దేవీపుత్రుడు అనే పాత తెలుగు సినిమా గుర్తుందా..? వెంకటేశ్, సౌందర్య, అంజలా జవేరి నటించారు… అందులో ద్వారక ప్రస్తావన, దానికి లింకున్న కథ, కొన్ని సముద్ర అంతర్భాగ సీన్లు ఉంటాయి… సరే, ఆ కథ వేరు, కథనం వేరు… కానీ సినిమాలో ప్రధాన పాయింట్ ద్వారక… అదే ఆకర్షణ… ఇప్పుడే కాదు, ఏళ్లుగా మన ఆధ్యాత్మిక, సాంస్కృతిక, చారిత్రిక సాహిత్యాల్లో ద్వారక ఓ మిస్టరీ నగరం… నాడు శ్రీకృష్ణుడు నిర్మించిన నగరం…
మన పురాణాలు ఏం చెబుతున్నాయి..? పదే పదే జరాసంధుడి దండయాత్రలతో జరిగే నష్టం, ప్రాణనష్టంతో విసిగిపోయిన కృష్ణుడు మధురకు దూరంగా సముద్ర తీరం చేరుకుని విశ్వకర్మ సాయంతో అందమైన, దుర్భేద్యమైన నగరాన్ని నిర్మిస్తాడు… సముద్రరవాణా, వ్యాపారంతో యాదవగణం అంతులేని సంపదను పొందుతుంది… కానీ గాంధారి శాపంతో కృష్ణావతారం ముగిసే సమయంలో యాదవులు పరస్పరం కొట్టుకుని చస్తారు… ఆ నగరం సముద్ర తుఫానుకు గురై మునిగిపోతుంది… ఇదీ కథ…
చాలా ఏళ్లపాటు చాలా సినిమాల్లో, సాహిత్యంలో, కథల్లో, నవలల్లో… అది చరిత్రో, అది ఫిక్షనో… ద్వారక మాత్రం ఓ అబ్బురం… అయితే సముద్ర గర్భంలో నగరం నిజమేనా..? పోనీ, ఆ శిథిలాలైనా ఉన్నాయా..? అసలు ఇప్పుడు సముద్రతీరంలోని ద్వారకే అసలు ద్వారకా..? లేక సముద్రగర్భంలో ఓ ద్వారక నిజంగానే ఉందా..? ఎన్నో ప్రశ్నలు… ఎన్నో సందేహాలు…
Ads
ఆమధ్య మన ప్రసిద్ధ మెరైన్ ఆర్కియాలజిస్టు డాక్టర్ రావు మార్గదర్శకత్వంలో ఆర్కియాలజిస్టులు, ట్రెయిన్డ్ ఫోటోగ్రాపర్లు, అండర్ వాటర్ డ్రైవర్లతో ఓ సర్వే తొమ్మిదేళ్లపాటు జరిగింది… మెరైన్ బాపతు ప్రభుత్వ సంస్థలు కూడా సహకరించాయి… ఆధునిక టెక్నాలజీని వాడారు… mud penetrators, echo sounders, sub bottom profilers, metal detectors వాడారు… కొన్ని పురావస్తువులు కూడా సేకరించి ప్రదర్శించారు… కార్బన్ డేటింగులో అవి క్రీస్తుపూర్వం 1500 సంవత్సరాల క్రితం నాటివని తేల్చారు… ఇదీ మనకు తెలిసే సమాచారం…
కానీ సైట్లలో, మీడియాలో, యూట్యూబులో బోలెడంత ఫేక్ సమాచారం కూడా ఉంది… మార్ఫ్‌డ్ వీడియోలు, ఏవో క్రియేటెడ్ ఫోటోలు గట్రా చూపిస్తూ బోలెడు కల్పనను గుప్పించారు… నిజంగా ఆ సముద్ర గర్భంలో ఏం కనిపిస్తుంది..? గోడలు, పునాదులు, మెట్లు గట్రా నాటి కృష్ణా నగర ఆనవాళ్లు చూడబుల్ స్థితిలో కనిపిస్తూ ఉన్నాయా..? నిజంగా అక్కడేం ఉందో, ఏం కనిపిస్తుందో ఎవరూ ఇదమిత్థంగా చెప్పలేని స్థితి… పోనీ, గుజరాత్ ప్రభుత్వమో, కేంద్ర ప్రభుత్వమో ద్వారక ఆనవాళ్ల గురించి అధికారిక ప్రకటనలు ఏమైనా చేశాయా..? అంతా మాయ… సరే, ఇప్పుడు గుజరాత్ ప్రభుత్వం ఓ టూరిజం జలాంతర్గామిని లీజు తీసుకుంటోంది…
ఆ టూరిస్ట్ సబ్‌మెరైన్ మనల్ని ద్వారక ఉన్న సముద్రగర్భానికి తీసుకుపోతుందట… 30 మంది వరకూ అందులో కూర్చోవచ్చు… 24 మంది భక్తులు… వాళ్లకు ఆక్సిజన్ మాస్కులు, స్కూబా డ్రెస్సులు గట్రా ఇస్తారట… ఆ ప్రదేశానికి తీసుకుపోతారట, రేటు గట్రా ఇంకా వివరాలు తెలియవు… కానీ ద్వారక టూరిజం మాత్రం చెప్పుకోదగిన మంచి వ్యాపార- ఆధ్యాత్మిక పర్యాటకమే అవుతుంది… 300 అడుగుల దాకా తీసుకెళ్తారని వార్తలొచ్చాయి…
రెండున్నర గంటలపాటు సాగే ఈ యాత్రలో భాగంగా ద్వారక సందర్శనమే కాదు, సముద్ర జీవులనూ తిలకించవచ్చు… అసలు టూరిస్ట్ సబ్ మెరైన్‌లో ప్రయాణమే ఓ థ్రిల్… ద్వారకలో ఏం కనిపించకపోయినా, కనిపించినా సరే, ఆ ఏరియాకు చేరితే చాలు భక్తిగా దండం పెట్టి, పుణ్యం పొందాలని కోరుకునే ధనిక భక్తుల సంఖ్య కోకొల్లలు… అది ఒకప్పుడు కృష్ణ సామ్రాజ్యం మరి… సో, కొత్తొక వింత… ఈ అతి పాత కూడా వింతే… ఇంకా వివరాలు అధికారిక ప్రకటనలు వచ్చేకొద్దీ చెప్పుకుందాం…
Share this Article