ఒక పుల్ల అటు నుంచి ఇటు కదిలితే… రాజకీయాల్లో దానికీ ఓ అర్థముంటుంది… కారణం లేకుండా కదలదు… ఇదీ చాలామంది నమ్మేదే, జరిగేదే, నిజమే…. సరే, ఈ సూత్రంతో ఆలోచిస్తే వైఎస్ షర్మిల లోకేష్ కుటుంబానికి క్రిస్టమస్ శుభాకాంక్షలు, కానుకలు ఎందుకు పంపించినట్టు..? అతను ఆనందపడిపోయి వేంఠనే ధన్యవాదాలు చెప్పడమేమిటి..? అసలు మర్మమేమిటి..?
కొన్ని సైట్లయితే చాలాదూరం వెళ్లిపోయి… ఇంకేముంది..? షర్మిల టీడీపీలో జాయిన్ కాబోతోందా అని రాసిపారేశాయి… లోకసభకు పోటీచేస్తుందా…? ఎక్కడి నుంచి పోటీచేసే చాన్సుంది..? తన వైఎస్ఆర్టీపీ పార్టీ పేరును ఆంధ్ర అనే పదం కలిసొచ్చేలా మార్చుకునే అవకాశం ఉందా..? పొత్తుకు పవన్ కల్యాణ్ సరేనంటాడా..? ఇన్నిరకాలుగా ఆలోచించీ, చించీ, స్టోరీలు చించిపారేశాయి…
Ads
ఆంధ్రజ్యోతి సైతం టాప్‌లో ఇద్దరి ఫోటోలు వేసి, నాలుగు కాలాల బాక్స్ ఐటం కొట్టి… ఏదో జరుగుతోంది అన్నట్టుగా రాసింది… మొన్న ప్రశాంత్ కిశోర్ వచ్చాడు… నేడు షర్మిల సానుకూలంగా కదులుతోంది… ఈ పరిణామాలన్నీ వైసీపీ క్యాంపులో కలకలానికి దారితీస్తున్నాయి అంటూ తెగ ఆనందపడిపోయింది… లోకేష్ గతంలో పప్పు కావచ్చుగాక, కానీ పాదయాత్రతో పరిపక్వుడయ్యాడు, తన నాయకత్వానికి అందరి యాక్సెప్టెన్సీ వచ్చేసింది అన్నట్టుగా మోతయాగానికి, రాతయాగానికి పూనుకుంది…
ఇదంతా సరే… షర్మిల ప్రస్థానం ఎక్కడి నుంచి మొదలై ఎటు వైపు వెళ్తోంది..? ఓ విచిత్రమైన రాజకీయ పయనం… జగనన్న విడిచిన బాణంగా వేల కిలోమీటర్లు నడిచీ నడిచీ… పార్టీని నిలబెట్టి… సమైక్య వాణిని వినిపించీ వినిపించీ… హఠాత్తుగాా రాజన్నరాజ్యం అంటూ, తెలంగానం అంటూ ఓ కొత్త పార్టీ పెట్టి, పాదాల మీద నడిస్తేనే పార్టీ బతుకుతుంది, అమాయకులైన తెలంగాణ జనం ఇట్టే నమ్మేసి పట్టం గట్టేస్తారు, అర్జెంటుగా రాజన్నరాజ్యం వచ్చేస్తుంది అన్నట్టుగా నడిచింది… కానీ ఏం జరిగింది..?
అమ్మా, నీకూ నీ అన్నకూ ఏమైనా గొడవలుంటే ఆంధ్రాలోనే చూసుకొండి, మధ్యలో మా తెలంగాణను లాగడం దేనికి..? అంటూ ఆమెను లైట్ తీసుకున్నారు… మొత్తం సీట్లలో పోటీ అని చెప్పీ చెప్పీ, చివరకు ఏ కాంగ్రెస్ పార్టీనైతే మొదటి నుంచీ ‘నా అన్నను జైలులో పెట్టారు’ అంటూ తిట్టిపోసిందో, అదే కాంగ్రెస్‌లో విలీనం చేయడానికి సై అంది… ఏ రేవంతుడు నో అన్నాడో గానీ విలీనం ఆగింది… అసలు పోటీలోనే లేకుండా పోయింది…
నో, నో, ఈమె పార్టీ, ఈమె పాదయాత్ర, ఈమె కదలికలన్నీ కేసీయార్ ప్రయోజనాల కోసం, జగన్ వెనుక ఉండి నడిపిస్తున్న జగన్నాటకం అన్నవాళ్లూ ఉన్నారు, నమ్మినవాళ్లూ ఉన్నారు… అదుగో కర్నాటక నుంచి రాజ్యసభ ఇస్తారట… కాదు, కాదు, ఆంధ్రా కాంగ్రెస్ పగ్గాలిస్తారట… అని ఏవేవో అన్నారు గానీ ఏదీ జరిగింది లేదు… ఇప్పుడామె పార్టీ పరిస్థితి ఏమిటో, ఆమె భవిష్యత్తు ఏమిటో వేణుస్వామి కూడా చెప్పలేకుండా తయారైంది…
ఇప్పుడు మళ్లీ హఠాత్తుగా ఈ క్రిస్టమస్ కానుకల పర్వం ఏమిటి..? ఇన్నేళ్లూ లేనిది ఇప్పుడు తమ ఏళ్లనాటి ప్రత్యర్థి, ఎప్పుడూ తను తిట్టిపోసే చంద్రబాబు కుటుంబానికి అభిమాన సందేశాలు, సంకేతాలు ఏమిటి..? కొంపదీసి నిజంగానే తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడుతుందా ఏం..? ఏమో… లక్ష్మిపార్వతి అంటే జగన్‌కు అభిమానం ఏముంటుంది..? లేదో చంద్రబాబును తన చిన్నత్తతో తిట్టించొచ్చు అనుకుని ఆమెను ఎంకరేజ్ చేస్తాడు, పదవులూ ఇస్తాడు…
సేమ్, జగన్‌ను తన సొంత చెల్లెలితోనే నానా మాటలూ అనిపించడానికి చంద్రబాబు కూడా ‘‘షర్మిలమ్మా, నా మిత్రుడి బిడ్డవు, నాకూ బిడ్డలాంటి దానివే, గతం గతః, సరైన ప్రాధాన్యం ఇస్తాను, వచ్చి మాతో కలిసి నాలుగు అడుగులు వేయి’’ అని ఎంకరేజ్ చేసే అవకాశాాలున్నాయా నిజంగానే..? ఏమో… రాజకీయాలంటే విచిత్రాలు, వైపరీత్యాలు కదా… ఏమైనా జరగొచ్చు…!!
కొసమెరుపు ఏమిటంటే..? సదరు క్రిస్టమస్ శుభాకాంక్షల బాక్సు మీద ‘‘ఫ్రం వైఎస్ షర్మిల గారు’’ అని రాసి ఉంది… ఎవరైనా తామకు తామే గారు అని రాసుకుంటారా..? సో, ఆమె పంపించిన కానుకలు కావు, టీడీపీ వాళ్లే జగన్ క్యాంపులో కలకలం కోసం ఇదేదో క్రియేట్ చేసి ఉంటారు అని చాలామందికి డౌటొచ్చేసింది… సోషల్‌లోనూ పోస్టుతున్నారు… మరయితే ఆమె ఏమీ ఖండించలేదేం అని మరికొందరికీ డౌటనుమానాలు… ఏమోలెండి, ఈమాత్రం దానికి ఖండనమండనలు దేనికి అనుకుని, నవ్వుకుని ఆమే వదిలేసి ఉండొచ్చు కూడా…!!
మరీ చివరగా… అవునూ, ఆమె కొడుకు రాజారెడ్డి ఎవరో చౌదరిల అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడట కదా… అసలే రెడ్డి వర్సెస్ కమ్మ కులపోరాటం భారీగా సాగుతున్న ఏపీ రాజకీయాల నేపథ్యంలో… కులాల పేరిట తొక్కుళ్లు సాగుతున్న వాతావరణంలో… రెండు విద్వేష కూటముల నడుమ వియ్యం వార్త హాయిగా ఉంది… కానీ ఆ పెళ్లి సంబంధాలకూ, ఈ కొత్త అభిమాన కానుకల పంపిణీలకూ ఏదైనా లింక్ ఉందా అమ్మా…! ప్రశాంత్ కిశోర్ తన వర్క్ స్టార్ట్ చేయలేదు కదా…!! అదే ఆంధ్రజ్యోతిలో ఈరోజు వార్త… హేమిటో…
Share this Article