంగా యువత మానసిక శారీరక ఆర్ధిక సమస్యలతో క్రుంగి పోయెలా చేయడం కాలేరు కథలో మరో విషాదాంకం. ఇట్లా దాంపత్య జీవిటానికి ‘ఉద్యోగం’ ఇరుసుగా మారిన సింగరేణిలో ఇలాంటి నిశ్శబ్ద హింస పెద్దగా చర్చకు రాలేదనే చెప్పాలి.
మొత్తంగా, ఉద్యోగ నియామకం నుంచి దాంపత్య విచ్చిన్నత దాకా అనేక రకాల సమస్యల వలయంగా ఈ ప్రాంత జీవనం మారింది. సింగరేణిలో ఇలాంటి దుస్థితికి, ఇక్కడి చైతన్యం నీరుకారడానికి ముఖ్య కారణం నిన్నటిదాకా అధికారంలో ఉన్న బిఆర్ ఎస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘమే. ఆ యూనియన్ ఇక్కడ రెండుసార్లు గుర్తింపు సంఘం కావడమే అని కార్మికులు చెబుతున్నారు. ఆ యూనియన్ నేతలే పలు విషయాల కోసం బ్రోకరేజీ చేస్తుండటంతో కార్మికులు ఏ సమస్యపైనా పోరాడే పరిస్థితి లేదు. గట్టిగా మాట్లాడితే ఒత్తిడిలు, చార్జీషీట్లు, ట్రాన్స్ఫర్లు. దాంతో కార్మికులు భయాందోళనలతో గడిపారు. ఇట్లాంటి అనేక విషయాలు చేర్పుతో ఎర్రెర్రని ‘కాలేరు కథ’లో ఒక చీకటి అధ్యాయం చేరిపోవడం ఈ పదేళ్ళ పాలనా ఫలితం.
3
వాస్తవానికి కులమతాలకు, ఆర్ధిక స్థాయి భేదాలకు అతీతంగా ఉండే ప్రాంతం సింగరేణి కాలనీల సొంతం. ఈ ప్రాంతమంతా కార్మికుల ఐఖ్యతా చైతన్యాలకు కేంద్రం. పోరట శీలతకు ప్రతిబింబం. అటువంటి ప్రాంతమైన ‘కాలేరు కథ’ విప్పి చెబితే ఇక్కడి బాయి కాడి బతుకుల గురించి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం- ఈ నాలుగు జిల్లాలోని పదకొండు నియోజకవర్గాల్లో తిరిగి చూస్తూ ఉంటే, ఉన్న వెలుగు నుంచి చీకట్లోకి నడిచినట్టే ఉన్నది. ఈ పదేళ్ళ బిఆర్ ఎస్ పాలనలో ‘పిరికి మందు తాగినట్టు’ నిర్లప్తంగా ఉందని ఒక కార్మిక నాయకుడు వాపోయారు. ఎటువంటి అన్యాయాలనూ ఎదిరించలేక స్తబ్దతగా మిన్నుకున్నదని వివరించారు. అది నిర్లిప్తతా లేక నిరసన నా అన్నది ఈ సారి ఎన్నికల్లో తెలియనున్నది.
ముఖ్యంగా కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలోని కార్మిక సంఘం గుర్తింపు సంఘంగా మారిన తర్వాత ఇక్కడి రాజకీయ చేతనలో శూన్యత ఆవరించిందని అందరూ చెబుతున్నారు. కార్మిక నాయకులే బ్రోకరిజం చేయడంతో సామాన్య కార్మికుల అలజడి నివురు గప్పిన నిప్పులా ఉన్నదని తేలిన నిజం.
నిజానికి కల్వకుంట్ల కవిత గుర్తింపు సంఘానికి గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న టీబీజీకేఎస్ సంస్థ చెప్పుకున్నట్టు లేదా అటు ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్నట్టు ఈ పదేళ్ళ పాలనలో సింగరేణి ఘనమైన రికార్డులేమీ సాధించుకోలేదు. కవిత బృందం చెప్పుకున్నట్టు, అటు వారసత్వ ఉద్యోగాల్లో గానీ ఇటు లాభాల్లో వాటా గురించి గానే బిఆర్ఎస్ పార్టీ చెప్పుకునేంత విశ్వసనీయత ఏమీ లేదని కూడా తెలిసి విస్తుపోక తప్పదు.
నిజానికి సింగరేణిలో లాభాల్లో వాటాను కార్మికులకు బోనస్ గా ఇచ్చే సంప్రదాయం తెలంగాణా రాష్ట్రం ఏర్పాటయ్యాక మొదలు కాలేదని గమనించాలి. ఉమ్మడి రాష్ట్రంలోనే ఆ విధానం ప్రారంభమైంది. 2000 సంవత్సరంలో తొలిసారిగా లాభాల్లో పదిశాతం ఇవ్వడంతో ఈ విధానం మొదలైంది. ఇది నిజానికి నష్టాల్లో ఉన్న సంస్థను లాభాల బాటలోకి నడిపించగలం అని కార్మికులు ముక్త కంఠంతో చెప్పి ఒక సవాల్ గా తీసుకుని సాధించుకున్న విజయం. దాంతో మొదటిసారిగా లాభాల్లో పదిశాతం వాటా ఇవ్వడంతో దీనికి బీజం పడి ఈ ఏడు 32 శాతం వాటా తీసుకునే స్థాయికి సింగరేణి కార్మికులు వచ్చారు. ఐతే, ఇది ముఖ్యమంత్రి విచక్షణతో జరిగేదే ఐనప్పటికీ మొదట చంద్రబాబు నాయుడు గారు పదిశాతం ఇవ్వగా మొదలై తర్వాత ఒక దఫా రాజశేఖర్ రెడ్డి గారు మూడు శాతం పెంచడంతో పెరిగిది. కెసిఆర్ గారు ఈ పదేళ్ళలో రెండు శాతం తప్పా ఏ సంవత్సరమూ ఎక్కువ ఇవ్వలేదని కూడా మనం గమనిస్తే, ఈ మొత్తం క్రెడిట్ బిఆర్ఎస్ ప్రభుత్వానిదే లేదా కవిత ఆధ్వర్యంలోని కార్మిక సంఘం ఘనత అన్నట్టు వారు ప్రచారం చేసుకోవడం వాస్తవానికి అభ్యంతరకరం. ఈ మాటలు సింగరేణి ప్రాంతేతరులను నమ్మించేందుకే తప్ప ఇక్కడివారు దాన్ని హాస్యాస్పదంగా చూస్తున్నారనే చెప్పాలి. ఇలాంటి అబద్దాలతో కార్మికులను మోసపుచ్చడం ఫలితంగానే మొన్నటి ఎన్నికల్లో మొత్తం పన్నెండు నియోజకవర్గాల్లో కేవలం రెండు స్థానాల్లో బిఆర్ ఎస్ గెలిచింది. మిగతా తొమ్మిది కాంగ్రెస్, మరొకటి ఆ పార్టీ మద్దతుతో సిపిఐ గెలుచుకున్నది. ఇక మరో మూడు రోజుల్లో జరగనున్న యూనియన్ ఎన్నికల్లో కవిత సంఘం మొదట పోటీ చేయమని చేతులెత్తేసింది. తర్వాత మాట మార్చింది. కానీ ఆ సంఘాన్ని రేపెలా ఆదరిస్తారో చూడవలసే ఉన్నది.
ఇక, ఇక్కడి చర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వారి పేరు శ్రీధర్. వారు వచ్చి ఇది తొమ్మిదో సంవత్సరం. సింగరేణి 114 ఏండ్ల చరిత్రలో ఒకే ఒక ఉన్నతాధికారి ఇన్నేళ్ళు అధికారం చేలాయించడం ఇదే తొలిసారి. ఆయన ప్రభుత్వం నుంచి సింగరేణికి రావాల్సిన డబ్బులు ఇప్పించకపోగా ఉద్దెరకు ఆయా సంస్థలకు యధేచ్చగా కరెంటు, బొగ్గు సరఫరా చేస్తూ వస్తున్నారు. సంస్థ ప్రయోజనాల కన్నా ప్రభుత్వం అనుకూల వైఖరే అతడికి ప్రథమ ప్రాధాన్యం అని కార్మికులు విరుచుకు పడుతున్నారు.
వాస్తవానికి సింగరేణిలో ప్రభుత్వం వాటా 49 శాతం. కేంద్ర వాటా 51 శాతం. అధిక వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో కార్మికుల శ్రేయస్సుకు అనుకూలంగా కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉండటం అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య ఒడంబడిక ఉన్నదనే విషయం సులభంగా బోధపడుతుంది. నిజానికి ఐదేళ్ళ క్రితం కవిత సంఘం మినహా మిగతా అన్ని కార్మికుల సంఘాలు కలిసి అప్పటి మంత్రి కిషన్ రెడ్డి గారిని కలిశారు. కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞాపన చేశారు. కానీ సంస్థను గాడిలో పెట్టేందుకు వారేమీ చర్యలు తీసుకోలేదు. దాంతో చైర్మెన్ మారలేదు. అతడి వైఖరిలో మార్పులేదు. సంస్థ నిధుల లేమితో నేటికీ సతమతవవుతోంది.
చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ తాలూకు మరో ఘనకార్యం ఏమిటీ అంటే సింగరేణిలో ఉండే డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్స్. పెద్ద ఎత్తున ఆ నిధుల దుర్వినియోగానికి జిల్లా కలెక్టర్లతో కూడి చేసిన నిర్వాకం. నిధుల దుర్వినియోగం అంటే మరేమీ లేదు. ఆ నిధులను వాస్తవానికి కార్మికులు నివసించే ప్రాంత అభివృద్దికి, వారి సంక్షేమానికి మాత్రమే ఖర్చు పెట్టాలి. కానీ ఆ నిధులను బయటి ప్రాంతాల్లో వినియోగానికి అనుమతించడం ఇక్కడ జరిగిన మరో పరిణామం. ఆ నిధులు సిరిసిల్ల, సిద్ధిపేట, గజ్వేల్ దాకా తరలి పోయాయి. సింగరేణిలో ఎంతో మంది క్రీడాకారులున్నారు. వారికోసం స్థానికంగా ఒక చిన్న స్టేడియం కట్టలేదు గానే ఆ నిధులను ఉపయోగించుకుని సిద్దిపేటలో గొప్ప స్టేడియం నిర్మించారు. చివరకు పర్యావరణ పరిరక్షణ పేరిట చెట్లు పెట్టాలన్నా, వన మహోత్సవం పేరిట హరిత హారం కార్యక్రమం తీసుకోవాలన్నా సింగరేణి నిదులనే నియోజకవర్గాల్లో శాసన సభ్యులు వాడుతున్నారు. ఇతర జిల్లాల్లో పోలీస్ వాహనాలను కూడా ఈ నిధులతోనే కొన్న ఉదాహరణలు ఉన్నాయి. అంతేకాదు, ఆయా నియోజక వర్గాల అభివృద్ధి కోసం శాసన సభ్యులు చేపట్టిన అనేక కార్యక్రమాలు సైతం ఈ నిధులతోనే జరిగాయని చెబితే పాలనలోని వైఫల్యం ఎలా ఉన్నదో బోధపడుతుంది. ఒక్క పేరుకే ‘డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్స్’, కానీ అవి స్థానికంగా కాకుండా రాష్ట్రమంతటా వెళ్ళాయి. సిఎస్ఆర్ నిధుల విషయంలోనూ ఇదే తంతు అని కార్మికులు వివరించారు.
కాగా, ఇక్కడ ఎన్నికలు 1998 నుంచి ఎన్నికలు మొదలయ్యాయి. అప్పటి నుంచి కమ్యూనిస్ట్ కార్మిక సంఘమైన ఏఐటీయూసీ మూడు సార్లు గెలిచింది. కాంగ్రెస్ అనుబంధ సంఘం – ఐఎన్ టియుసి ఒక సారి గెలిచింది. కవిత ఆధ్వర్యంలోని బిఆర్ఎస్ అనుబంధ సంఘం టీబీజీకేఎస్ తెలంగాణా ప్రభుత్వం ఏర్పాటయ్యాక రెండుసార్లు గెలిచింది. నిజానికి తాజాగా ప్రకటించిన ఎన్నికలు ఎప్పుడో నాలుగేళ్ల కిందే జరగాలి. కానీ పెట్టలేదు. ముందు చెప్పినట్టు ప్రభుత్వానికి నిన్నటిదాకా అధికార పార్టీగా ఉన్న ఆ సంఘం – ఎన్నికలు అంటే పైన పేర్కొన్న కారణాలతో భయపడుతోందని కార్మికులు బాహాటంగా చెబుతున్నారు.
ఇక ప్రభుత్వం ఒక పథకం ప్రకరం ఇక్కడ ఉద్యోగుల సంఖ్య క్రమేపీ తగ్గించడం వల్ల క్వార్టర్లు చాలా వరకు ఖాళీ అయ్యాయి. ఆయా కాలేరుల్లో కూరగాయలు అమ్మే వాళ్ళు, స్థానిక చిరు వ్యాపారులు తమకు అద్దెకు ఇవ్వమని అభ్యర్థించినా యాజమాన్యం ఇవ్వడం లేదు. దాంతో ఉన్నవి కూడా నిర్వహణ లేకపోవడంతో అనేకం కూలిపోతున్నాయి. ఇక బడుల విషయం చెబితే మరో విషాదకరమైన స్థితి. ఉద్యోగుల తగ్గింపు వల్ల అనేక ప్రభుత్వం పాఠశాలలు మూత పడ్డాయి. చిత్రమేమిటంటే, వందలాది ప్రైవేట్ స్కూల్స్ కూడా మూత పడటం. కనీసం నిర్వహణ చేయలేని స్థితి కారణంగా మధ్యతరగతి కార్మిక వర్గం తమ పిల్లలకు మంచి విద్య అందించే పరిస్థితి లేకుండా పోయింది. చదువు వారికి మరింత భారంగా మారింది. ముఖ్యంగా వారసత్వ ఉద్యోగాలు పొందిన వారు, కొత్తగా వచ్చిన వాళ్ళ పిల్లలు – చిన్న వాళ్ళు. ఆ పిల్లలను అరవై డెబ్బై వేలు వెచ్చించి కరీనగర్, వరంగల్, హైదరాబాద్ లో చదివించే పరిస్థితి. కానీ, సిబీస్ఈ సిలబస్ లో, సెంట్రల్ సూల్స్ మాదిరిగా సింగరేణి ఏరియాకు ఒకటి కాకపోయినా, రీజన్ కు ఒకటి పెట్టినా బస్సులు వేసి పిల్లలకు మంచి విద్య అందించవచ్చు. కానీ నిధుల లేమి కారణంగా మొత్తంగా ఇక్కడి కార్మికుల పిల్లల విద్యా భవితవ్యం అన్నది నిరాశా జనకంగా మారింది. ప్రస్తుత ప్రభుత్వం తక్షణం సింగరేణి కార్మికుల కోసం తగిన విద్యాలయాలు తెరవడం అత్యవసరం.
వాస్తవానికి పేపర్ లీకేజీలు అన్నవి సింగరేణి చరిత్రలో ఇదివరకు జరగలేదు. కానీ మొదటిసారిగా కవిత వచ్చాక జరిగాయని కార్మిక నాయకులూ బాహాటంగా చెబుతున్నారు. క్లరికల్, ఇంజనీరింగ్ పోస్టుల నియామకాల్లో అక్రమాలు జరిగాయని గ్రహించి సంస్తా పరమైన కూడా వేశారు. రాత పరీక్ష బాధ్యత జేఎన్ టియుకి ఇచ్చారు. కానీ పేపర్ లీక్ విషయంలో ఎంక్వయిరీ చేశాక ఒక్క ఇంట్లో ముగ్గురు నలుగురికి ఉద్యోగాలు వచ్చాయని తెలిసింది. ఈ సంగతి బయటకు రాగానే డిపార్ట్ మెంట్ ఎంక్వయిరీ జరగడం, తర్వాత దాన్ని నిలిపి వేయడం అనేక సందేహాలకు తావిస్తోంది. వీటి గురించి పేపర్లో కథనాలు కూడా వచ్చాయి. మేనేజ్ మెంట్ ఎంక్వయిరీ అయ్యాక అందరికీ ఆర్డర్లు ఇచ్చారు గానీ ఆ నివేదిక బయట పెట్టవలిసే ఉన్నది. దాదాపు కోట్ల రూపాయలు చేతులు మారిన మూడొందల పోస్టుల సంగతి ఇది.
ఇక వారసత్వ ఉద్యోగాల విషయంలోనూ అదే తంతు. ఒక్కో అపాయింట్ మెంట్ కి ఆరు లక్షలు డిమాండ్ చేశారని అంటారు. కనీసం సుమారు తొమ్మిది వేల ఉద్యోగాల్లో యాభై శాతం ఉద్యోగానికి ఆరు లక్షలు వసూలు చేశారని అంటారు. ఇదీ సింగరేణి పరిస్థితి. ఇక్కడో విషయం, తక్కువ జీతాలు ఉన్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కూడా హైదరాబాద్, బెంగుళూరు వంటి పట్టణాల్లో ఉద్యోగాలు మానేసి ఈ వారసత్వ ఉద్యోగాలకై వచ్చారు. లంచాలకు కూడా సరే అనుకుని వారు ముందుకు వచ్చారు. ఐతే, తమ ప్రాంతం ఇలా లంచగొండి వాతావరణంలోకి మారడం వారిని కలిచివేసింది.
నిజానికి కార్మిక కుటుంబాల అభివృద్ధి కోసం ఈ నియామకాలు జరిపారా లేక అవినీతి కోసమా అన్న ప్రశ్న ఇక్కడ క్షేత్ర పర్యటన చేస్తే కలిగింది. ఇవన్నీ బయటకు వెల్లడి కాకపోతే విమర్శలు విమర్శలుగానే ఉంటాయి. వాస్తవాలు బయటకు రావాల్సి ఉన్నది. వీటన్నిటి పైనా ప్రస్తుత ప్రభుత్వం విచారణ చేస్తే గానీ కవిత గారి సంఘం ప్రమేయం లేదని మనం భావించే అవకాశం ఉంటుంది. లేనట్టయితే కార్మికులు చెప్పినదాంట్లో నిజం ఉందని ఎవరైనా భావిస్తారు.
అన్నట్టు, ఇదే సందర్భంగా మనం మొత్తంగా సింగరేణిపై కూడా ఒక శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేయాలి. అది కూడా అవశ్యం. ఎందుకూ అంటే, మీకు తెలుసు, విద్యుత్ రంగ సంస్థల తాలూకు ఎనభై తొమ్మిది వేల కోట్ల అప్పుల్లో ముందు చెప్పినట్టు ఇరవై ఏడు కోట్ల అప్పులు సింగరేణివే అని కూడా గుర్తించు కోవాలి. ఆ నిధులు తిరిగి సింగరేణికి వస్తే- ఇక్కడ అభివృద్ధి, సంక్షేమం ఒక గాడిన పడుతుందని కూడా మనం గమనించాలి.
ఇవన్నీ ఇలా ఉండగా యువత ఇక్కడ మరో పెను సమస్యకు లోనవుతోంది. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటయ్యాక మద్యం విచ్చలవిడిగా అందుబాటులోకి వచ్చేందుకు బెల్టు షాపులు తోడయ్యాయి. దీనికి తోడు గంజాయి కూడా ఇప్పుడు వారికి అందుబాటులోకి వచ్చింది. ఇది ఓపెన్ గా దొరుకుతోంది. దీంతో యువత నిర్వీర్యం అయి పోతున్నదనే చెప్పాలి.
ఇట్లా ఒకటి కాదు, పదేళ్ళ పాలనలో మూడు రోజుల క్షేత్ర పర్యటనతోనే ఇన్ని విషయాలు తెలిసి వచ్చాయి. మరింత ఓపిగ్గా ఇక్కడ ఒక బృందంగా పర్యటన చేయవలసే ఉన్నది. ఆ దిశలో పౌర సమాజం ఆలోచించాలి. పదేళ్ళ పరిపాలనపై సమగ్ర అధ్యయనం జరిపి కాలేరు కథను సవరించేందుకు, భరోసా కలిగించే ఉపాధి కోసం, ఆరోగ్య వంతమైన జీవన ప్రమాణాల కోసం, ముఖ్యంగా భూగర్భ గనుల కోసం, మరో వందేళ్ళ ఆశావహ భవిత కోసం అందరం దోహద పడాలి. ఆ దిశలో ఈ పాత్రికేయుడి వ్యాసం ఒక ఉపోద్ఘాతంగా ఎంచుతారని భావిస్తూ, ఈ పర్యటనలో సహకరించిన కార్మిక లోకానికి ధన్యవాదాలు తేలియ జేసుకుంటున్నాను…. *వ్యాసకర్త స్వతంత్ర జర్నలిస్టు. మొబైల్ 9948077893
Share this Article