ముందుగా ఒక విభ్రాంతికర నేర వార్త చదవండి… ‘‘కర్నాటకలోని చిత్రదుర్గలో గురువారం రాత్రి పోలీసులు ఒక ఇంటి నుంచి అయిదు మృతదేహాలను కనుగొన్నారు… అవి దాదాపు అస్థిపంజరాల్లాగా పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయి… వాళ్లందరూ నాలుగేళ్ల క్రితమే మరణించి ఉంటారని భావిస్తున్నారు…
మృతదేహాలు కనిపిస్తున్న స్థితిని బట్టి అది సామూహిక ఆత్మహత్య కావచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు… దాదాపు అయిదేళ్లుగా ఆ ఇంట్లో ఎవరెవరు ఉన్నారో కూడా ఇరుగుపొరుగు వారికి తెలియదు… అనుకోకుండా ఈమధ్య ఓ ఆగంతకుడు ఎవరో ఆ ఇంట్లోకి జొరబడటానికి ప్రయత్నించి, ఈ శవాలను చూసి షాక్ తిని, ఎవరో జర్నలిస్టుకు సమాచారం అందిస్తే, అలా ఈ విషాదం బయటపడిందని ఓ పోలీస్ అధికారి వెల్లడించాడు…
‘సదరు జర్నలిస్టు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు, ఇంటి ప్రధాన ద్వారం పగులగొట్టబడి ఉంది… తీరా లోపలకు వెళ్లి చూశాక ఈ షాకింగ్ సీన్స్ కనిపించాయి’ అని చిత్రదుర్గ ఎస్పీ ధర్మేంద్రకుమార్ మీనా చెప్పాడు… మరణించినవాళ్లు జగన్నాథరెడ్డి (80), ఆయన భార్య ప్రేమక్క (72), వాళ్ల పిల్లలు త్రివేణి (55), కృష్ణ (51), నరేంద్ర (53) అని భావిస్తున్నారు… అన్ని శవాలూ నిద్రపోతున్నట్టుగా కనిపించాయి… అంటే, పెనుగులాడిన దాఖలాలు గానీ, బాధతో అటూఇటూ పొర్లాడినట్టు గానీ లేదు…
Ads
ఇరుగుపొరుగు వారిని అడిగితే 2019 మధ్యకాలం నుంచి ఆ ఇంటి నుంచి ఎవరూ నిత్యావసరాల కొనుగోలుకు కూడా బయటికి వచ్చినట్టు కనిపించలేదన్నారు… ఎవరితోనైనా మాట్లాడాల్సి వస్తే విండో నుంచి ఒకరు మాట్లాడేవారట… ఎవరూ పెద్దగా బయటికి వచ్చేవారు కాదట… నాలుగేళ్ల క్రితం ఈ మరణాలు సంభవించాయని అనుమానించడానికి కారణం 2019 కేలండర్ తరువాత కొత్త కేలండర్ లేదు, 2019 జనవరిలో లాస్ట్ పెయిడ్ పవర్ బిల్లు… ఫోరెన్సిక్ పరీక్షలు చేస్తున్నారు…
జగన్నాథ్ తన భార్య ప్రేమక్క కోసం లక్షల రూపాయల మందులు కొనుగోలు చేసినట్టు బిల్లులున్నాయి… వాళ్లకు నలుగురు పిల్లలు, అందులో మంజునాథ్ అనేవాడు 2014లో మరణించగా, మిగతా వాళ్లు అవివాహితులు… అందరికీ తీవ్ర అనారోగ్య సమస్యలున్నట్టున్నాయనీ, ఎవరూ పెద్దగా బయటికి వచ్చేవారే కాదని ఇరుగూపొరుగూ చెప్పారు… ఒక సీల్డ్ లైఫ్, అంటే స్వీయ బందీఖానా… రెండు నెలల క్రితం ఆ మెయిన్ డోర్ పగులగొట్టినట్టు కనిపించింది, కానీ దాన్ని గమనించిన పొరుగాయన పోలీసులకు చెప్పలేదు… వీరిలో నరేంద్ర అనే వ్యక్తి 2013లో దొంగతనం ఆరోపణలపై కొన్నాళ్లు జైలులో ఉన్నాడు…… ఇదండీ వార్త…
నిజంగా మనం ఓ సమాజంగా, ఓ సమూహంగా బతుకుతున్నామా..? ఎస్, ఆ కుటుంబం మొత్తాన్ని ఏదో మానసిక వ్యాధి పీడిస్తున్నట్టుంది… లేకపోతే నలుగురు పిల్లలకూ పెళ్లిళ్లు కాలేదు… వయస్సు కూడా 50 దాటాయి… అంటే ఏదో తీవ్ర సమస్యే… స్నేహితులు లేరు, బంధుగణం లేదు… ఇంటి నుంచి బయటికి రారు, మరి జీవనోపాధి ఎలా..? వాళ్లకు ఎవరూ లేరా..? అసలు ఏమిటి ఆ కుటుంబ సమస్య..?
అసలు నాలుగేళ్లుగా శవవాసన రాకపోవడం ఏమిటి..? వీథివీథంతా కంపు కొట్టాలి కదా… పైగా ఈ నాలుగేళ్లలో ఎవరూ ఆ ఇంటిని టచ్ చేయకపోవడం ఏమిటి..? పాలవాడు, పేపర్‌వాడు, స్ట్రీట్ స్వీపర్లు, కరెంటోళ్లు, నిత్యావసరాలు… ఎవరూ రాకపోవడం ఏమిటి..? కనీసం ఎలక్షన్ల కోసం ఎవడో దిక్కుమాలిన నాయకుడో, కార్యకర్తో కూడా వెళ్లలేదా..? పోనీ, ఇరుగూపొరుగుకు నాలుగేళ్లుగా వాళ్లెవరూ కనిపించడం లేదంటే డౌటే రాలేదా..? అసలు వాసన రాలేదా..?
నిత్యావసరాలు, కూరగాయలు, పాలు, మందులు ఎట్సెట్రా ఎలా వచ్చేవి..? ఎన్నో ప్రశ్నలు… పోనీ, ఎవరైనా హత్య చేశారు అనుకుందాం, ఐనా నాలుగేళ్లుగా బయటపడకపోవడం ఏమిటి..? కాదు, ఆత్మహత్యే అనుకుందాం, ఇన్నేళ్ల బందిఖానా జీవితాన్ని మించిన హఠాత్ సమస్య ఏమొచ్చింది..? గతంలో ఓ కుటుంబసభ్యుడు కొన్నాళ్లు జైలులో ఉన్నందుకు అవమానంగా ఫీలై ఆత్మహత్యకు పాల్పడ్డారు అని ఓ ఊహాగానం పత్రికల్లో కనిపించింది… అసలు సొసైటీలో బతుకుతూ ఉంటే కదా, ఆ సున్నితత్వం… ఎవరో ఏదో అంటారనే ఫీలింగ్…
సో, ఏదో బలమైన కారణం ఉంది… అదేమిటి..? ఆవాసాల మధ్యలోనే ఒక ఇల్లు ఈ విచిత్ర ధోరణితో ఉంటే… ఎవరూ గుర్తించలేదా..? పోనీ, నాలుగేళ్లుగా కనిపించకపోతే ఏమిటనే కారణాల అన్వేషణ కూడా లేదా… అసలు మనం ఓ సమూహంగా బతుకుతున్నామా..? మనిషి సమాజజీవేనా…!? మనసంతా ఏదో అర్థంకాని వెలితి విస్తరిస్తున్నట్టుగా ఉంది…!!!
Share this Article