వార్నీ… తమన్ సినిమా పాటల ట్యూన్లు యథేచ్ఛగా కాపీ చేస్తాడని అందరూ చెబుతుంటారు… కాకపోతే తన మార్క్ చిన్న చిన్న మార్పులు చేస్తాడు, ఎవరికీ దొరకకుండా… ఐనా దొరికిపోతుంటాడు… అది వేరే సంగతి,.. కానీ మరీ ఈ ట్యూన్ అయితే మక్కీకిమక్కీ దింపేశాడు… అదేనండీ గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడతపెట్టి అనే ఓ బూతు పాట ఉంది కదా… దాని సంగతే…
ఇప్పటికే ఆ బూతును యథాతథంగా వాడుకున్న తీరుపై విమర్శలు తెలిసిందే కదా… ఇక ఆ ట్యూన్ జోలికి వెళ్తే… యూట్యూబ్‌లోనే డీజే హరీష్ పేరిట ఈ ట్యూన్ కనిపించింది… నాలుగు నెలల క్రితం నాటి వీడియో… నిజానికి వీడియో సీన్లేమీ లేవు… జస్ట్, ఆ ట్యూన్… ఫాఫం తమన్… తనకు అంత పెద్ద టీమ్ ఉంది, ఎంచక్కా నాలుగు కొత్త ట్యూన్లు క్రియేట్ చేయలేరా..?
సరే, ఆ ట్యూన్, ఆ బూతు వివాదం, బూతు ఓనర్‌కు ఇచ్చిన డబ్బు గట్రా పక్కన పెడదాం… సరస్వతీ పుత్రుడిగా తనే చెప్పుకునే సదరు రామజోగయ్య శాస్త్రి ఏం రాశాడో కూడా పరిశీలిద్దాం… (ఎందుకంటే, మనకు మహేశ్ బాబు పాటలు సంసారపక్షంగా, సంస్కారపక్షంగా ఉండాలని కోరిక కాబట్టి, మహేశ్ బాబుకు ఫ్యామిలీ ఫ్యాన్స్ ఎక్కువ కాబట్టి, తన నుంచి మనం వెకిలి పాటల్ని ఎక్స్‌పెక్ట్ చేయం కాబట్టి, పిల్లలూ తనను అభిమానిస్తారు కాబట్టి…)
Ads
పాట ఎత్తుకోవడమే… సీన్‌లో కుర్చీ అటూఇటూ ఎగిరిపోతూ కనిపిస్తుంది… వావ్, ఏం దర్శకత్వం..? సాహితీ చాగంటి, శ్రీకృష్ణ సింగింగ్, మహేశ్ వాయిస్ ఉంది… కుర్చీ తాత, డీజే మహేష్‌కు కూడా క్రెడిట్స్ ఇచ్చారు… అసలే శేఖర్ మాస్టర్, పాటకు తగినట్టు స్టెప్స్ కంపోజ్ చేశాడు… ఇదంతా వోకే… కానీ సినిమాలో మహేశ్ బాబు హీరో, సందేహం లేదు… శ్రీలీల, మీనాక్షి చౌదరి పేర్లు కనిపిస్తున్నాయి… అంటే హీరోయిన్లే కదా… కానీ పాటేమో అదేదో కొంపలో సుందరి ఎవరో విటుడితో మాట్లాడుతున్నట్టు, పోట్లాడుతున్నట్టు ఉంది… ఇదేమిటో…
లవ్ గీతం కాదు, ఏదో ఐటమ్ సాంగ్ అన్నట్టుగా ఉంది… ఏమో, అదేనేమో… రాజమండ్రి రాగమంజరి, మా యమ్మ పేరు తెలియనోళ్లు లేరు మేస్త్రీ… కళాకార్ల ఫ్యామిలీ మరి, నే గజ్జె కడితే నిదురపోదు నిండు రాతిరీ… అని శ్రీలీల స్టెప్పులతో వొగలు పోతుంటే… సోకులాడి స్వప్నసుందరి, నీ మడత చూపు మాపటేల మల్లెపందిరి అని మహేశ్ అందుకుంటాడు… సాహిత్యంలోనూ కుర్చీ తప్పదు, తప్పనివ్వడు, అసలే జోగయ్య శాస్త్రి కదా…
రచ్చ రాజుకుందే ఊపిరి, నీ వంక చూస్తే గుండెలోన డీరి డిరి డిరి అంటూ సరిగ్గా సమయానికి ఏ పదమూ దొరక్క అలా డిరి డిరి అని ప్రాస కలిపేశాడు… ఈ తూనీగ నడుమలోన తూటాలెట్టి, తూపాకీ పేల్చినావె తింగరి చిట్టి… మగజాతినట్టా మడతపెట్టి…. అని సాగుతుంది పాట… చెప్పండి, ఇది ప్రేయసీప్రియులు పాడుకునే పాటేనా..? ఇక్కడా మడత పెట్టడం తప్పలేదు…
దానికేమో, మరి దానికేమో మేకలిస్తివి, నాకేమో సన్నబియ్యం నూకలిస్తివి అని నిష్ఠూరమాడుతుంది ఆమె… బహుశా మరో కొంపలో ఉండేదానికి సదరు విటుడు ప్రయారిటీ ఇచ్చి, ఈమెను ఇగ్నోర్ చేస్తున్నాడనేమో విమర్శ… మేకలేమో వందలుగా, మందలుగా పెరిగిపోతే నా నూకలేమో ఒక్క పూటకే కరిగిపాయె అని ఆమె బాధ… ఆడ పచ్చరాళ్ల జూకాలిస్తివి, నాకేమో చుక్కగళ్ల కోకలిస్తివి, దానికేమో జూకాలు ధగాధగా మెరిసిపాయే, నాకు పెట్టిన కోకలేమో పీలికలై చిరిగిపాయె… ఏం రసిక రాజువో మరి, నీతో ఎప్పుడూ ఇదే కిరికిరి… అని తన రెగ్యులర్ గిరాకీ మీద తెగ ఫిర్యాదులు చేస్తుంది ఆమె… ఇది హీరోహీరోయిన్ల పాటా..?
చివరకు మహేశ్ కూడా ‘‘రాసుకొండి, మడతపెట్టి పాడేయండి’’ అని ముక్తాయించాడు… మొత్తానికి జాతి చిరకాలం పాడుకునే ఓ అద్భుత గీతాన్ని రాసిన జోగయ్య, సంగీతాన్ని రాసిన తమన్, స్టెప్పులు రాసిన శేఖర్, దర్శకత్వం రాసిన త్రివిక్రమ్… మస్తు ఎగిరిన మహేశ్, ఆ జోరు ఊపుళ్ల శ్రీలీల… మీరందరూ ధన్యజీవులు…!!
Share this Article