కొత్తగా ముఖ్యమంత్రి అయ్యాడు… తోడుగా ఉపముఖ్యమంత్రి… కొలువు దీరిన కొత్త మంత్రివర్గం… ఇక్కడ ఏ పార్టీ అనేది పక్కన బెడితే… కేంద్రం- రాష్ట్రం అనే కోణంలో చూడాలి కొన్ని భేటీలను..! తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలోనిదే… తెలంగాణ ప్రజలకు కూడా మోడీ ప్రధానమంత్రే… ఈ సోయి లోపించింది నమస్తే తెలంగాణకు… ఇదుగో ఇలాంటి రాసీ రాసీ బీఆర్ఎస్ మీద వ్యతిరేకతను పెంచింది… ఇంకా మారడం లేదు…
ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి భేటీకి వక్రబాష్యాలు దేనికి..? ఏదో తప్పు జరిగిపోతోంది అన్నట్టుగా రాతలు దేనికి..? ఎస్, ఒక కొత్త సీఎం తన డిప్యూటీ సీఎంను తోడుగా తీసుకుని ప్రధాని కలిశాడు, రాష్ట్ర అభివృద్ధి దిశలో సహకరించండీ అని విజ్ఞప్తి చేశాడు… తప్పేముంది..? నిజానికి స్వాగతించాలి ఈ ధోరణిని…! మాది వేరే పార్టీ, మోడీది వేరే పార్టీ అని కాదు కదా చూడాల్సింది… అక్కడ ప్రధాని, వెళ్లింది ముఖ్యమంత్రి… అదే చూడాల్సిన కోణం…
మోడీ ఆఫీసు కూడా ఏ తాత్సారం చేయలేదు, వెంటనే అపాయింట్‌మెంట్ ఫిక్స్ చేసింది… కొత్త ముఖ్యమంత్రిని, ఉపముఖ్యమంత్రినీ ప్రధాని అభినందించాడు… ఇదంతా ఓ పాజిటివ్ వైబ్రేషనే కదా… అఫ్‌కోర్స్, బయటికొచ్చాక ఎవరెవరి రాజకీయ ధోరణులు వాళ్లవే… పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి వేరు, ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి వేరు… ఈ విషయంలో రేవంత్ వైఖరిలో ఏమాత్రం తప్పుపట్టే పనిలేదు… ఒక్క నమస్తేకు తప్ప… ఈ భేటీతో తెలంగాణ పతార (పలుకుబడి, పరపతి)కు పాతరేసింది ఏముంది..?
Ads
‘‘అక్కడికి వెళ్లీ మోడీ ఎదుట అప్పుల పాట పాడారు, అప్పులకుప్పగా చిత్రీకరిస్తోంది కాంగ్రెస్ సర్కారు, కేసీయార్ పాలనను దోషిగా నిలబెట్టబోయి సెల్ఫ్‌గోల్ కొట్టుకుంది… ఇలాగైతే పెట్టుబడులు పెట్టడానికి ఎవరొస్తారు..?’’ అని శోకగీతం అందుకుంది నమస్తే… సో వాట్..? కేసీయార్ పాలన దోషే… అసమర్థ, అస్తవ్యస్థ ఆర్థిక విధానాలు, పాలన ధోరణులతో రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేయడం నిజమే కదా… ఎక్స్‌పోజ్ చేస్తే తప్పేముంది..? రోగాన్ని దాచుకుంటే ఎలా..? రోగవివరాలు చెప్పి చికిత్స కోరుకోవడమే బెటర్ కాదా…
పోనీ, మోడీకి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా..? తెలంగాణ ఆర్థిక నిర్వహణ లోపాలు తెలియవా..? మొన్నటి ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కూడా పలు వివరాలు చెప్పింది కదా… ఐనా అసలు రాష్ట్ర ఆర్థిక స్థితికీ కొత్త పెట్టుబడులకూ లింక్ ఏమిటి..? పోనీ, కాంగ్రెస్ ఏమైనా చేతులెత్తేస్తోందా..? లేదు కదా… ఇంత ఘోరమైన అప్పుల్లోకి కూరుకుపోయినా సరే, దీన్ని చక్కదిద్దుతాం అంటోంది… ఇక సెల్ఫ్ గోల్ ఏముంది..? రోగం దాచుకుంటే ముదిరిపోతుంది… చికిత్స అవసరం… కాస్త చేయూత ఇవ్వండి అనడుగుతోంది ప్రధానిని… అఫ్‌కోర్స్, అది కేంద్రం బాధ్యత కూడా…!!
మోడీ అంటే పడదు కాబట్టి… కేసీయార్ ఢిల్లీ వెళ్లేవాడు కాదు… ప్రధాని వస్తే కనీసం పలకరింపూ ఉండేది కాదు… వేర్వేరు పార్టీలు, విభేదాలు ఉంటే సీఎం, పీఎం నడుమ ఈ అగాధం అవసరమా..? ఇది ఈగో సమస్య… చివరకు లేడీ గవర్నర్‌కు కూడా అడుగడుగునా అవమానాలేనాయె… రేవంత్ ఆ తప్పుదోవలో వెళ్లాలని కోరుకుంటోందా నమస్తే క్యాంప్…? ఇదేం విడ్డూరం…!!
Share this Article