ఎస్… పల్లవి ప్రశాంత్ అనబడే ఓ కేరక్టర్ మూర్ఖత్వం, ఓవరాక్షన్ ప్లస్ తనకు మద్దతుగా నిలిచిన శివాజీ, యావర్, భోలే వంటి సపోర్టింగ్ కేరక్టర్ల వల్ల బిగ్‌బాస్ ఓ శాంతిభద్రతల అంశంగా కనిపిస్తోంది ఇప్పుడు… ఇప్పటికే అనేక విమర్శలు వినిపించే ఈ టీవీషో మీద ఇప్పుడు మరింత నెగెటివిటీ పెరిగింది… ఎవరెవరినో తీసుకొచ్చి కృత్రిమ కోరలు, కొమ్ములు తొడిగి సమాజం మీదకు వదులుతున్నారనేది తాజా విమర్శ…
నిజానికి ఇది ఒక టీవీ షో… అనేకానేక టీవీషోల్లాగే ఇదీ ఒకటి… నాలుగు గోడల నడుమ, ఏదో స్టూడియోలో షూటింగ్ జరుగుతుంది, టీవీల్లో ప్రసారం అవుతుంది… యాడ్స్ వస్తాయి, డబ్బు వస్తుంది… జనం చూస్తే చూస్తారు, లేదంటే పట్టించుకోరు… కానీ తెలంగాణలో మొదటిసారి ఒక టీవీ షో లా అండ్ ఆర్డర్ సమస్యగా మారింది… దానికి కారకుడు పల్లవి ప్రశాంత్…
వాస్తవానికి ఆర్టీసీ బస్సుల దహనం కారణంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్ కావడంతో కేసు ఇక్కడిదాకా వచ్చింది… దాదాపు 24 అరెస్టులు జరిగాయని ఓ సమాచారం… సదరు విన్నర్ ఫ్యాన్స్ అని చెప్పుకునేవాళ్లు వీథుల్లో బీభత్సం క్రియేట్ చేశారు… ఓ భయోత్పాతాన్ని సృష్టించారు కాసేపు… ఖచ్చితంగా ఇదంతా ఓ అరాచకం… ఎస్, అలాంటోళ్ల మీద పోలీసులు ఉక్కుపాదం మోపాలి, అలా చేస్తేనే సొసైటీకి ఓ భరోసా…
Ads
పల్లవి ప్రశాంత్‌ను అలా ఓ ఉన్మత్త శిల్పంలా తీర్చిదిద్దిన శివాజీ మీద, శివాజీ మీద ప్రేమతో పల్లవి ప్రశాంత్‌ను నెత్తిన మోసిన నాగార్జున కూడా నిజానికి కేసులకు అర్హులు… బట్, లీగల్‌గా అవి నిలవవు… ఇప్పుడు పోలీసులు ఏకంగా బిగ్‌బాస్ నిర్వాహకులకు నోటీసులు పంపించారు… ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం… నాలుగు ప్రశ్నలు వేశారు…
ఒకవేళ నోటీసులకు, కేసులకు అర్హులైతే ఒక్క బిగ్‌బాస్ టీం మాత్రమే కాదు, దాన్ని ప్రసారం చేసే స్టార్ మాటీవీ, ఒరిజినల్ నిర్మాతలు ఎండెమాల్ షైన్ ఇండియా బాధ్యులు, షూటింగ్ జరిగే అన్నపూర్ణా స్టూడియో, దాని ఓనర్ కమ్ బిగ్‌బాస్ హోస్ట్ నాగార్జున కూడా కేసులకు అర్హులే… ఐతే… లీగల్‌గా ఈ ప్రశ్నలు కోర్టులో నిలబడతాయా అనేది డౌట్… అఫ్‌కోర్స్, ఘటికులైన లాయర్లు పోలీసుల ప్రశ్నలకు సరైన జవాబులు ప్రిపేర్ చేస్తారు… గతంలో ఏపీ హైకోర్టులో ఓ కేసు పడినట్టు గుర్తు, తరువాత అదేమైందో చదివినట్టు గుర్తులేదు…
- భారీ సంఖ్యలో అభిమానులు వస్తారని తెలిసీ ఏ విధమైన సెక్యూరిటీ తీసుకున్నారు..? ఇదొక ప్రశ్న… అభిమానులు వస్తారు, విన్నర్‌ను ఊరేగిస్తూ తీసుకుపోతారు… కానీ లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని వాళ్లు ఎలా ఊహిస్తారు..?
- అభిమానులు రావొద్దని హెచ్చరికల్ని జారీ చేయాల్సినంతగా పరిస్థితులు దిగజారతాయని వాళ్లు ఎలా ఊహించగలరు..?
- వారిని ఎలా అప్రమత్తం చేశారు..? అంటే ఎవరిని..? పోలీసులనా..? సొంత స్టూడియో సెక్యూరిటీ వింగ్‌నా..? నిజంగానే పల్లవి ప్రశాంత్ బాపతు ఈ అరాచకాన్ని ఊహిస్తే పోలీసులకు ముందే చెప్పడమో, మరో పది మంది బౌన్సర్లను పెట్టడమో చేసేవాళ్లు కదా…
- నిజానికి ఇలాంటి అరాచక పోకడలు మళ్లీ మళ్లీ జరగకుండా ఫినాలే షూటింగును ఊరవతల దూరంగా ఉండే ఏ రామోజీ ఫిలిమ్ సిటీలోనో పెట్టుకుంటే బెటర్…
- నిర్వహణకు సంబంధించి సెన్సార్ బోర్డు అనుమతులు ఉన్నాయా అనే మరో ప్రశ్న విస్మయకరంగా ఉంది… ఒక టీవీ షో షూటింగ్‌కు లేదా నిర్వహణకు సెన్సార్ బోర్డు పర్మిషన్ దేనికి..? అసలు సెన్సార్ బోర్డు అధికార పరిధిలోకి టీవీ షోలు వస్తాయా..?
- అసలు ఓటీటీ కంటెంటే సెన్సార్ బోర్డు పరిధిలో లేక మితిమీరిన హింస, అశ్లీలం రాజ్యమేలుతున్నాయనే విమర్శ ఉంది కదా… ఇక టీవీ షోలు ఎంత..?
- మొన్నమొన్న కేంద్రం ఆమోదించిన కొత్త టెలికాం బిల్లులో టీవీ, ఓటీటీ కంటెంట్ మీద కూడా నియంత్రణ పాయింట్స్ ఉన్నాయని అంటున్నారు, దాని మీద క్లారిటీ రావాల్సి ఉంది… ఐనా సరే, రియాలిటీ షోల ప్రసారానికీ సెన్సార్‌కూ లింక్ ఉండదు…
- సో, బిగ్‌బాస్ షో మీద కొంతైనా కట్టుబాట్లు విధించడం అవసరమే… సోకాల్డ్ ఫ్యాన్స్, ఆర్మీల పెడపోకడలపై నిజర్ అవసరమే… కానీ ఆ దిశలో పోలీసులు మరింత పకడ్బందీ పాయింట్లతో కార్యాచరణకు పూనుకోవడం బెటర్…
Share this Article