ఆరు గ్యారంటీలకు రేషన్ కార్డుతో లంకె…. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆదరణ తీసుకురాకపోగా, అపఖ్యాతినీ, ప్రజల్లో ఆగ్రహాన్ని తీసుకొచ్చే అవకాశాలున్నయ్… ఎప్పుడెప్పుడు మీద పడదామా అని మొదటి రోజు నుంచే కాచుక్కూర్చున్న బీఆర్ఎస్‌కు చేజేతులా అవకాశాల్ని ఇస్తాయ్… ఆ సిక్స్ గ్యారంటీల ట్రూస్పిరిట్ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది… నాలుగు రోజులు ఆలస్యమైనా సరే పకడ్బందీ ఆచరణకు పూనుకుంటేనే బీఆర్ఎస్‌కు మళ్లీ ఏ స్కోపూ లేకుండా ఉంటుంది…
నిజానికి రేషన్ కార్డు ప్రస్తుతం చౌక బియ్యానికి మాత్రమే ఉపయోగపడుతోంది… అది ఆహారభద్రత కార్డు మాత్రమే… అక్కడక్కడా అడ్రస్ ప్రూఫ్ కోసం కూడా…! ఆ బియ్యం కూడా రేషన్ డీలర్లు, రైస్ మిల్లర్లను బతికించేది మాత్రమే… ప్రస్తుతం ఆదాయ, కుటుంబ ఆర్థిక స్థితిని సూచించే కార్డు కానే కాదు ఇది… లక్షల సంఖ్యలో బోగస్ కార్డులున్నయ్ ఫీల్డ్‌లో… గతంలో ఆరోగ్యశ్రీకి లింక్ ఉండేది… ఇప్పుడదీ లేదు…
ఉద్యోగరీత్యా అటూఇటూ తిరిగేవాళ్లు రేషన్ కార్డులను వదిలేసుకున్నారు, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్లూ పట్టించుకోలేదు… మరోవైపు కొత్త కార్డుల జారీ లేనే లేదు… దాదాపు పదేళ్లలో పది లక్షల కార్డులకు దరఖాస్తులున్నా సరే, ఒక్కటంటే ఒక్క కార్డూ ఇవ్వలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం… ఇప్పటికే ఎక్కువగా ఉన్నాయి, ఇంకా కొత్తవి ఎలా ఇస్తాం అనుకుంది… బోగస్ కార్డులను కూడా రాజకీయ కారణాలతో తీసేయలేదు… (రేషన్ డీలర్లకు, రైస్ మిల్లర్లకు అనుకూలమైన, అస్తవ్యస్తమైన సివిల్ సప్లయ్ విధానం కూడా ఓ కారణం…)
Ads
అన్ని గ్యారంటీలకు గుండుగుత్తాగా రేషన్ కార్డుతో లంకె దేనికి..? అసలు ప్రభుత్వానికి ఈ సలహా ఇచ్చిందెవరు..? రైతుభరోసా ఇవ్వాలంటే దరఖాస్తు చేయాలి, కానీ కార్డు కావాలి, కొన్ని లక్షల కుటుంబాలకు కార్డుల్లేవ్… ఐనా ఐదో, పదో ఎకరాల వరకు పరిమితి పెట్టి, ఇప్పుడున్న డేటా ప్రకారం రైతుభరోసా డబ్బు ఇచ్చేస్తే సరిపోతుంది కదా… ఆల్‌రెడీ అమలులో ఉన్న పంపిణీ పథకమే కదా… కాకపోతే డబ్బు పెంచుతున్నారు, అంతే…
ప్యాసింజర్ బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణం నిబంధన గుడ్… పేద మహిళలు మాత్రమే, తక్కువ దూరాలకు మాత్రమే వాటిల్లో ప్రయాణిస్తుంటారు… సో, పథకం స్పిరిట్ ఏమీ దెబ్బతినదు… కానీ రాబోయే రోజుల్లో డిజిటల్ కార్డు సిస్టం వస్తుంది… అది ఉన్నవాళ్లు మాత్రమే ఆ మాత్రం ఉచితాన్ని పొందుతారు, కానీ దానికీ రేషన్ కార్డు కావాలి… అదేమో ఉండదు, సో, కొన్నిరోజుల్లో ఆర్టీసీ బస్సులు మళ్లీ యథాస్థితి రద్దీకి చేరుకుంటయ్…
కానీ సిలిండర్..? బోగస్ కార్డులున్నవారికి సబ్సిడీ దక్కుతుంది… కార్డుల్లేని వారికి మొండి చేయి తప్పదు… ఎక్కడెక్కడో పట్టణాల్లో, నగరాల్లో ఉపాధి కోసం కడుపు చేత్తో పట్టుకుని వచ్చి బతుకుతున్న వారికి ఈ సబ్సిడీ దక్కేదెలా..? అసలు వాళ్లకే కదా కావల్సింది… 200 యూనిట్ల విద్యుత్తుకూ అంతే… 200 యూనిట్లలోపు కరెంటు వాడకం ఉంటే ఆటోమేటిక్‌గా జీరో బిల్లు వచ్చేలా సాఫ్ట్‌వేర్ మార్పులు చేయడం గంటల్లో పని… దానికీ ఇప్పుడు దరఖాస్తు చేసుకోవాలి… ఇక్కడా లక్షల మంది అర్హులకు ఆ ఉచితం దక్కదు… ఫలితంగా కాంగ్రెస్ మీద ఆగ్రహం పెరుగుతూ ఉంటుంది…
ఇలా ప్రతీ గ్యారంటీకి రేషన్ కార్డుతో లంకె, దరఖాస్తులు, వడబోతలు అనే విధానం సరైన ఫలితాలను ఇవ్వదు, ఆ పథకాల నిజస్పూర్తికీ విఘాతం… పోనీ, కాంగ్రెస్‌కు రాజకీయ ప్రయోజనాలుంటాయా అంటే, అదీ ఉండదు… ఫీల్డ్‌లో వ్యతిరేకతను తనంతట తనే పెంచుకుంటున్నట్టు… ఏ పథకానికి ఎవరు అర్హులో తేల్చడానికి సమగ్ర కుటుంబ సర్వే వంటిది నిర్వహించినా తప్పులేదు, ఆలస్యమైనా సరే జనం ఆశగా నిరీక్షిస్తారు… రేవంత్ రెడ్డి మరో పదీపదిహేనేళ్లు ముఖ్యమంత్రి కుర్చీలో పదిలంగా కొనసాగాలంటే, ఆ టార్గెట్ నిలబడాలంటే తక్షణం సిక్స్ గ్యారంటీల అమలు మీద సరైన విధానాన్ని, కార్యాచరణనూ ఆలోచించాలి…
అబ్బే, రేషన్ కార్డులు లేనివాళ్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అంటున్నారు… కానీ రేషన్ కార్డు మాత్రమే పథకాల మంజూరుకు ప్రామాణికం అని మంత్రులు కుండబద్ధలు కొట్టి ప్రకటిస్తున్నారు ప్రెస్‌మీట్లో… పోనీ, ఇప్పటికిప్పుడు కొత్త కార్డులు ఇవ్వగలరా..? సరే, ఇస్తారనే అనుకుందాం, మరి పాత బోగస్ కార్డుల మాటేమిటి..? అవి తొలగిస్తే ఒక తంటా, కొనసాగిస్తే మరో తంటా… అందుకే రేషన్ కార్డుతో లంకె ఎప్పటికైనా సమస్యాత్మకమే… ఆరోగ్యశ్రీతో లంకె కత్తిరించింది కూడా ఇందుకే… కొంతలోకొంత రిలీఫ్ ఏమిటంటే… వృద్ధాప్య, వితంతు వంటి పెన్షన్ పథకాల లబ్దిదారులు కొత్తగా దరఖాస్తు చేసుకోనక్కర్లేదట…
ప్రస్తుత కార్యాచరణ మాత్రం ఏమాత్రం తనకు రాజకీయంగా ఉపయోగపడదు… అది గ్యారంటీ…! ఇవిలాగే కొనసాగితే మళ్లీ బీఆర్ఎస్ పాలన ఎక్కడ వస్తుందో అనే ప్రజల భయాన్ని కూడా తొలగించాల్సిన బాధ్యత కాంగ్రెస్‌దే…! ఇందిరమ్మ రాజ్యం అంటే అర్హులందరినీ ఓన్ చేసుకునే పాలన… అదే రేవంత్‌రెడ్డికి కూడా దిక్సూచి…! అభయహస్తం అంటే ఆ భయ హస్తం కాదు, అభయం ఇచ్చే హస్తం…! చివరగా… ఇది విమర్శ కాదు, ఫీడ్ బ్యాక్… సరైన దిశలో పయనం కోసం ఓ శ్రేయో సలహా… !!
Share this Article