నువ్వు హీరోవా..? అసలు యాక్టర్ అవుతావా..? నీ కలర్ ఏమిటి..? ఆ కలలేమిటి..? ఫో… అని చీదరించుకోబడిన కెప్టెన్ విజయకాంత్ బోలెడు సినిమాల్లో హీరో అయ్యాడు… ఏదో నాలుగు సినిమాలు చేసి, తరువాత ఇంట్లో కూర్చోవాల్సిందే అనే విమర్శలకు రాజకీయాల్లోకి ఎంట్రీ ద్వారా బదులిచ్చాడు…
మొదట్లో అక్కడా ఫెయిల్యూర్, తరువాత అన్నాడీఎంకేతో కూడి గౌరవనీయ సంఖ్యలో ఎమ్మెల్యేల్ని గెలిపించుకున్నాడు… ప్రతిపక్ష నేత అయ్యాడు… ఒక హీరోగా… ఒక రాజకీయ నేతగా… తను ఎగిరి విరిగిన కెరటమే కావచ్చుగాక… కానీ ఓ మనిషిగా గెలిచాడు… నిండు వ్యక్తిత్వంలో అనేకమంది అభిమానాన్ని చూరగొన్నాడు…
దీర్ఘకాలిక అనారోగ్యంతో ఇక సెలవు అని వెళ్లిపోయిన ఆయన అంత్యక్రియలకు హాజరైన అశేష జనావళిని చూస్తే ఆశ్చర్యమేసింది… తను ఎంతగా తమిళుల ఆదరణను చూరగొన్నాడో అర్థమైంది… జయలలిత మరణం తరువాత చెన్నైలో అంతగా జనం కిలోమీటర్ల కొద్దీ నిలబడి నివాళులు అర్పించారంటే అది విజయకాంతే… కన్నడనాట పునీత్ అంత్యక్రియలు, జనం నివాళి కూడా మరిచిపోలేనివే…
Ads
విజయకాంత్ పార్థివ దేహానికి నివాళి అర్పించడానికి వచ్చిన రజినీకాంత్ ఒక్కసారిగా కన్నీటిపర్యంతమైన వీడియో ఇప్పుడు వైరల్… నటుడిగా, రాజకీయవేత్తగా విజయకాంత్ సాగించిన ప్రస్థానంలో ఎన్నో అవమానాలు… మరెన్నో విజయాలు… తాను ఎదుర్కొన్న ఇబ్బందులు ఇంకొకరికి రాకుండా ఉండేందుకు తను ప్రయత్నించిన తీరు ఎందరో నటీనటులకు, రాజకీయ నాయకులకు స్పూర్తి… అన్నార్థులకు, అనాధలకు, దిక్కులేని వారికి అండగా నిలిచిన తీరు కూడా ప్రశంసనీయం… ఆ అంతిమ యాత్ర ప్రజలతో, అభిమానులతో ఏకంగా 10 కిలోమీటర్ల మేర సాగింది…
చెన్నైలోని ఐలాండ్ గ్రౌండ్స్ నుండి డీఎండీకే ప్రధాన కార్యాలయానికి దారి పొడవునా నిల్చుని విజయకాంత్ భౌతిక కాయంపై పూలు చల్లారు… తమ అభిమానాన్ని చాటుకున్నారు… మనసున్నోడు. ఎవరికి కష్టం వచ్చినా విలవిలలాడి పోయే మనస్తత్వమే అతడిని గొప్పోడిని చేసింది… ఆయనకు 71 ఏళ్లు. తమిళ నాట రాజకీయాలలో మనుషులంటే అభిమానం, అంతకు మించిన దాతృత్వం తనను ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబెట్టేలా చేసింది…
తమిళ సినీరంగంలో ఆఫీస్ బాయ్ నుంచి నటీనటులు, నిర్మాత, దర్శకులకు ఒకే రకమైన భోజనం అందించేలా చేయడంలో కీలక పాత్ర పోషించాడు… అత్యంత బలమైన నాయకురాలిగా ఉన్న జయలలితతో సైతం కొన్ని అంశాల్లో విభేదించాడు… డీఎండీకే పార్టీని స్థాపించి తాను నిజమైన కెప్టెన్ అని నిరూపించాడు …
విజయకాంత్ అసలు పేరు నారాయణన్ విజయరాజ్ స్వామి నాయుడు… (పూర్వీకులు మన తెలుగు వాళ్లే…) 25 ఆగస్టు 1952లో మధురైలో పుట్టాడు… ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించాడు… 2001లో అత్యున్నత పౌర పురస్కారం కలైమామణి అందుకున్నాడు… శాసన సభలో 16వ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు… తను నటుడే కాదు దర్శకుడు, నిర్మాత, పొలిటికల్ లీడర్, పరోపకారి… పిలిస్తే పలికే కెప్టెన్… తనను నల్ల (కరప్పు) ఎంజీఆర్ అనే వారు…
ఆయన సినిమాలు ఎక్కువగా తెలుగు, హిందీలోకి అనువాదం అయ్యాయి… ఐనా సరే, తన కెరీర్ లో కేవలం తమిళ చిత్రాలలో మాత్రమే నటించాడు… ఎప్పుడో 1979లో ఇనిక్కుం ఇలమై సినిమాతో ప్రారంభమైన నటన 2015 దాకా సాగింది… తన ఆసక్తి విద్యారంగం మీద కూడా అధికం…
2001లో ఆండాల్ అళగర్ ఇంజనీరింగ్ కాలేజీ స్థాపించాడు… 2010లో కెప్టెన్ టీవీని స్టార్ట్ చేశాడు… 2012లో కెప్టెన్ న్యూస్ 24 న్యూస్ ఛానల్ కు శ్రీకారం చుట్టాడు… హాస్య నటుడు వడివేలుతో వివాదం, రజినీకాంత్‌పై చేసిన విమర్శలు విజయకాంత్‌ను కొంత ఇబ్బందికి గురి చేసింది… ఐనాసరే, తను నమ్మిన బాటను వదిలిపెట్టలేదు… ఈ లోకాన్ని విడిచిపెట్టేవరకు కూడా…!!
Share this Article