సెలబ్రిటీల వివాహాల్లో చాలా బ్రేకప్పులు చూస్తుంటాం… సొసైటీలోనే విడాకుల శాతం బాగా పెరుగుతున్నా సరే, సెలబ్రిటీల కథలే బహుళ ప్రచారంలోకి వస్తుంటాయి… వ్యక్తిగత అహం, రాజీపడకపోవడం, పాత చరిత్రలు, అత్తింట్లో ఇమడలేకపోవడం, మానసిక హింస… కారణాలు బోలెడు కావచ్చుగాక… 15, 20 ఏళ్లు కాదు, 25, 30 ఏళ్ల వివాహ బంధాల్ని కూడా వదిలేస్తున్నారు… కాకపోతే సెలబ్రిటీ కపుల్స్‌పై అకారణంగా గాసిప్స్ కూడా పుట్టుకొస్తుంటాయి…
కొన్నాళ్లకు అవి నిజం కావచ్చు లేదా చర్చల నుంచి సమసిపోవచ్చు… చిరంజీవి బిడ్డ, నాగబాబు బిడ్డ, నాగార్జున కొడుకు, రజినీకాంత్ బిడ్డ… కాదెవరూ ఈ చర్చలకు అతీతం… సమంత, నాగార్జున కొడుకు విడాకుల వార్తలు చాన్నాళ్లు నడిచాయి… కొన్నిరోజులుగా జ్యోతిక, సూర్య విభేదాల గురించి వార్తలు కనిపిస్తున్నయ్… అయ్య బాబోయ్, అదేమీ లేదు, మేం విడిపోవడం లేదు, మమ్మల్నిలా బతకనివ్వండి అని జ్యోతిక వివరణలు ఇచ్చుకున్నా సరే, పలు సందేహాలతో ఆమె వివరణనూ తప్పుపడుతున్నారు కొందరు… ఎలాగంటే..?
జ్యోతిక హీరోయిన్‌గా మంచి పొజిషన్‌లో ఉన్నప్పుడే… అంటే 2006లో… సూర్య తనను పెళ్లి చేసుకున్నాడు… తరువాత కూడా సినిమాలు వద్దు, అన్నీ మూసుకుని ఇంట్లో పడి ఉండు అనలేదు తను… ఆమె సినిమాలు చేస్తూనే ఉంది… కాకపోతే పిచ్చి డాన్సులు, అందాల ఆరబోత బాపతు రొటీన్ వేషాలు గాకుండా కాస్త హీరోయిన్ ప్రాధాన్యమున్న పాత్రల్ని ఎంపిక చేసుకుంటోంది… కొన్ని ఆ జంటే నిర్మించింది కూడా… ఇద్దరు పిల్లలు… 17 ఏళ్ల సంసారబంధం…
Ads
హఠాత్తుగా ఈ పెళ్లి పెటాకులు అని వార్తలు స్టార్టయ్యాయి… అదేమిటంటే..? ఆమె అత్తిల్లు విడిచి, అసలు చెన్నై వదిలేసి ముంబైలోని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయింది… పిల్లల్ని కూడా అక్కడే స్కూల్‌లో జాయిన్ చేసింది… ఇంకేముంది…? సూర్య, జ్యోతిక ఇకపై ఒంటరి పక్షులే అని వార్తలు ప్రారంభమయ్యాయి… ముంబైకి షిఫ్టింగ్, పిల్లల కొత్త స్కూల్ అనేవి నిజమే… అవేమీ రూమర్స్ కూడా కావు… మరి అత్తింటిని, చెన్నైని విడిచిపెట్టి పోతుంటే, అదీ ఓ సెలబ్రిటీ జంటకు సంబంధించిన పరిణామాలయితే ఇక వార్తలు పుట్టుకురావా..?
‘‘అబ్బే, మీ రాతలు అబద్ధం, సూర్య మంచి ప్రోగ్రెసివ్, మోడరన్ హజ్బెండ్… మీరు అనుకున్నంత సంకుచితం కాదు… 27 ఏళ్లయింది నేను చెన్నైకి వచ్చేసి… మా తల్లిదండ్రులతో ఎక్కువగా కలిసున్నదే లేదు… రెండుమూడుసార్లు కరోనా అటాక్ చేసినా, అప్పటి పరిస్థితుల్లో వెళ్లలేకపోయాను… బిడ్డగా వాళ్ల బాగోగులు కూడా నా బాధ్యతే… అందుకే ముంబైకి వెళ్తున్నా… సో, పిల్లలకు కూడా అక్కడే స్కూల్ చూడాల్సి వచ్చింది, చేర్చాల్సి వచ్చింది, మా అత్తింటితో నాకు ఏ ప్రాబ్లమూ లేదు…’’ అని జ్యోతిక వివరణ… సూర్య ఏమీ స్పందించలేదు, మీ ఇష్టమొచ్చింది రాసుకొండి అన్నట్టుగా సైలెంట్…
నిజంగానే మీ తల్లిదండ్రుల బాగోగులు కొన్నాళ్లు చూసుకోవాల్సి ఉంటే చెన్నైకే తెచ్చుకోవచ్చు కదా అని ఓ వాదన… కానీ మా అత్తింటికి మా తల్లిదండ్రులు వచ్చి ఎలా ఉంటారనేది జ్యోతిక ప్రశ్న… ముంబై దాకా ఎందుకు..? చెన్నైలోనే ఇంటర్నేషనల్ స్కూళ్లు ఉన్నాయి కదా అనడిగితే, నాతోపాటు వాళ్లు, నేనెక్కడుంటే వాళ్లూ అక్కడే అంటోంది ఆమె… మరి సూర్య ఒంటరిగా ఉండిపోతాడు కదా అనడిగితే నో ఆన్సర్… అందుకే ఆ వార్తలకూ నో ఎండ్… ఏమో, డెస్టినీ వాళ్లకు ఏ తోవలో తీసుకుపోతోందో…!!
Share this Article