‘‘తాజా సమాచారం ప్రకారం… వచ్చే ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ పార్టీ తరపున కడప ఎంపీ స్థానానికి పోటీ చేసే అవకాశం ఉంది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాశ్ రెడ్డి ఇప్పుడు కడప ఎంపీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయనే వైసీపీ అభ్యర్థి కావచ్చు. అయితే, కడప ఎంపీ స్థానం నుంచి జగన్ రెడ్డి భార్య భారతి రెడ్డి పోటీ చేయాలనుకుంటున్నట్టు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ తరఫున షర్మిల పోటీ చేస్తే భారతీ బరిలోకి దిగకపోవచ్చు. బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడుగా ఉన్న అవినాశ్ రెడ్డిని ఈ ఎన్నికల్లో ఓడించాలని వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో పలువురు పట్టుదలగా ఉన్నారు. షర్మిల పోటీకి దిగితే అవినాశ్ రెడ్డికి వ్యతిరేకంగా వైఎస్ కుటుంబ సభ్యులతోపాటు వివేకా కుమార్తె డాక్టర్ సునీత కూడా ఆమె తరఫున ప్రచారం చేయవచ్చునని అంటున్నారు. షర్మిల ఎన్నికల బరిలోకి దిగితే అదొక సంచలనం అవుతుంది…’’
ఇదీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసుకున్న కొత్త పలుకులో ఓ పేరా… అప్పుడప్పుడూ చాలా విచిత్రమైన రాతలకు సాహసిస్తాడు తను… వైఎస్ షర్మిల మీద తను అవ్యాజమైన అభిమానం దేనికో అర్థం కాదు, తను బలంగా వ్యతిరేకించే జగన్‌ను ఆమె వ్యతిరేకిస్తున్నది కాబట్టి తన శ్రేయోభిలాషి అయిపోయిందా..? (నిజానికి షర్మిల జగన్ పంచాయితీ అనేది కల్పితమనీ, జగన్ కనుసన్నల్లో నడుస్తున్న ప్రహసనమనీ అంటారు కొందరు…) కానీ మొన్నమొన్నటిదాకా ఆమె తెలంగాణ పల్లకీని తెగమోసిన రాధాకృష్ణ, ఆమెను తెలంగాణ జనం తిరస్కరించాక, ఆమె తెలంగాణ పల్లకీ దూకి పారిపోయాక ఇప్పుడిక ఆమెను ఆంధ్రా పల్లకీ ఎక్కిస్తున్నాడు రాధాకృష్ణ…
ఇక ఆమెను మునగచెట్టు ఎక్కించడం స్టార్ట్ చేశాడు… అప్పుడే 20, 30 మంది సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యేలు ఆమెతో టచ్‌లోకి వచ్చారట, కేవీపీ యాక్టివ్ అయిపోయాడట, ఆమె నాయకత్వంలో ఏపీలో కాంగ్రెస్ పుంజుకుంటుందని రాహుల్ బాగా ఆశలు పెట్టుకున్నాడట, ఇదంతా జగన్‌ను దెబ్బేనట, ఆమె ప్రభుత్వ వ్యతిరేక వోట్లు చీల్చదట, తెలుగుదేశం-జనసేన వోట్లనూ చీల్చదట, జగన్‌కు పడే పాజిటివ్ వోట్లనే పంచుకుంటుందట, అంతిమంగా తన చంద్రబాబు మళ్లీ సీఎం అయిపోతాడట… మరి ఇప్పుడు ఇదే షర్మిల స్థానం ఏమిటట..? అది మాత్రం చెప్పడు ఆర్కే…
Ads
నిజంగానే ఆమెతో 20, 30 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు టచ్‌లోకి వచ్చారనే అనుకుందాం… వాళ్లందరినీ జగన్ కావాలనే వదులుకుంటున్నాడు కదా, మరి తనకు నష్టమేమిటి..? ఐప్యాక్, వలంటీర్లు చెప్పినట్టు జగన్ వింటున్నాడనీ, తన ఎమ్మెల్యేలు, తన ఎంపీలను పురుగుల్లాగా తీసిపడేస్తున్నాడని ఆర్కే బాధ… మరి అదే ఐప్యాక్ పీకే చంద్రబాబుతో ఎందుకు భేటీ వేశాడో మాత్రం ఆర్కే చెప్పడు… (అసలు ఐప్యాక్ జగన్ కోసం పనిచేస్తోందా..? ఐప్యాక్ నుంచి పుట్టుకొచ్చిన మరో రిషి సంస్థ పనిచేస్తోందా..? ఆర్కే ఓసారి ఆరా తీసుకుంటే బెటర్…)
తను ఎక్కడి దాకా వెళ్లిపోయాడు అంటే… షర్మిల కడప స్థానం నుంచి పోటీచేసే అవకాశం ఉందట… అక్కడ సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడు… తను మళ్లీ పోటీచేస్తాడట వైసీపీ అభ్యర్థిగా… కానీ జగన్ భార్య భారతి పోటీచేసే సూచనలూ కనిపించాయట, ఇప్పుడు షర్మిల పోటీచేయబోతోంది కాబట్టి భారతి తప్పుకుంటుందట… అసలు జగన్ ప్రభుత్వంపై పోరాడాలనుకుంటే షర్మిల అసెంబ్లీకి పోటీ చేయాలి కదా.., తెలుగుదేశం-జనసేనతో కాంగ్రెస్ బంధం ఏమిటో ముందు తేలిపోవాలి కదా… లోకసభకు పోటీ చేయడం దేనికి..? అవునూ, ఇదే ఆర్కే ఆమెకు కర్నాటక నుంచి రాజ్యసభ సీటు ఇస్తారనీ రాసినట్టు గుర్తు…
పోనీ, షర్మిల ఏకంగా పులివెందుల నుంచే జగన్ మీద పోటీచేయొచ్చు కదా… అరెరె, ఆర్కేకు ఇంకా ఈ థాట్ రానట్టుంది… అవునూ, గతంలో ఇదే జగన్ మీద తన బాబాయ్ వివేకా పోటీచేసినప్పుడు ఏం జరిగిందో, ఏ ఫలితం వచ్చిందో ఆర్కేకు గుర్తులేనట్టుంది ఫాఫం… తెలంగాణలో చేసినట్టే ఆంధ్రాలో కూడా ఆమె పల్లకీ మోసీ మోసీ సమయం చూసి హఠాత్తుగా కింద పడేస్తాడేమో… సో, షర్మిలా బహుపరాక్… బహుపరాక్… ఇంతకీ వైఎస్పార్టీపీ అనబడే పార్టీని కాంగ్రెస్‌లో నిమజ్జనం చేస్తారా..? ఎప్పుడు..?!
Share this Article