కాలు వాపెరిగి చెప్పులు కొనండి!
———————-
త్రేతాయుగం పూర్తయి, మధ్యలో ద్వాపర కూడా దొర్లిపోయి, కలి యుగంలో ఉన్నా ఇంకా రామపాదుకలు మనకు పాఠం చెబుతూనే ఉన్నాయి. రామ బాణం, రామ పాదం, రామ స్పర్శ, రామ దృష్టి, రామ గానం, రామ భజన, రామ కోటి, రామ పూజ, రామ నామం…అన్నీ మనకు పవిత్రం. పుణ్యం. చతుస్సాగరాల దాకా విస్తరించిన సువిశాల కోసల భూమండలాన్ని అక్షరాలా పద్నాలుగేళ్లు రాముడి పాదుకలే పాలించాయి. అడవికెళ్లిన అన్న రాముడిని వెతుక్కుంటూ భరతుడు కుల గురువు వశిష్ఠాదులను వెంటబెట్టుకుని వెళ్లాడు.
“అన్నా నేను అడగని రాజ్యం. నువ్ వదిలినా నేను తీసుకోని రాజ్యం. నాన్న లేని రాజ్యం. పన్నెండు రోజులుగా రాజే లేని రాజ్యం. తీసుకోవడానికి నాకు అర్హత లేని సింహాసనం. నీకు తప్ప ఇంకెవ్వరికీ అర్హత లేని రాజ్యం. వచ్చి ఏలుకో” అన్నాడు.
రామ- భరతుల మధ్య ఈ సందర్భంలో ధర్మం, ధర్మ సూక్ష్మం మీద జరిగిన చర్చ అసాధారణం. సాక్షిగా వాల్మీకి ఇద్దరి మాటలను యథాతథంగా ఇచ్చి మనల్నే నిర్ణయించుకోమన్నాడు. భరతుడి మాటలు వింటున్నప్పుడు భరతుడే కరెక్ట్ అనిపిస్తుంది. రాముడి అభ్యంతరాలు వింటున్నప్పుడు రాముడే కరెక్ట్ అనిపిస్తుంది. చివరకు భరతుడు మొండికేస్తాడు. నువ్ రాక పొతే ఇక్కడే గడ్డి పరచుకుని…పడుకుని ఊపిరి బిగబట్టి ప్రాణం తీసుకుంటాను అని బెదిరిస్తాడు. వ్యవహారం శ్రుతి మించి దారి తప్పుతోందని గ్రహించి వసిష్ఠుడు కలుగజేసుకుని వాతావరణాన్ని చల్లబరుస్తాడు. అప్పుడు మధ్యే మార్గంగా వచ్చిన రాజీ సూత్రమే రామ పాదుకల రాజ్య పాలన. రాముడు తొక్కి ఇచ్చిన ఆ పాదుకలు కింద పెడితే అగౌరవం కాబట్టి- రథంలో కూర్చున్న భరతుడు నెత్తి మీద పెట్టుకుని అయోధ్యకు తీసుకొచ్చి…బంగారు సింహాసనం జిలుగు పట్టు వస్త్రాల మీద పెట్టి…రాముడి పేరిటే పద్నాలుగేళ్లు రాజ్యపాలన చేశాడు. కైకేయి కోరిక కోరికగానే ఉండిపోయింది. మధ్యలో అనవసరంగా అరవై వేల ఏళ్లు నిర్నిరోధంగా రాజ్యపాలన చేసిన దశరథుడి ప్రాణాలు పోయాయి. ఆ రామాయణం ఇక్కడ అనవసరం.
Ads
———————–
పాదుకలు చాలా ముఖ్యం. చెప్పుతో కొట్టడం అన్నది మహాపరాధం. చెప్పులు కూడా లేని కాళ్లు చాలా పేదవి. దారంతా ముళ్లుంటే కాలికి చెప్పులు వేసుకోవడమే ఉత్తమం. చెప్పు కాలు ఎదుటి వారికి తగిలితే వెంటనే క్షమాపణ కోరడం సంస్కారం. పిండి కొద్దీ రొట్టెలా డబ్బు కొద్దీ చెప్పులు, బూట్లు. మ్యాచింగ్ చెప్పులు అందం. మొహం ఎలా అఘోరించినా కనీసం కాలి చెప్పులు చూసి అయినా గౌరవిస్తారని కొందరి నమ్మకం. లేదా కాలి చెప్పుల వల్ల శరీరానికి అందం పెరుగుతుందని పాదరక్షక సౌందర్య సిద్ధాంతం.
అలాంటి చెప్పులను ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా కొనకూడదని కొత్త సిద్ధాంతం చెబుతోంది. మధ్యాహ్నం పూట మాత్రమే చెప్పులు, బూట్లు కొనాలట. రక్తప్రసరణలో మార్పుల వల్ల మధ్యాహ్నానికి పాదాలు కొద్దిగా ఉబ్బి ఉంటాయట. మధ్యాహ్నం మూడు గంటలప్పుడు చెప్పులు కొనడం ఉత్తమమట. లేకపోతే మన కాళ్లకు సరిపోయాయని తీసుకుంటే- అవి ఒక సమయంలో బిగుతుగా అనిపించవచ్చు. చెప్పులు, బూట్లు ఎంత టైట్ గా ఉంటే… మనకు అనారోగ్యం అంత దగ్గరగా ఉన్నట్లు. కొత్త చెప్పులు కరవకుండా తీసుకునే జాగ్రత్తలపై మరో కథనం ఆశించొచ్చు…
———————–
వెనకటికి పన్నెండేళ్లకోసారి వచ్చే గోదావరి పుష్కరాల్లో ఫలానా మొదటి పన్నెండు నిముషాలే పరమ పవిత్రం అని ఎవరో చెబితే ఉక్కిరి బిక్కిరి తొక్కిసలాట మునకల్లో ముప్పయ్ ప్రాణాలు పోయాయి. అలా మధ్యాహ్నం మూడు గంటలకు చెప్పుల షాపుల్లో తొక్కిసలాటలు జరిగి కాళ్లు విరగకుండా కాపాడుకోవాల్సిన రోజులు వచ్చేలా ఉన్నాయి……. కీలెరిగి వాతలు! కాలు వాపెరిగి చెప్పులు!!………….. By… -పమిడికాల్వ మధుసూదన్
Share this Article